- యాంటీ నార్కొటిక్ బ్యూరో ఇకపై ఈగల్
- మాదక ద్రవ్యాల దందా చేస్తే కఠిన చర్యలు
- సేవించిన వారిపై కూడా..
- తెలంగాణను మత్తు ఫ్రీ స్టేట్‌గా మార్చడమే లక్ష్యం
- ఏడాదిగా తమ వంతు బాధ్యతగా స్వేచ్ఛ – బిగ్ టీవీ కథనాలు
- సక్సెస్‌ఫుల్‌గా ‘Say No To Drugs’ క్యాంపెయిన్
- మెడికల్ షాపుల్లో అమ్మకాలపై స్టింగ్ ఆపరేషన్లు
- ఎప్పటికప్పుడు యువతలో అవగాహన కల్పిస్తూ వార్తలు
- రాష్ట్రవ్యాప్తంగా భారీ హోర్డింగ్స్‌తో ప్రచారం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ – బిగ్ టీవీ ఇన్వెస్టిగేటివ్ బ్యూరో
Telangana: మత్తు ఫ్రీ స్టేట్‌గా తెలంగాణను మార్చడమే లక్ష్యం.. ఏడాది క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న సంకల్పమిది. ఈ లక్ష్య సాధనలో తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో గణనీయ ఫలితాలను సాధించింది. మాదక ద్రవ్యాల దందా చేస్తున్న విదేశీయులతోపాటు లోకల్ పెడ్లర్లను కటకటాల వెనక్కి పంపిస్తున్నది. పకడ్బందీగా విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నది. అదే సమయంలో మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఎదురయ్యే అనర్థాలపై విద్యార్థినీ, విద్యార్థులు, యువకులకు అవగాహన కల్పిస్తున్నది. ఈ క్రమంలో మాదక ద్రవ్యాల దందాను అరికట్టడంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ఒకరికి లాభం.. మరొకరికి శాపం
బంగారు భవిష్యత్ ఉన్న వేలాది మంది యువకులను మాదకద్రవ్యాలకు అలవాటు చేస్తూ వారిని క్రమంగా మృత్యుముఖానికి నెడుతున్న ముఠాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. నైజీరియా, టాంజానియా తదితర ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారితోపాటు తేలికగా డబ్బు సంపాదించే లక్ష్యంతో లోకల్ పెడ్లర్లు ఈ మృత్యు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. సముద్ర మార్గం ద్వారా విదేశాల నుంచి కొకైన్, ఎండీఎంఏ, హెరాయిన్ తదితర ప్రాణాంతక మత్తును దేశంలోని వేర్వేరు పోర్టులకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి గోవా, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ తదితర సిటీలకు సప్లై చేస్తున్నారు. మరోవైపు, సరిహద్దుల్లో పాక్ ప్రేరేపిత మత్తు వ్యాపారులు డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలను ఏటా వందల కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలను మన దేశంలోకి పంపిస్తున్నారు. ప్రధానంగా పంజాబ్ రాష్ట్రంలో ఉన్న పాక్ సరిహద్దుల్లో ఈ దందా కొనసాగుతున్నది. ఇక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఏటా వేల కిలోల్లో గంజాయి హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై తదితర సిటీలకు చేరుతున్నది. ఇలా వేర్వేరు మార్గాల్లో వచ్చి పడుతున్న మాదక ద్రవ్యాలకు వేలాది మంది బానిసలవుతున్నారు. ఈ క్రమంలో మాదక ద్రవ్యాలను కొనడానికి కావాల్సిన డబ్బు కోసం నేరాలకు సైతం పాల్పడుతున్నారు. అయిన వాళ్లను హత్యలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు.
ఉడ్తా తెలంగాణ కాకూడదని..
