KTR on CM Revanth: లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా సూటిగా ప్రశ్నిస్తున్నట్లు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. పదేండ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్‌లో ఉందన్నారు. ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో, ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా? అని సవాల్ విసిరారు. తన పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీసుల పేరుతో నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడని దుయ్యబట్టారు. రోజుకో కుట్ర చేస్తున్నాడనీ, కానీ ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని ఈ సీఎం, ఈ వైఫల్యాల కాంగ్రెస్ సర్కారు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.
రూ.44 కోట్లు వెనక్కి రప్పించడం చేతకాదా?
ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ అధికారిక బ్యాంకు ఖాతా నుంచి పారదర్శకంగా, సాధికారికంగా పంపిన రూ.44 కోట్లు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్‌లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపించాడన్నారు. హైదరాబాద్ నగరానికి తెలంగాణకు ఎంతగానో పేరు తీసుకొచ్చిన ఫార్ములా ఈ రేసును అర్ధాంతరంగా రాజకీయ దురుద్దేశంతో రద్దు చేసిన రేవంత్ రెడ్డి, ఫార్ములా ఈ సంస్థ వద్ద ఉన్న రూ.44 కోట్ల ప్రజాధనాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం పక్కనపెట్టి, నోటీసుల పేరుతో ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. తనకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన, విచారణ పేరుతో సాగదీసినా ఫార్ములా ఈ అంశం సంపూర్ణ పారదర్శకంగా జరిగిందని, ఈ విషయం అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. మరోసారి ఇదే అంశంలో ఏసీబీ తనకు నోటీసు ఇచ్చిందని, చట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం(ఈ నెల16న) ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు, విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానన్నారు. ఓవైపు మీ దివాలాకోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఓ ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా మీ అసమర్థతను చాటుకుంటున్న ఈ తరుణంలో విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకుని, వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ సిద్ధం కావాలన్నారు. లై డిటెక్టర్ పరీక్ష ద్వారా ఎవరు నేరస్తులు తెలంగాణ ప్రజలు తేల్చేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.
ఫార్మూలా ఈ కార్ రేసు కేసు పూర్వపరాలు
❄️ హైదరాబాద్‌లో 2022లో జరిగిన ఫార్ములా ఈ రేసు కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఖాతా నుంచి రూ.55కోట్లు ఫార్ములా ఈ సంస్థకు బదిలీ అయ్యాయి. ఈ బదిలీలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
❄️ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నిధులు బదిలీ చేసినట్లు ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ రేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన, ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
❄️ డిసెంబర్ 19, 2024న ఏసీబీ కేటీఆర్‌పై సెక్షన్ 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), సెక్షన్ 120-బి (క్రిమినల్ కుట్ర) కింద కేసు నమోదు చేసింది.
❄️ డిసెంబర్ 29, 2024న ఏసీబీ కేటీఆర్‌కు మొదటి నోటీసు జారీ చేసి, జనవరి 6, 2025న విచారణకు హాజరు కావాలని కోరింది.
❄️ జనవరి 6న కేటీఆర్ ఏసీబీ కార్యాలయం వద్దకు వెళ్లినప్పటికీ, అధికారులు ఆయనను కార్యాలయంలోకి అనుమతించలేదు. దీంతో రోడ్డుపైనే రాతపూర్వక స్పందనను అందజేశారు. ఈ సందర్భంలో కేటీఆర్ తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 31, 2024 వరకు ఆయన అరెస్టుపై స్టే విధించిన హైకోర్టు, విచారణను వాయిదా వేసింది.
❄️ మే 26, 2025న ఏసీబీ మరోసారి కేటీఆర్‌కునోటీసు జారీ చేసి, మే 28న విచారణకు హాజరు కావాలని కోరింది.
కేటీఆర్ ఈ నోటీసును ధృవీకరిస్తూ, మే 28న యూఎస్, యూకే పర్యటన కారణంగా విచారణకు హాజరు కాలేనని, తిరిగి వచ్చిన వెంటనే సహకరిస్తానని ఏసీబీకి లేఖ రాశారు. తాను చట్టాన్ని గౌరవించే పౌరుడిగా దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ పేర్కొన్నారు.
❄️ డిసెంబర్ 28, 2024న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేటీఆర్‌కు జనవరి 7, 2025న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.
❄️ ఈ కేసులో మరో కీలక వ్యక్తి అయిన హెచ్‌ఎండీఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ ఇంజినీర్ ఇన్ చీఫ్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారణ చేశారు.
❄️ ఈ కేసులో ఫిర్యాదు చేసిన ఎంఏయూడీ మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ఏడు గంటల పాటు ఏసీబీకి స్టేట్‌మెంట్ ఇచ్చారు.
❄️ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.
❄️ తాజాగా జూన్ 13న ఏసీబీ అధికారులు కేటీఆర్ మరోసారి నోటీసు ఇచ్చి, ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకోవాలని కోరారు.