Preetham on CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ (SC Corporation Chairman) ప్రీతం ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రి వర్గ విస్తరణలో ఇద్దరు దళితులకు చోటు కల్పించినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలకు తెలియజేశారు. ఆధునిక అంబేద్కర్‌లా సీఎం రేవంత్ రెడ్డి దళితుల పక్షాన నిలిచారని ఆకాశానికెత్తారు. ప్రజా ప్రభుత్వ ఏర్పాటుతో దళితులు స్వేచ్ఛగా గాలి పీల్చుకునే అవకాశం ఏర్పడిందని అన్నారు.
దళితులకు పెద్దపీట
అడ్లూరి లక్ష్మణ్, వివేక్ లను కేబినెట్‌లోకి తీసుకోవడం ద్వారా సాధారణ కార్యకర్తలను సీఎం రేవంత్ రెడ్డి గౌరవించారని ప్రీతం (Preetham) అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో దళితుల గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఎస్సీల భూములను పార్టీ కార్యాలయాల కోసం కేటాయించడం చిన్నచూపుకు ఉదాహరణగా చెప్పవచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ను నియమించి దళితులను గౌరవించిందని గుర్తుచేశారు. దళితుడిని డిప్యూటీ సీఎం (Bhatti Vikramarka), ఫైనాన్స్ మినిస్టర్‌గా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.
Also Read: Kavitha on CM Revanth: సీఎం రేవంత్‌పై కవిత ఫైర్.. వాటిపై తక్షణ చర్యలకు డిమాండ్
ఆ ఘనత కాంగ్రెస్‌దే
దళితులకు గౌరవస్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రీతం అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో లేని విధంగా కాస్మొటిక్ చార్జీలు 50 శాతం మెస్ ఛార్జీలు 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. 50 చోట్ల రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారని అన్నారు. ఎస్సీల సుదీర్ఘ 30 సంవత్సరాల కల.. ఎస్సీ వర్గీకరణను ఒక్క సంతకంతో పూర్తి చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీదని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం మానేసి అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఎంగిలి మెతుకులకు ఆశపడి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)పై దుష్ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.