Maganti Gopinath Health Issue: బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవలే అనారోగ్యానికి గురై కోలుకున్నారు. మళ్లీ మరోమారు తీవ్ర అస్వస్థతకు లోనుకావడం కుటుంబ సభ్యులతో పాటు కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు ఏఐజీ ఆస్పత్రికి చేరుకొని గోపినాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు.
మాగంటికి గుండెపోటు
మాగంటి గోపినాథ్.. ఇంట్లో ఉండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం మాగంటి ఐసీయూలో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. వైద్యుల చికిత్స కొనసాగుతున్నట్లు చెప్పారు. వెంటిలేటర్ పై చికిత్సకు మాగంటి సహకరిస్తున్నట్లు ఏఐజీ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. కాగా ఇటీవలే ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చి ఆయన ఇబ్బందిపడ్డారు. మరికాసేపట్లో మాగంటికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేయనున్నారు.
టీడీపీతో రాజకీయ ప్రస్థానం
మాంగటి గోపీనాథ్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన ఆయన 1963 జూన్ 2న హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిఏ పూర్తి చేశారు. మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ (TDP) ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1985 నుండి 1992 వరకు TDP యువజన విభాగం అయిన తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు.
బీఆర్ఎస్‌తో ప్రయాణం
రాష్ట్ర విభజన అనంతరం బీఆర్ఎస్ లో చేరిన ఆయన.. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో BRS టికెట్‌పై జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి పి. విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు. 2022 జనవరి 26న ఆయన BRS హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
Also Read: Kamal Haasan: బాలీవుడ్‌పై ఓపెన్ అయిన కమల్.. మూవీస్ చేయకపోవడంపై షాకింగ్ కామెంట్స్!
ఫ్యామిలీ లైఫ్!
మాగంటి గోపినాథ్ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన భార్య పేరు సునీత. వారికి వత్సల్యనాథ్ అనే కుమారుడు, అక్షర నాగ్, దిసిరా అనే కుమార్తెలు ఉన్నారు. గోపినాథ్ ఎమ్మెల్యేగానే కాకుండా పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (PEC) సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తుండటంతో ఆందోళన నెలకొని ఉంది.