BRS Party: కాళేశ్వరం కమిషన్ విచారణకు గులాబీ అధినేత కేసీఆర్ (KCR) హాజరవుతున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ భారీ జనసమీకరణకు గులాబీ పార్టీ (BRS Party) సన్నద్ధమవుతుంది. బీఆర్ఎస్ భవన్ (BRS Bhavan)కు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని ఇప్పటికే పిలుపు ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణను సాధించిన వ్యక్తిపై అకారణంగా అక్రమంగా నోటీసులు ఇచ్చిందని, కేసీఆర్‌ను డైరెక్టుగా ఎదుర్కోలేక నోటీసుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుందని, చావునోట్లో తలపెట్టి రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేశారని ఇప్పటికే బీఆర్ఎస్ మండిపడుతుంది. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడమే కుట్రలు అంటూ విమర్శలకు ఎక్కుపెట్టింది.
ఫాంహౌస్‌కు కాదు.. హైదరాబాద్ రండి
కేసీఆర్ రాష్ట్రంలో అధికారం కోల్పోయాక తొలిసారి కాళేశ్వరం కమిషన్ విచారణకు బుధవారం హాజరవుతున్నారు. హాజరుఅవుతారా? కారా? అనేది చర్చజరిగింది. కానీ, హాజరు అవుతారని మాజీ మంత్రి హరీశ్ రావు సైతం క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ వస్తుండటంతో క్యాడర్‌ను విచారణ జరిగే బీఆర్కే భవన్‌కు తరలిరానున్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తిని విచారణ చేస్తుండటంతో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ఉమ్మడి మెదక్‌కు చెందిన నేతలు సైతం క్యాడర్ ఎవరు ఫాం హౌస్‌కు రావొద్దని నేరుగా హైదరాబాద్‌కు రావాలని సూచించినట్లు సమాచారం. అదే విధంగా అన్ని జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు సైతం తరలిరావాలని తెలంగాణ భవన్ నుంచి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. మరోవైపు కేసీఆర్ దృష్టిలో పడేందుకు ఇదే సరైన సమయం అని కొందరు నేతలు భావిస్తున్నారు. వారు సైతం కొంతమందిని తీసుకొచ్చి తన సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నవారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రధానప్రతిపక్షంలో ఉండటంతో ఇప్పుడే నేతగా ఎదిగే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు. అందుకే ఉదయమే బీఆర్కే భవన్‌కు చేరుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. భారీగా తరలివచ్చి కేసీఆర్‌కు మద్దతుగా నిలువాలని భావిస్తున్నారు.
విమర్శలు ఎక్కుపెట్టిన బీఆర్ఎస్
కాళేశ్వరం ప్రాజెక్టును నిష్పల ప్రాజెక్టుగా చిత్రీకరించేందుకు, రైతులను ఇబ్బందులకు గురిచేయాలనే లక్ష్యంతో పాటు కేసీఆర్‌ను బద్నాం చేయాలని కాంగ్రెస్ పూనుకుందని ఇప్పటికే బీఆర్ఎస్ విమర్శలకు ఎక్కుపెట్టింది. తొమ్మిదిన్నర బీఆర్ఎస్ పాలనలో సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేశారని, రైతు, మహిళ, యువత, వృద్ధులతో పాటు గర్భిణులకు కేసీఆర్ కిట్ ఇలా పలు పథకాలు ప్రవేశపెట్టారని, ఇరిగేషన్ కోసం కృషిచేశారని, తెలంగాణ బాగును కాంక్షించిన కేసీఆర్‌పై విచారణ పేరిట వేధింపులకు గురి చేయాలని కాంగ్రెస్ చూస్తున్నదని, కేసీఆర్ వెంట తెలంగాణ సమాజం ఉందని తెలియజేసేందుకే జనసమీకరణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒక వైపు ప్రభుత్వ కక్షసాధింపులకు భయపడబోమని పేర్కొంటూనే మరోవైపు అక్రమ కేసులతో పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తుందనే అస్త్రాలను సంధిస్తుంది. తెలంగాణను దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామీగా నిలిపేందుకు కృషి చేసిన కేసీఆర్‌పై కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు సాకుతో ప్రతీకార చర్యలకు పాల్పడుతుందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గులాబీ పార్టీ భావిస్తున్నది. ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకే కమిషన్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుందని, ప్రశ్నించేవారిపై కేసులు పెడుతుందని ఆరోపిస్తుంది.
ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్లాన్
కమిషన్ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తున్నది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్ విచారణతో పేరుతో ఇబ్బందులకు గురిచేశారని, రైతుబంధు, ఉచిత కరెంట్, ఆసరా పింఛన్లు పెంపు, నిరుద్యోగులకు ఉపాధి, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులు, ఏర్పడిన తర్వాత వచ్చిన మార్పులు, సాధించిన ప్రగతిని మరోసారి వివరించాలని భావిస్తుంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలకు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను వివరించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారెంటీలపైన అనుసరిస్తున్న విధానం, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని గులాబీ భావిస్తున్నది. అదే విధంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలను సైతం తూర్పార బట్టేందుకు సిద్ధమవుతుంది.
కేసీఆర్‌తో కవిత వస్తారా?
కేసీఆర్ కమిషన్ విచారణకు వస్తుండటంతో ఎమ్మెల్సీ కవిత వస్తారా? రారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈనెల 9న పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు కమిషన్ విచారణ సందర్భంగా భవన్‌కు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు నేతలు తరలివచ్చారు. కేటీఆర్ సైతం వచ్చి హరీశ్ రావుతో ముచ్చటించారు. అయితే, కవిత మాత్రం రాలేదు. ఇప్పుడు కేసీఆర్ హాజరవుతుండటంతో సంఘీభావంగా వచ్చి కవిత అండగా ఉంటారా? లేదా అనేది పార్టీలోనే చర్చకు దారితీసింది. తమ నాయకుడు కేసీఆర్ అని పేర్కొంటున్న కవిత.. ఇప్పుడు బీఆర్కే భవన్‌కు వచ్చి విచారణ కంప్లీట్ అయ్యేవరకు ఉంటారా? అనేది కూడా హాట్ టాపిక్ అయింది. ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరం కమిషన్ విచారణకు రావాలని కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన దగ్గర నుంచి విస్తృత చర్చజరుగుతుంది. ఈ విచారణ అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయ అస్త్రంగా మలుచుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై అస్త్రాలు సంధించాలని, ప్రజల్లోనూ ఇరుకునబెట్టాలని భావిస్తుంది.