ఈ పరిణామాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి తెలంగాణను మత్తు ఫ్రీ స్టేట్‌గా మార్చడమే లక్ష్యమని ప్రకటించారు. దీని కోసం పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వపరంగా ఎలాంటి అండ కావాలన్నా అందించడానికి సిద్ధమని చెప్పారు. యాంటీ నార్కొటిక్ బ్యూరోను బలోపేతం చేశారు. ఇదే క్రమంలో స్వేచ్ఛ – బిగ్ టీవీ మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ బాధ్యతలో మేముసైతం అంటూ రాష్ట్రవ్యాప్తంగా భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసి ‘Say To No Drugs’ ప్రచారం చేశాయి. అంతేకాకుండా మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా జరుగుతున్న అమ్మకాలపై స్టింగ్ ఆపరేషన్లు చేశాయి. మత్తు మెడిసిన్స్‌తో యువత పెడదారి పడుతున్న తీరును కళ్లకు కట్టినట్టు వార్తలు ప్రసారం చేశాయి. ఏడాది కాలంగా మత్తు మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేందుకు స్వేచ్ఛ – బిగ్ టీవీ మీడియా తరఫున తమ వంతు బాధ్యతతో ముందుకు వెళ్తున్నాయి.
Read Also- Youtube New Rules: రూల్స్ మార్చిన యూట్యూబ్… ఇకపై వారికి కుదరదు
లక్ష్య సాధనలో అద్భుత ఫలితాలు
మత్తు ఫ్రీ స్టేట్‌గా తెలంగాణను మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్న యాంటీ నార్కొటిక్ బ్యూరో ఈ దిశలో అద్భుత ఫలితాలను సాధిస్తున్నది. ఒక్క 2024లోనే 1,942 కేసులు నమోదు చేసి 4,682మంది నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 149.95 కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. నిందితులకు చెందిన రూ.55.8 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. మరో 122 కేసుల్లో ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత సంవత్సరం ఒక్క జనవరిలోనే మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం 183 కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. దాంతోపాటు గంజాయి అమ్మకాలకు సంబంధించి మరో 160 కేసులు నమోదు చేసి 561 కిలోలకు పైగా గంజాయిని సీజ్ చేసి నిందితులను కటకటాల వెనక్కి పంపించారు. 2024లో నైజీరియా, టాంజానియా, పాలస్తీనా, యెమన్, సూడాన్, నేపాల్ దేశాలకు చెందిన 17మందిని అరెస్ట్ చేయగా ఈ సంవత్సరం వేర్వేరు దేశాలకు చెందిన 12 మందిని కటకటాల వెనక్కి పంపించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, గోవా తదితర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం ఏర్పరుచుకుని పకడ్బందీగా దాడులు చేస్తూ మత్తు గ్యాంగుల భరతం పడుతున్న యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు ఆయా కేసుల్లోని నిందితులకు శిక్షలు పడేలా చూస్తున్నారు. 2024లో మాదక ద్రవ్యాల దందా చేస్తూ పట్టుబడిన వారిలో 17మందికి 20 సంవత్సరాల జైలు శిక్షలు పడ్డాయి. మరో ఇద్దరికి 12 సంవత్సరాలు, 20 మందికి పదేళ్లు, ఇద్దరికి అయిదేళ్ల చొప్పున కారాగార శిక్ష విధిస్తూ ఆయా కోర్టులు తీర్పులు చెప్పాయి.
అవగాహనా కార్యక్రమాలు
ఓవైపు మత్తు దందా చేస్తున్న వారికి చెక్ పెడుతుండడంతోపాటు మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాల గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థి దశలో ఉన్న పిల్లలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా మాదకద్రవ్యాలకు అలవాటు పడుతుండడంతో వారిపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారు. ఈ క్రమంలో స్కూళ్లు, కాలేజీల్లో మాదకద్రవ్యాల అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎదురయ్యే నష్టాలను వివరిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఎలా ఉంటుందో చూద్దామనో స్నేహితులు చెప్పారనో ఒక్కసారి మత్తు పదార్థాలు తీసుకుంటే ఆ తరువాత దానిని మానుకోలేక క్రమంగా మృత్యు ముఖానికి చేరుకోవడం ఖాయమని వివరిస్తున్నారు.
ఇకపై ఈగల్
మాదక ద్రవ్యాల దందాకు సమర్థవంతంగా చెక్ పెడుతున్న తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరోను మరింత పటిష్ట పరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీని కోసం కావాల్సిన వనరులన్నింటినీ సమకూరుస్తామని ప్రకటించారు. యాంటీ నార్కొటిక్ బ్యూరో పేరును మారుస్తూ ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) గా మార్చారు.