- Maoist Bandh:
- జూన్ 20న ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్
- ఆపరేషన్ కగార్‌ను ఖండిస్తూ పిలుపు
- బంద్ జయప్రదం చేయాలని మావోయిస్టుల లేఖ
- భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ జగన్ పేరిట లేఖ
వరంగల్, స్వేచ్ఛ: ఆపరేషన్ కగార్‌ను ఖండిస్తూ మావోయిస్టులు జూన్ 20న బంద్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ జగన్ పేరిట మావోయిస్టులు ఆదివారం లేఖ విడుదల చేశారు. 45 ఏళ్ళ సుదీర్ఘ విప్లవోద్యమ అనుభవం కలిగిన సీనియర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ టీఎల్ఎన్ఎస్ చలం అలియాస్ ఆనంద్, సుధాకర్, గౌతంతో పాటు 30 ఏళ్ల విప్లవోద్యమ అనుభవం కలిగిన కామ్రేడ్ మైలారపు అడెల్ అలియాస్ భాస్కర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు మరో ఏడుగురిని క్రూరంగా హత్య చేసిన హిందుత్వ ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వ దమనకాండను ప్రజలు తీవ్రంగా ఖండించాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు.
అటవీ సంపదను దోచిపెట్టే లక్ష్యంతోనే
‘‘2026 మార్చి 31 నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలించేందుకు 2024 జనవరి నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలో మావోయిస్టు ఉద్యమ ప్రాంతాలన్నిటిలో తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తూ నరసంహారాలను కావిస్తున్నది. అటవీ సంపదను, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ఏకైక లక్ష్యంతో అటవీ ప్రాంతంలోని ఆదివాసులపై వారికి అండగా ఉండే మావోయిస్టు పార్టీపై వరుసగా దాడులు చేస్తూ 550 మందికి పైగా హత్యలు చేసింది. మే 21 న మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సంబాల బసవరాజ్‌తో పాటు 27 మంది కామ్రేడ్స్‌ను పొట్టనపెట్టుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జూన్ 3 నుంచి నేషనల్ పార్క్‌లో మరొక దాడిని నిర్వహించి ఏడుగురు కామ్రేడ్స్‌ను హత్య చేసింది’’ అని లేఖలో పేర్కొన్నారు.
Read this- Amit Shah: నక్సలిజంపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
దారి తప్పిన కామ్రేడ్ గౌతం
‘‘జూన్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వారం రోజుల పాటు నేషనల్ పార్క్ ఏరియా అంతటా ఏరియా డామినేషన్ చేస్తూ వేల సంఖ్యలో బలగాలు చుట్టుముట్టి పెద్దఎత్తున జల్లెడపట్టాయి. అన్నపూర్ గుట్టలను జూన్ 4న బలగాలు మోహరించి, చుట్టుముట్టి దాడికి పూనుకున్నాయి. జూన్ 4 రాత్రి చిమ్మచీకటిలో దళం కామ్రేడ్స్ రిట్రీట్ అవుతున్నప్పుడు దారి తప్పిన కామ్రేడ్ గౌతం దళం నుంచి విడిపోయాడు. జూన్ 5న ఉదయం 9-10 గంటల మధ్యన ఒంటరిగా ఉన్న కామ్రేడ్ గౌతంను శత్రు బలగాలు చుట్టుముట్టడంతో వారితో పోరాడుతూ కామ్రేడ్ గౌతం అమరుడయినాడు. కామ్రేడ్ గౌతం పశ్చిమ గోదావరి జిల్లాలోని సత్యవోల్ గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో 6వ సంతానంగా 1957 జులై 4 తేదీన జన్మించాడు. విజయవాడలో ఆయుర్వేధ మెడికల్ కాలేజీలో చదువుతూ ఆర్ఎస్ యూ లో చేరి విప్లవ బాట పట్టి 1981లో పూర్తికాలం కార్యకర్తగా తన కృషిని మొదలు పెట్టాడు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ, అటవీ ప్రాంతాలలో పని చేస్తూ 1997లో రాష్ట్ర కమిటీ సభ్యుని స్థాయికి ఎదిగాడు. 2001 ఏఓబీ స్పెషల్ జోన్ ఏర్పడినప్పుడు అక్కడకి బదిలీ అయి సెక్రెటరీయేట్ మెంబర్ గా, ఏఓబీ సెక్రెటరీగా తన సేవలు అందించాడు. 2004లో ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ చర్చలు జరిపినప్పుడు సుధాకర్ పేరుతో మావోయిస్టు పార్టీ ఏఓబీ ప్రతినిధిగా పాల్గొన్నాడు. 2009 నుండి అమరుడు అయ్యే వరకు క్రాంతి పత్రిక సంపాదికుడుగా, రాజకీయ గురువుగా తన సేవలను అందించాడు’’ అని లేఖలో పేర్కొన్నారు.
Read this- Plane Crash: ఎయిరిండియా ‘ప్రమాదాన్ని’ వీడియో తీసిన బాలుడు ఇతడే
పోరాడుతూ అమరుడైన కామ్రేడ్ భాస్కర్
‘‘జూన్ 6వ తేదీన పెద్దకాక్లేర్ గ్రామ సమీపంలో ఉన్న మరొక దళంపై శత్రువు బలగాలు దాడిచేసినప్పుడు వారితో పోరాడుతూ కామ్రేడ్ భాస్కర్ అమరుడు అయ్యాడు. కామ్రేడ్ భాస్కర్ పేద రైతాంగ దళిత కుటుంబంలో పుట్టిపెరిగాడు. ఇంటర్మిడియేట్ చదువుతూ ఆర్ఎస్ యూలో పనిచేసాడు. 1995లో పూర్తికాలం కార్యకర్తగా పార్టీలోకి భర్తీ అయి, ఉమ్మడి అదిలాబాద్ ప్లాటూన్ లో పనిచేసాడు. ఉమ్మడి అదిలాబాద్ డివిజన్ కమిటీ డీవీసీఎం గా పనిచేసాడు. 2015లో రాష్ట్ర కమిటీ సభ్యుడుగా ఎన్నుకోబడ్డాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కొమరం భీం-మంచిర్యాల డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉంటూ తన బాధ్యతలను నిర్వహిస్తూ అమరుడయినాడు. జూన్ 6, 7 తేదీ లలో కామ్రేడ్ రైనీ (నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు) అనారోగ్య కారణంగా ఇరుపగుట్ట గ్రామంలో నిరాయుధంగా ఉన్నప్పుడు పోలీసులు పట్టుకొని హింసించి హత్య చేశారు’’ అని కొమరంభీం- మంచిర్యాల డివిజన్ కి చెందిన సభ్యులు కామ్రేడ్ సంతోష్ (భాస్కర్ గార్డ్), కామ్రేడ్ రజని, నేషనల్ పార్క్ ఏరియా 2 పీఎల్ సభ్యుడు కామ్రేడ్ లాల్సూ పేరిట లేఖ విడుదల చేశారు.