Jagadish Reddy: గోదావరి, బనకచర్లపై అన్ని పార్టీలు ఏకం కావాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యేలు నలమోతూ భాస్కర్ రావు , రవీంద్ర కుమార్ , డాక్టర్ మెతుకు ఆనంద్ , మాజీ ఎంపీ లింగయ్యయాదవ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గోదావరి నీళ్లను తరలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించడం లేదని మండిపడ్డారు. కృష్ణా నది నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పడు గోదావరి విషయంలోనూ తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబును చర్చలకు పిలవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పనికిమాలిన చర్య గా అభివర్ణించారు. అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. చంద్రబాబుతో చర్చలు చేస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ఒక వర్గం మీడియా పథకం ప్రకారం తెలంగాణలో రాజకీయ పార్టీల పంచాయతీగా గోదావరి జలాల అంశాన్ని చూపెడుతోందని మండిపడ్డారు. గోదావరి నదీ జలాలు తెలంగాణ బతుకుదెరువు అంశం అని, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు సరైన మార్గంలో లేవు అన్నారు.
గోదావరి,కావేరి లింక్ అని చంద్రబాబు నాయుడు చెప్పడంపెద్ద మోసం అని దుయ్యబట్టారు. గోదావరి,కావేరి లింక్ పై ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఎప్పుడో అభ్యంతరం చెప్పిందని, చంద్రబాబు మాయలో మనం పడవద్దు అని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎంపీలు,కేంద్ర మంత్రులు గోదావరి జలాల అంశంపై అవగాహన పెంచుకోవాలన్నారు. త్వరలోనే గోదావరి ట్రిబ్యునల్ వచ్చే అవకాశం ఉందన్నారు. ట్రిబ్యునల్ రాకముందే 200 టీఎంసీలకు హక్కు కల్పించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. మోడీకి చంద్రబాబునాయుడు ఊపిరిగా మారారన్నారు. పిలవాల్సింది అపెక్స్ కౌన్సిల్ ను చంద్రబాబు నాయుడును కాదు అన్నారు.
ప్రభుత్వం కార్యాచరణ తీసుకొకపోతే ప్రజలనుకలుపుకుని రాజకీయ పార్టీగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతు సంబురాలు ఎందుకు? ఎవరికోసం? అని ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ఒంటెద్దు నరసింహారెడ్డి ,చింతల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.