Bandi Sanjay: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakara Rao) తాజాగా సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభాకర్ రావు మామూలోడు కాదని వ్యాఖ్యానించారు. మాలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురుపోసుకున్నాడని మండిపడ్డారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబం (KCR Family)తో కౌన్సిలింగ్ తంతు పూర్తయ్యిందని.. పథకం ప్రకారమే ఆయన లొంగిపోయి విచారణకు హాజరయ్యారని ఆరోపించారు.
ప్రభాకర్ రావు.. నీచుడు: బండి
సిట్ విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ను బహిరంగ పరచాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), తనతో సహా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) నేతల, జడ్జీల ఫోన్లను ట్యాప్ చేయించిన ఘనుడు ప్రభాకర్ రావు అని చెప్పారు. ప్రభాకర్ రావు వల్ల అనేక మంది జీవితాలు నాశనమయ్యాయని.. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. భార్యాభర్తలు మాట్లాడుకున్న సంభాషణలను కూడా ట్యాప్ చేసిన నీచుడు ప్రభాకర్ అని ఘాటు విమర్శలు చేశారు. భార్యా భర్తలు సైతం ఫోన్లో మాట్లాడుకోలేని దుస్థితిని ఆయన కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Ginger Tea: వర్షా కాలంలో అల్లం టీతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?
ఆ విషయాలను బయటపెట్టాలి
ఎస్ఐబీ మాజీ చీఫ్ ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరముందని బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు? ట్యాపింగ్ ఆడియోలను ఎవరికి పంపారు? ఆ ఆడియోలను అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారు? అన్న విషయాలు బయటకు రావాలని పట్టుబట్టారు. కోర్టు నిబంధనలకు లోబడే ప్రభాకర్ రావుపై సీరియస్ గా చర్యలు తీసుకోవాలని బండి డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందని.. 18 నెలల పాలనలో ఏ ఒక్క అవినీతి కేసు విచారణ కూడా ముందుకు సాగలేదని పేర్కొన్నారు. ఇకనైనా కోర్టులో గట్టిగా వాదనలు వినిపించి.. ప్రభాకర్ రావు సహా ఆయన వెనుకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాలని సూచించారు.