Rajendra Prasad: రీసెంట్‌గా జరిగిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు (SV Krishna Reddy Birthday) వేడుకలలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా నటుడు అలీని ఆయన బూతు మాటతో సంభోదించిన తీరుపై ప్రతి ఒక్కరూ విమర్శలు చేస్తున్నారు. వయసు పెరుగుతున్నా.. బుద్ధి మాత్రం మారలేదంటూ రాజేంద్ర ప్రసాద్‌ని అంతా విమర్శిస్తున్నారు. అంతకు ముందు ఆయన ఇతర ఈవెంట్స్‌లో ప్రవర్తించిన తీరును కూడా బయటపెడుతూ.. నటకిరీటిని తప్పు బడుతున్నారు. ఇకనైనా బుద్ధి మార్చుకోవాలంటూ హితబోధ చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై అలీ (Ali) కూడా స్పందించి.. ఆయన వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.. అసలే పుట్టెడు దు:ఖంలో ఉన్నారు. మా మధ్య ఆ చనువు ఉంది.. దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేయకండి అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. అలీ అంత హుందాగా ప్రవర్తించిన తర్వాత కూడా తన వ్యాఖ్యలపై మాట్లాడకపోతే బాగోదని అనుకున్నారో ఏమో గానీ.. తాజాగా జరిగిన ఓ వేడుకలో రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
Also Read- Pottimama: ఏకంగా రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ పొట్టిమామ గురించి తెలుసా?
ఇకపై ఎవ్వరినీ కూడా నువ్వు అని సంబోధించనని, మీరు అని మాత్రమే పిలుస్తానని, అందరితోనూ మర్యాదగా నడుచుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల నేను మాట్లాడిన మాటలని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. అది వ్యక్తిగత వేడుక అని అనుకున్నాను. మీడియా ఉందని కూడా పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలంటే ప్రేమ ఎక్కువ కావడంతో వచ్చిన మాటలవి. నేను పరిచయం చేసిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆ వేడుకలో ఉన్నవారందరినీ చూసిన తర్వాత నా కుటుంబం అంతా ఇక్కడే ఉందనే ఫీలింగ్ వచ్చేసింది. అందరినీ ప్రశంసించాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడేశా. ఈ వేడుకలో నేను మాట్లాడిన ఫుల్ వీడియో చూస్తే.. అది అందరికీ అర్థమవుతుంది. ఇంతకు ముందు నేను వాళ్లతో అలానే ఉండేవాడిని. కానీ ఇప్పుడు అప్పటిలా ప్రేమాభిమానులు చూపించే పరిస్థితి లేదని నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది..’’ అని చెప్పుకొచ్చారు.
Also Read- Chandrababu: ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా.. ఆ మంత్రులపై చంద్రబాబు తీవ్ర అసహనం!
అలీ అన్నట్లుగా కుమార్తెను దూరం చేసుకున్న బాధలో మైండ్ ఏమైనా అప్‌సెట్ అయ్యిందా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. అప్‌సెట్ అయినది మాత్రం నిజమే కానీ, దాని నుంచి ఎప్పుడో బయటికి వచ్చేశానని తెలిపారు. మొత్తంగా అయితే, పెద్ద దుమారం అవ్వాల్సిన ఈ కాంట్రవర్సీ రాజేంద్రుడి వివరణతో బ్రేక్ పడినట్లే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగింది పక్కన పెట్టేసి, ఇకపై రాజేంద్ర ప్రసాద్ నడుచుకునే తీరుని బట్టి ఆయన పట్ల అందరూ ఓ క్లారిటీకి వస్తారు. మరి రాజేంద్రుడు ఇకపై ఎలా ప్రవర్తిస్తాడనేది మాత్రం చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు