Pawan Kalyan: అవును.. మీరు వింటున్నది నిజమే. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌తో (Thalapathy Vijay) జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తలపడనున్నారు. ఏంటిది.. సినిమాల్లోనా..? కొంపదీసి ఇద్దరి సినిమాలు ఒకేరోజు రిలీజ్ కాబోతున్నాయా? అని అనుకుంటున్నారేమో అలా అనుకుంటే పప్పులే కాలేసి బొక్కాబోర్లా పడినట్లే. సినిమా పరంగా కాదండోయ్.. రాజకీయంగానే. అదేంటి విజయ్ తమిళనాడు.. ఈయనేమో ఆంధ్రప్రదేశ్ కదా..? అని మళ్లీ డౌట్ వచ్చింది కదూ..! ఓకే ఇలాంటి మరెన్నో సందేహాలు క్లియర్ కావాలన్నా.. ఆదివారం రోజు ప్రత్యేకించి మరీ మురగన్ కార్యక్రమానికి పవన్ ఎందుకు వెళ్లారు? ఆయన ఒక్కరే ఎందుకెళ్లాల్సి వచ్చింది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా ఈ వార్త చకచకా చదివేయండి మరి..!
Read Also- Janasena: పుంజుకుంటున్న బీజేపీ.. మంత్రి పదవికే అంకితమైన పవన్.. జనసేనకు ఎందుకీ గతి?
ఇదండోయ్ సంగతి..
పవన్ కళ్యాణ్.. పార్టీ అధినేత అయినప్పటికీ రెండు చోట్ల ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి నుంచి ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే సేనాని పేరు మార్మోగిపోయే వరకూ ఎదిగిపోయారు. ఇంకా చెప్పాలంటే పడిలేచిన కెరటం అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 151 అసెంబ్లీ స్థానాలతో కనీవినీ ఎరుగని రీతిలో గెలిచిన వైసీపీని (YSR Congress) చెప్పి మరీ.. అథ:పాతాళానికి తొక్కేసిన వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ మాత్రమే. అదీ ఆయన దమ్ము.. ధైర్యం. ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి గెలిచిందంటే ఆయన సాయం, శక్తి సామర్థ్యాలు.. కృషి మాటల్లో చెప్పలేనిది అంతే. అందుకే పవన్‌కు ఇటు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు.. అటు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు (Narendra Modi, Amit Shah) ఆ రేంజిలో ప్రియారిటీ ఇస్తుంటారు. యావత్ ప్రపంచ వ్యాప్తంగా పవన్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ మధ్యనే హిందువులకు బాగా దగ్గరవ్వడానికి ‘సనాతన ధర్మం’ అని అవతారం కూడా ఎత్తారు. దీంతో రోజురోజుకూ పవన్‌కు ఎక్కడలేని పాపులారిటీ వచ్చేస్తోంది. అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగినా స్టార్ క్యాంపెయినర్‌గా సేనానియే ముందుంటున్నారు. ఇందుకు మహారాష్ట్రలో పవన్ చేసిన ఎన్నికల ప్రచారమే తార్కాణం. ఆయన ప్రచారం చేసిన ప్రతిచోటా బీజేపీ విజయదుందుభి మోగించింది. అంతకుముందు కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లారు. ఢిల్లీకి కూడా వెళ్లాల్సి ఉంది కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేదు.
Read Also- Tollywood: ‘ముందు పెంచుకో.. ఆ తర్వాతే ఛాన్స్’.. స్టార్ హీరో కుమార్తెకు చేదు అనుభవం!
ఇప్పుడు ‘తమిళ’ వంతు!
ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాలతో మన చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లి గెలిపించుకొని వచ్చిన పవన్ కళ్యాణ్‌ను.. ఇప్పుడు తమిళనాట కాషాయ జెండా ఎగరేయడానికి ఆయన సేవలను బీజేపీ పెద్దలు వాడుకుంటున్నారు. అందుకే ఇప్పటికే దేవాలయాల సందర్శనకు వెళ్లడం.. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా ట్వీట్లు, ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపడం.. మరీ ముఖ్యంగా హిందీ వ్యవహారంలో అక్కడి ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం ఇవన్నీ చూశాం. అందుకే అధికార డీఎంకే, ముఖ్యమంత్రి స్టాలిన్.. తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్‌ను ఢీకొట్టడానికి పవన్ బరిలోకి దిగుతున్నారు. ఇందుకే తమిళనాడులో ఏ కార్యక్రమం జరిగినా సరే ముందుగా పవన్‌కే పిలుపు వస్తోంది. ఆదివారం నాడు కూడా లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో, మురుగన్‌కు నెలవైన తమిళనాడు రాష్ట్రంలో, మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరంలో జరగనున్న ‘మురుగ భక్తర్గల్ మానాడు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సభలో మాట్లాడుతూ.. ‘ ఇల్లేమో దూరం.. అసలే చీకటి గాఢాంధకారం’ అనే డైలాగ్ పేల్చారు. 2014లో హైదరాబాద్‌లో జనసేన పార్టీ ఆవిర్భావం చేసినప్పుడు లక్షల మంది ముందు తాను మాట్లాడతానని అనుకోలేదన్నారు. అందరూ ధర్మం వైపు నిలబడాలని పవన్ పిలుపునిచ్చారు. ఆ మధ్య పార్టీని విస్తరించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. తమిళనాడులో కూడా పోటీచేస్తాను అన్నట్లుగానే పవన్ హింట్ ఇచ్చారు. అప్పట్నుంచే గ్రౌండ్ వర్క్ జరుగుతోందని ప్రచారానికి.. పవన్ వరుస పర్యటనలతో ప్రాధాన్యత సంతరించుకున్నది.
పవనే ఎందుకు?
తమిళనాడుకు పవన్ మాత్రమే వెళ్తూ వస్తున్నారు.. ఆయన్నే బీజేపీ (BJP) ఎందుకు ఎంచుకున్నది అనే దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. తిరుపతి దాటుకుని వెళ్తే చెన్నై.. అక్కడికి వలస వెళ్లిన వాళ్లు లక్షలాదిగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించేది మన తెలుగోళ్లే. అందుకే తెలుగు వారి ఓట్లను ఆకర్షించేందుకు పవన్‌ను ఒక ఆయుధంగా బీజేపీ వాడుకుంటోంది. ఇదిలా ఉంటే.. పవన్ పుట్టింది ఆంధ్రాలోనే అయినా పెరిగింది మాత్రం తమిళనాడులోనే. అలా ఆయనకు పరిచయాలు, పలుకుబడి కూడా గట్టిగానే ఉంది. అక్కడి ప్రజలతో, రాజకీయ నేతలతో మంచి సంబంధాలు, పరిచయాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు పనిమీద పడబోతున్నాయి. మరీ ముఖ్యంగా.. తమిళనాట నాటికీ, నేటికీ సినిమా స్టార్ల హవానే నడుస్తున్నది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, శివాజీ గణేష్, విజయ్‌కాంత్, శరత్ కుమార్, ఉదయనిధి స్టాలిన్, కమల్‌హాసన్, ఖుష్బు, దళపతి విజయ్ ఇలా ఒకరా ఇద్దరా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. వీరంతా తమిళనాట రాజకీయాల్లో ఓ ఊపు ఊపిన.. ఊపుతున్న వారే. అందుకే దళపతి కూడా దీన్ని క్యాష్ చేసుకొని రాణించాలని గట్టిగానే ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు తమిళనాడులో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం ‘స్టార్’లు ఎవ్వరూ లేరు. విజయ్ ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే ఎంట్రీ కాబట్టి పరిస్థితులు అనుకూలించవు. అందుకే.. తమిళనాట కాషాయ జెండాను రెపరెపలాడించడానికి పవన్‌ను బీజేపీ రంగంలోకి దింపుతోంది. ఇప్పట్నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టి రానున్న ఎన్నికల్లో చక్రం తిప్పేలా చేయడానికి అన్ని విధాలుగా రూట్ మ్యాప్‌ను కమలనాథులు ఇస్తున్నారు. పవన్ దెబ్బకు స్టాలిన్, విజయ్.. ఉదయనిధి ఏ మాత్రం తట్టుకుంటారో.. చూడాలి మరి.
Read Also- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం.. ఇంత సడన్‌గా ఎందుకిలా?