Bus Pass Fare: విద్యార్థులపై ఆర్టీసీ భారం మోపింది. బస్ పాస్ చార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వడంతో ఆర్టీసీ చార్జీలను సవరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో జనరల్ బస్ పాస్ చార్జీలు నెలకు రూ.200 అదనంగా భారం పడనుంది. ప్రస్తుతం విద్యార్థులకు నెలకు రూ.400 బస్ పాస్ చార్జీలు ఉన్నాయి. కాగా సవరించిన చార్జీలతో ఇది రూ.600 కు పెరగనుంది. ఆర్టీసీ బస్ పాస్ చార్జీల పెంపు నిర్ణయంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే డిపోల ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించాయి.
సామాన్యులపైనా భారం
బస్ పాస్ చార్జీల పెంపు నిర్ణయంతో విద్యార్థులతో పాటు సామాన్యులపైనా భారం పడనుంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని, అందులో భాగంగా రాష్ట్ర మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే అధికారంలోకి వచ్చాక ఫ్రీ బస్సు పథకాన్ని అమలుచేస్తోంది. అయితే ఆ భారం సర్కార్ పై పడటంతో ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. ఈనేపథ్యంలోనే చార్జీల పెంపు నిర్ణయాన్ని అమలుచేస్తున్నాయని పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉండగా స్టూడెట్ బస్ పాస్ చార్జీలు మూడేండ్ల నుంచి పెంచలేదని, పెరిగిన ఖర్చుల మూలంగా బస్ పాస్, సాధారణ ప్రయాణికుల నెలవారీ బస్ చార్జీలను ఆర్టీసీ సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: Property Tax: ట్యాక్స్ సిబ్బందికి జీహెచ్ఎంసీ.. కలెక్షన్ టార్గెట్!
రూ.10 అదనంగా భారం
హైదరాబాద్ తో పాటు సబర్బన్ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఆర్డినరీ బస్సులు ఓవర్ లోడ్ అవుతున్నట్లు ఆర్టీసీ గుర్తించింది. కాగా ఈ రద్దీని తగ్గించేందుకు సిటీ ఆర్డినరీ బస్సులతో పాటు హైదరాబాద్ లోని మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూడా విద్యార్థులకు అనుమతించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నిర్ణయం బాగానే ఉన్నా చార్జీలను సవరిచండంపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా టోల్ చార్జీలను సైతం పెంచుతూ ఆర్టీసీ నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయంతో ఒక్కో ప్రయాణికుడిపై రూ.10 అదనంగా భారం పడనుంది. అయితే టోల్ ప్లాజాలు నగరంలో ఉండవు కాబట్టి ఈ చార్జీల భారం నగరవాసులపై పడబోదని ఆర్టీసీ స్పష్టంచేసింది.
బస్ పాస్ చార్జీలు తగ్గించాలి
ఆర్టీసీ యాజమాన్యం విద్యార్థుల బస్ పాస్ చార్జీలను 20 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. గతంలో పెంచిన బస్ చార్జీలు, స్టూడెంట్స్ పాస్ చార్జీల కారణంగా గ్రామీణ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ 20 శాతం చార్జీలు పెంచితే బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే చాలా రూట్లలో విద్యార్థులు కోసం బస్సులు నడపడం లేదు. ఆ రూట్లలో సర్వీసులు పెంచి, ఉచిత బస్ సౌకర్యం కల్పించాల్సిన తుణంలో చార్జీలు పెంచే ఆలోచన దుర్మార్గపు చర్య. ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలి. లేకుంటే అన్ని డిపోల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం. ఎస్ రజినీకాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు.
Also Read: Land Encroachments: ఫేక్ నోటరీలతో భూ ఆక్రమణలు.. ఓ కాంగ్రెస్ నేత అంతులేని ఆగడాలు!