Phone Tapping (imagecredit:twitter)
తెలంగాణ

Phone Tapping: సంచలన మలుపు తిరగనున్న ఫోన్​ట్యాపింగ్​కేసు!

Phone Tapping: రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్​ట్యాపింగ్ కేసు మరో సంచలన మలుపు తిరగనుందా? ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితునిగా ఉన్న నందకుమార్ తన ఫోన్ ను ట్యాప్​చేశారంటూ మరోసారి ఫిర్యాదు ఇవ్వటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ముందుకొస్తున్న ప్రశ్న ఇది. ఈ వ్యవహారంలో తన ఫోన్ ను అక్రమంగా ట్యాప్​చేశారని స్పష్టమైనా అప్పటి బీఆర్​ఎస్​పెద్దల కనుసన్నల్లోనే ఇది జరిగిందని తేలినా అన్ని ఆధారాలతో ఇంతకు ముందే కంప్లయింట్ చేసినా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నందకుమార్ ప్రశ్నిస్తున్నారు. చూస్తోంటే విచారణ పేరుతో టైం పాస్ చేస్తున్నట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్​కుమ్మక్కయ్యాయా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈనెల 5న ఎస్​ఐబీ మాజీ ఛీఫ్​ ప్రభాకర్​ రావు సిట్​విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో మరోసారి అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

2022, అక్టోబర్​26న సైబరాబాద్​పోలీసులు మొయినాబాద్​లోని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్​రోహిత్ రెడ్డికి చెందిన ఫార్మ్​హౌస్​నుంచి ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, హైదరాబాద్ కు చెందిన నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజి స్వామిలను అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ తరపున ఈ ముగ్గురు కలిసి బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన అప్పటి ఎమ్మెల్యేలు పైలట్​ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావులను కొనటానికి ప్రయత్నించారంటూ వారిపై కేసులు పెట్టారు. బీజేపీలో చేరితే ఒక్కొక్కరికి 50 నుంరి 100 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభ పెట్టినట్టుగా ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు. పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం సీక్రెట్​ కెమెరాలతో ఫార్మ్​ హౌస్​లో జరిగిన మొత్తాన్ని రికార్డు చేశారు. దీనిపై అప్పట్లో బీఆర్ఎస్​నాయకులు రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్​మీడియా సమావేశంలో బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చటానికి కుట్రలు చేసిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నందకుమార్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, సింహయాజి స్వామితో మాట్లాడిన రెండు ఆడియో టేపులను కూడా వినిపించారు. పిక్చర్​అభీ బాకీ హై యేతో ట్రైలర్​హై అంటూ పలువురు బీఆర్​ఎస్ నేతలు వ్యాఖ్యానాలు చేశారు.

కేసీఆర్​కు ఎలా అందాయ్?

ఇక్కడ నందకుమార్​మాట్లాడిన ఫోన్​కాల్స్ కు సంబంధించిన ఆడియో టేపులు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతికి ఎలా అందాయన్నది ఇప్పటికీ కోటి డాలర్ల ప్రశ్నగానే మిగిలి ఉంది. చట్టం ప్రకారం ఏదైనా కేసుకు సంబంధించి వీడియో రికార్డింగులైనా ఆడియో క్లిప్పులైనా ఇతన ఆధారాలైనా సాక్ష్యాలుగా పరిగణించాల్సి ఉంటుంది. దర్యాప్తు అధికారులు వీటిని నేరుగా సంబంధిత న్యాయస్థానాలకు సమర్పించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవి బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మాజీ సీఎం కేసీఆర్ చేతికి నందకుమార్ ఆడియో టేపులు చేరటం అక్రమంగా ఫోన్ ట్యాపింగులు జరిగాయన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీనిపై అప్పట్లోనే పెద్ద స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, మాజీ ఎమ్మెల్యే పైలట్​రోహిత్ రెడ్డి తనతో నందకుమార్​మాట్లాడినపుడు మాటలను మొబైల్ లో రికార్డు చేశానని నష్ట నివారణకు ప్రయత్నించారు.

Also Read: KTR – Kavitha: కేటీఆర్ వస్తేనే క్లారిటీ.. కవిత ఎపిసోడ్ పై చర్చించే అవకాశం!

ఇది కరెక్టే అనుకుందాం. మరి, సింహయాజి స్వామితో నందకుమార్ మాట్లాడిన మాటలను మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రికార్డ్​చేసే అవకాశమే లేని నేపథ్యంలో వారి సంభాషణల ఆడియో టేపు ఎలా బయటకు వచ్చిందన్న ప్రశ్నకు ఇప్పటికీ జవాబు లేదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ కేసులో అరెస్టయిన టాస్క్​ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అప్పటి ఎస్​ఐబీ ఛీఫ్​ప్రభాకర్​రావు ఆదేశాల మేరకే ఫోన్లను ట్యాప్​చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడించటం. నిబంధనల ప్రకారం దేశ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నరన్న అనుమానాలు ఉన్నవారి ఫోన్లను మాత్రమే ట్యాప్​చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా హోం మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరి. మరి, నందకుమార్​ఫోన్​ట్యాప్​చేయటానికి అనుమతులు తీసుకున్నారా? తీసుకుంటే ఏ కారణాలు చూపించారన్నది కూడా ఇప్పటికీ శేష ప్రశ్నలుగానే ఉన్నాయి.

మాజీ సీఎం కనుసన్నల్లోనే

కాగా, ఈ వ్యవహారం అంతా మాజీ సీఎం కేసీఆర్ సూచనల మేరకే జరిగిందన్న ఆరోపణలు ఇప్పటికే బలంగా ఉన్నాయి. ఎస్​ఐబీ మాజీ ఛీఫ్​ ప్రభాకర్ రావును ఉపయోగించుకుని ఒక్క నందకుమారే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు, వారి బంధుమిత్రుల ఫోన్లను ట్యాప్​ చేయించారని వేర్వేరు పక్షాలకు చెందిన నాయకులు పలువురు పలమార్లు వ్యాఖ్యానించారు కూడా. కేసీఆర్​ తోపాటు బీఆర్​ఎస్​ లోని మరికొందరు పెద్దలు కూడా దీని వెనక ