PC Meena Reporting: ‘రెక్కీ’ వంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తర్వాత దర్శకుడు కృష్ణ పోలూరు ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్ వివరాలను మేకర్స్ ప్రకటించారు. అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన తారాగాణంగా కృష్ణ పోలూరు రూపొందించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ (Viratapalem: PC Meena Reporting). ‘రెక్కీ’తో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణ పోలూరు ఈ ఉత్కంఠ భరిత వెబ్ సిరీస్‌తో మరోసారి ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వబోతున్నారు. ఈ సిరీస్ జూన్ 27న భారతదేశపు అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయినటువంటి జీ5 (ZEE5)లో ప్రీమియర్ కానుందని అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు.
గ్రామీణ వాతావరణంలోని సహజ సౌందర్యాల నడుమ ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను రూపొందించారు. ఒక గ్రామంలో ఉండే రహస్యాలు, వాటిని ఛేదించేలా ఇంట్రెస్టింగ్‌గా సాగే ఇన్వెస్టిగేషన్ అన్నీ కలిపి సీటు ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను రూపొందించినట్లుగా టీమ్ చెబుతోంది. 1980ల నాటి మారుమూల, భయానక గ్రామమైన విరాటపాలెం గ్రామంలోని కొన్ని అంశాల చుట్టూ తిరిగే కథతో దర్శకుడు ఈ సిరీస్‌ని మలిచారు. విరాటపాలెం గ్రామానికి ఉన్న శాపం ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణించడం. దీంతో దాదాపు దశాబ్ద కాలంగా ఒక్క వివాహం కూడా ఆ గ్రామంలో జరగదు. అలా చివరకు పెళ్లిళ్లు అనేవి లేకుండా ఆ గ్రామం భయంతో స్తంభించిపోతుంది. అలాంటి గ్రామానికి ఒక పోలీసు కానిస్టేబుల్ (అభిజ్ఞ వూతలూరు) రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో ఈ సిరీస్ ఉండబోతోంది.
Also Read- Aap Jaisa Koi: డైరెక్ట్‌గా ఓటీటీలోకి మాధవన్, ఫాతిమా సనా షేక్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే!
ఈ సందర్భంగా అభిజ్ఞ వూతలూరు మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్ట్‌లో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ముఖ్యంగా భయానికి అనుకూలంగా వాస్తవాలను తోసిపుచ్చే ప్రపంచంలో.. తిరిగి ప్రశ్నించే ఓ శక్తివంతమైన పాత్రలో ఇందులో కనిపిస్తాను. రియల్ లొకేషన్స్, గ్రామీణ వ్యక్తులతో కలిసి షూటింగ్ చేయడం నిజంగా మరిచిపోలేని అనుభూతి. ప్రేక్షకులు ఈ సిరీస్‌ను ఇష్టపడతారని నేను నమ్ముతున్నానని అన్నారు. దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ.. ‘రెక్కీ’ తర్వాత మరోసారి ZEE5తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌లో ఓ ఆసక్తికరమైన విషయం ఉంటుంది. ప్రతి వధువు తన పెళ్లి రోజున చనిపోతుందనే నమ్మకం.. ముందు భయంగా, ఆ భయం నిశ్శబ్దంగా మారిపోతుంది. అలా దశాబ్ద కాలంగా వివాహాలను ఆపివేసిన ఆ గ్రామంలో నెలకొన్న నిశ్శబ్దాన్ని ఛేదించడమే ఈ సిరీస్ కథ.. అని తెలిపారు. ప్రేక్షకులు మేం క్రియేట్ చేసిన ప్రపంచాన్ని ఎప్పుడెప్పుడు చూస్తారా? అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని అన్నారు సౌత్ ఇండియన్ స్క్రీన్స్ నిర్మాత శ్రీరామ్.
Also Read- Uppu Kappurambu: కీర్తి సురేష్ ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్‌గా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే!
ZEE5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్ మాట్లాడుతూ.. జీ5లో సాధారణ ప్రజలను ప్రతిబింబించే, వారికి కనెక్ట్ అయ్యే కథల్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ ఉత్కంఠను కలిగిస్తూనే సామాజిక సందేశాన్ని అందిస్తుంది. భయం అనేది సమాజాన్ని ఎలా నియంత్రించగలదో, ధైర్యం అనేది దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఎలా భంగపరచగలదో ఈ సిరీస్ చెబుతుంది. ఇది కేవలం సూపర్ నేచురల్ థ్రిల్లర్ మాత్రమే కాదు.. భయం, సత్యం మధ్య జరిగే భయంకరమైన యుద్ధం. జూన్ 27 నుండి ZEE5లో మాత్రమే ప్రసారం అయ్యే ఈ సిరీస్‌ను మిస్ అవ్వకండని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
