Banakacherla project (imgecredit:twitter)
తెలంగాణ

Banakacherla project: పొలిటికల్ ఫైట్‌లో న్యాయం జరగకపోతే లీగల్ ఫైట్

Banakacherla project: బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోడీతో సహా అందరి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పొలిటికల్ ఫైట్లో న్యాయం జరగకపోతే లీగల్ ఫైట్ చేద్దామని తెలిపారు. సచివాలయంలోని నీటి పారుదల శాఖ మంత్రి కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించనున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్లమెంట్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు జరిగే నష్టాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ మా ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యం అన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలని కోరారు. రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదులే జీవనాధారణమన్నారు. ప్రజాప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని, వారి విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు.

గోదావరి నీళ్లు 3 వేల టీఎంసీలు

తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్రప్రభుత్వం 21-9-2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరి నీళ్లు 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కేసీఆర్ అన్నారన్నారు. 3 టీఎంసీలు వృథాగా పోతున్నాయని మొదట మాట్లాడిందే కేసీఆర్ అన్నారు. ఈ అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఎవరు ఏం మాట్లాడారో అంతా దస్త్రాల రూపంలో ఉందన్నారు. 8 పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డు చేశారన్నారు. ఆ సమావేశంలో హరీష్ రావు కూడా పాల్గొన్నారన్నారు. 2019 వరకు ఇది రకరకాల కారణాలతో వాయిదాపడుతూ వచ్చిందన్నారు. మళ్లీ 13 ఆగస్టు 2019 లో రాయలసీమను రతనాల సీమ చేస్తామని ఆనాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. గోదావరి జలాలలను రాయలసీమకు తరలించాలని కేసీఆర్, జగన్ ప్రగతి భవన్ లో నాలుగుసార్లు సమావేశమై నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటెల రాజేందర్ , బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు వెల్లడించారన్నారు.

తెలంగాణకు బనకచర్లను గుదిబండ

బనకచర్ల ప్రాజెక్టుకు ఆనాడే అంకురార్పణ జరిగిందన్నారు.ఈ మీటింగ్ మినిట్స్ ను రిఫరెన్స్ గా చూపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బనకచర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి అఫీషియల్ డాక్యుమెంట్స్ మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణకు కృష్ణాలో 299 టీఎంసీలు సరిపోతాయని ఆనాడు కేసీఆర్ ఒప్పుకొని సంతకం చేశారన్నారు. ఆ నాడు కేసీఆర్ చేసిన సంతకం ఇవాళ తెలంగాణకు ప్రతిబంధకంగా మారిందని మండిపడ్డారు. గోదావరి- బనకచర్ల విషయంలో 2016 లో కేసీఆర్, చంద్రబాబు మాట్లాడుకున్న అంశాల సాకుతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకువెళుతోందని, బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని కెసీఆర్ ఆనాడు మాట్లాడారన్నారు. ఏపీ చేపట్టేది 200 టీఎంసీ ప్రాజెక్టు కాదు 300 టీఎంసీల కోసం అని, ఆనాడు కేసీఆర్ 400 టీఎంసీలు తీసుకోవచ్చని అంగీకరించారన్నారు. మేం వాదనలకు వెళ్లదలచుకోలేదు.. అందుకే తెలంగాణకు నష్టం జరగొద్దని జలశక్తి మంత్రిత్వశాఖకు పిర్యాదు చేశామన్నారు.

Also Read: Special Meeting On Banakacherla Project: బనకచర్లపై పీపీపీ.. లోక్‌సభ రాజ్యసభ సభ్యులకు ఆహ్వానం!

ఈ పాపానికి కారకుడు మీ మామనే

ఏ అంశం వచ్చినా ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా బీఆరెస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు. వాళ్లు సెంటిమెంట్ తో మళ్లీ పార్టీని బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతాంగాన్ని కష్టాల నుంచి బయటపడేసేందుకు ఆనాడు కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామన్నారు. కేసీఆర్, హరీష్ సంపూర్ణ అవగాహనతో ప్రభుత్వానికి సహకరించినా, సూచనలు చేసినా స్వీకరిస్తాం అన్నారు. కానీ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం మాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ ఈ పాపానికి కారకుడు మీ మామనే పాపాల భైరవులు మీరు అని మండిపడ్డారు. కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో కమీషన్లకు కక్కుర్తి పడి కుట్రలు చేశారని, ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరని ఆ బురద మాపై చల్లాలని చూస్తున్నారన్నారు.వీళ్ళు ఏనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడలేదన్నారు. పాలమూరు జిల్లాల్లో మొదలైన ఏ ప్రాజెక్టును వీళ్లు పూర్తిచేయలేదన్నారు. పదేళ్లలో పెండింగ్ లోనున్న ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు.

తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుతో గ్రావిటీతో సాగునీరు అందేది, కమిషన్ల కక్కుర్తితో లక్షకోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు కూడా సాగు నీరు అందివ్వలేదని మండిపడ్డారు. పదేళ్లు 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను గాలికి వదిలేశారన్నారు. వాళ్ల ఇల్లు నింపుకునేందుకు రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. కానీ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మేం ప్రయత్నం చేస్తున్నామన్నారు. మేం కష్టపడి ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభిస్తే మనుషులు చనిపోతే వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు హుందాగా వ్యవహరించాలి. అబద్ధాలతో కాలం వెళ్లదీయొద్దు అని సూచించారు.ఇవాళ మేం నిజాలు బయటపెట్టాం తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? అని నిలదీశారు.సాగునీటి ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ, రీజనల్ రింగురోడ్డు, మూసీ ప్రక్షాళన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవొద్దా? అని ప్రశ్నించారు. మీరు నిధులు ఇస్తామంటే చెప్పండి మేం మీ ఫామ్ హౌస్ కే వస్తాం.. 50 వేల కోట్లు ఇవ్వండి.. ప్రభుత్వం తరపున బాండ్లు సమర్పిస్తాం అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం అన్నారు. ఈ విషయంలో మాకు ఎలాంటి శష-భిషలు లేవు.. సామ,దాన, దండోపాయాల్లో మొదటి దశలో ఉన్నామన్నారు.

ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే మీ భ్రమ

చంద్రబాబు నాయుడికి సూచన చేస్తున్నా కేంద్రంలో పలుకుబడి ఉందని ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే మీ భ్రమ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు మా ప్రణాళిక మాకుందన్నారు. చంద్రబాబు కేసీఆర్ చెప్పారని కాదు గోదావరి బేసిన్ లో 3వేల టీఎంసీలు మిగులు జలాలు ఉన్నాయని మీరు నమ్మితే 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతులు ఇచ్చాక మీరు మిగులు జలాలు తీసుకోండి అన్నారు. కేసీఆర్ తెలంగాణకు చేసిన తీరని ద్రోహం వల్లే ఏపీకి నీళ్లు వెళుతున్నాయన్నారు. మేడిగడ్డ గుండెకాయ లాంటిది.. అది లేకపోతే ఆ ప్రాజెక్టు ఉన్నా ప్రయోజనం లేదన్నారు. పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే తెలంగాణకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కృష్ణానది జలాలు జూరాలలో తెలంగాణకు వస్తాయని, ఆ నీటిని వాడుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. దీనికి కారణం కేసీఆర్ కాదా? రాయలసీమ ప్రాజెక్టులకు మీరే కదా ఒప్పుకున్నది అని నిలదీశారు. గురువారం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి బనకచర్లపై మా అభ్యంతరాలను వివరిస్తామన్నారు. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం అందరూ కలిసిరావాలని కోరారు.

Also Read: Chiranjeevi: చిరుకు అప్పట్లోనే టీడీపీలోకి ఆహ్వానం.. ఎన్టీఆర్ మాట వినుంటే..?

గోదావరి-బనకచర్లను వ్యతిరేకిస్తూ తీర్మానం

అవసరం అయితే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీం కోర్టుకైనా వెళ్తామన్నారు. నీటి ఒప్పందాలపై నిపుణులైన న్యాయవాదులను నియమించుకుంటామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. గోదావరి-బనకచర్లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించుకున్నామన్నారు. అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతామని వెల్లడించారు. జలాల విషయంలో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళదామని ఎంపీలను కోరారు. సమావేశంలో పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, రేణుక చౌదరి, బలరాం నాయక్, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, వద్దిరాజు రవి చంద్ర, డీకే అరుణ, రఘునందన్ రావు, సురేష్ షెట్కర్, రామ సహాయం రఘురాంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

 

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్