Pagudakula Balaswamy: చిత్ర పరిశ్రమకు, గద్దర్ (Gaddar) కు సంబంధమేంటని? చిత్ర పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తి పేరుతో అవార్డులు అందజేయడం అవివేకమని, ఎంతోమంది మహానటులు ఉన్నా.. వారిని కాదని గద్దర్ పేరిట అవార్డులివ్వడమేంటని విశ్వహిందు పరిషత్ (Vishva Hindu Parishad) రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి (Balaswamy) ఘాటు విమర్శలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, దాసరి నారాయణ రావు, రావు గోపాలరావు, సావిత్రి తదితర మహానటులు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేశారని, వారి పేరుతో చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేలా అవార్డులు అందజేయడం సముచితమని, కానీ రాజకీయ లబ్ధి కోసం సంబంధంలేని ఒక వ్యక్తి పేరుతో బలవంతంగా అవార్డులు అందజేస్తామంటే అది నియంతృత్వానికి పరాకాష్ట అని చెప్పుకొచ్చారు.
Also Read: KTR: నేడు ఏసీబీ ఎదుటకు కేటీఆర్.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ!
ఎంతోమంది విద్యార్థులు, దేశభక్తులు, జాతీయవాదులు, పోలీసులను పొట్టన పెట్టుకున్న వ్యక్తి చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటే మంచిదని చురకలంటించారు. ఈరోజు నంది అవార్డు ప్లేస్ లో గద్దర్ అవార్డు అందజేయడమంటే తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రాణం పెట్టి జీవితాలర్పించిన మహా మహానటులను అవమానించినట్టేనని పేర్కొన్నారు. ఈ అంశంపై చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నటులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం విచిత్రంగా ఉందన్నారు.
మొండిగా వ్యవహరించి నేను చెప్పిందే వేదం, నేను చేసిందే శాసనమంటూ పాలకులు నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తే సమాజం హర్షించదన్నారు. నియంతృత్వ ధోరణితో ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో గత పాలకులను చూసి నేటి పాలకులు నేర్చుకుంటే అందరికీ మంచిదని బాలస్వామి సూచించారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా గద్దర్ భార్య, గద్దర్ కూతురు పాటలు పాడుతూ, మాట్లాడటం దేశాన్ని ధిక్కరించడం కాదా అని ప్రశ్నించారు.
Also Read: Harish Rao: బనకచర్లతో గోదావరి జలాల్లో తెలంగాణకు నష్టం!