Seethaka on KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (Police Command Control Centre) వద్ద మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కు చురకలు అంటించారు. కేటీఆర్ జైలుకు పోవాలని కుతూహలంగా ఉన్నారని విమర్శించారు. వీలైనంత త్వరగా జైలుకు పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
కేటీఆర్ ప్లాన్ ఇదే!
బీఆర్ఎస్ లో కేటీఆర్, కవితల మధ్య ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొని ఉందని మంత్రి సీతక్క అన్నారు. లిక్కర్ స్కామ్ (Liqour Scam) లో జైలుకు వెళ్లి వచ్చిన కవిత.. బీసీ ఎజెండా ఎత్తుకున్నారని గుర్తుచేశారు. దీంతో తాను వెనకపడ్డానని భావించిన కేటీఆర్.. తానూ జైలుకు పోయే పథకం రచించుకున్నారని అన్నారు. కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నారన్న మంత్రి.. రాష్ట్రాన్ని తోడేళ్లలా దోచుకొని ప్రస్తుతం కొంగ వినయం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ పొగరుతో మాట్లాడుతుంటే.. సీఎం రేవంత్ పౌరుషంతో ప్రసంగిస్తున్నారని చెప్పారు. కేటీఆర్ అరెస్ట్ వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
ఆ వార్తలపై సీతక్క ఆవేదన
ఇవాళ జరిగే క్యాబినేట్ సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై (Local Body Elections) స్పష్టత వస్తుందని మంత్రి సీతక్క అన్నారు. తాను ఎన్నికల డేట్ చెప్పినట్లు మీడియాలో తప్పు ప్రచారం జరుగుతోందని అన్నారు. మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకొని వార్తలు ఇవ్వాలని సూచించారు. తాను అనని మాటలను అన్నట్లుగా వార్తలు రావడం ఆవేదనకు గురిచేసిందని చెప్పారు. కార్యకర్తల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వారం పది రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పానని గుర్తుచేశారు. వారం రోజుల్లో షెడ్యూల్ వస్తుందని, నోటిఫికేషన్ వెలబడుతుంది అన్నట్టుగా కొందరు వార్తలు రాశారని పేర్కొన్నారు. వారం రోజుల్లో షెడ్యూల్ వస్తుందని చెప్పినట్లుగా ఒక్క ఆధారం అయిన చూపిస్తారా? అంటూ నిలదీశారు.
Also Read: Mahesh Goud on Srinivas: పొంగులేటి వర్సెస్ టీపీసీసీ చీఫ్.. మంత్రిపై మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం!
రిజర్వేషన్ల వల్లే ఆలస్యం!
గత 20 సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్నానని.. లోకల్ ఎన్నికలు ఎలా జరుగుతాయో తనకు తెలియదా? అంటూ సీతక్క ప్రశ్నించారు. క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. నేటి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక న్యాయం సాకారం అవుతుందని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే క్రమంలో ఎన్నికలు ఆలస్యమవుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని సీతక్క అన్నారు.