Teacher Eligibility Test: ఉపాధ్యాయ ఉద్యోగాలకు ముందడుగుగా భావించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) రాసే అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవడం పెద్ద పరీక్షగా మారింది. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు ఇతర జిల్లాల్లో కేటయించడంతో ముందుగానే అక్కడికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన అభ్యర్థిని నిజామాబాద్ జిల్లాకు వేయడంతో వ్యయ భారం పెరగనున్నది. ఆప్షన్లు ప్రయారిటీ ప్రకారం ఇచ్చుకున్నా చివరి ప్రయారిటీని సెంటర్‌గా వేశారంటూ పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్, నిజామాబాద్‌కు చెందిన పలువురు అభ్యర్థులు తమ జిల్లాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినా తమకు హైదరాబాద్ సెంటర్‌గా వేశారంటూ చెబుతున్నారు. అయితే, గతంతో పోలిస్తే ఇలాంటి ఇబ్బందులు కాస్త తగ్గినట్లుగా తెలుస్తున్నది. చాలా వరకు అభ్యర్థులకు తొలి ఆప్షన్ ప్రకారం సెంటర్లు కేటాయించినా, పలు ప్రాంతాలకు చెందిన వారికి మాత్రం దూరపు జిల్లాల్లో వేశారని చెబుతున్నారు.
Also Read: TG on Panchayats: గ్రామ పంచాయతీల్లో 17 రకాల లక్ష్యాలు.. సక్సెస్ చేసేలా ప్రణాళికలు
మొత్తం 1,83,653 దరఖాస్తులు
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్లను విద్యాశాఖ ఇప్పటికే వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, ఈనెల 18వ తేదీ నుంచి 30 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 1,83,653 దరఖాస్తు చేసుకున్నారు. అందులో పేపర్-1కు 63,261 మంది, పేపర్ 2కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, టెట్ అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల దూరం ప్రధాన సమస్యగా మారింది. అభ్యర్థుల స్వస్థలాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో ప్రయాణ ఖర్చు, సమయం, ఇతర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మహిళలు, గర్భిణులు, బాలింత అభ్యర్థులకు ఈ సమస్య మరింత తీవ్రతరం కానుంది. దూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు ఇబ్బందులు, సమయాభావం అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తున్నది. అందుకే అభ్యర్థులు సమీప జిల్లాల్లో అయినా కేటాయిస్తే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గతంలో జరిగిన తప్పిదాలే మళ్లీ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాది రెండుసార్లు టెట్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. కానీ, గతంలో జరిగిన తప్పిదాల నుంచి బటయపడే మార్గాలను అన్వేషించడంలేదని పలువురు అభ్యర్థులు విమర్శలు చేస్తున్నారు. అయితే, పరీక్ష కేంద్రాలు ఎన్నుకునే విషయంలో నిర్దేశించిన సంఖ్యకు మించి దరఖాస్తులు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చాలామందికి ఇతర జిల్లాల్లో సెంటర్లు వేసినట్లు తెలుస్తున్నది.
కాగా, ప్రయాణ దూరాన్ని బట్టి అభ్యర్థులు ముందుగానే చేరుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉండగా ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు టెట్ నిర్వహించనుండగా మొత్తం 9 రోజులు, 16 సెషన్‌లో ఎగ్జామ్ జరగనున్నది. ఉదయం 9 నుంచి 11:30 వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు సెకండ్ సెషన్‌లో పరీక్ష కొనసాగనున్నది. ఈనెల 18, 19, 24, 30వ తేదీల్లో పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు, 20, 24, 27 తేదీల్లో పేపర్-1కు సంబంధించిన పరీక్షలు నిర్వహించనున్నారు. 28, 29, 30 తేదీల్లో పేపర్-2 సోషల్ స్టడీస్ పేపర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
Also Read: Amma Mata Anganwadi Bata: మా పాపకు అంగన్‌వాడీ కిట్ కథలే చెబుతున్నా.. కలెక్టర్ వల్లూరి క్రాంతి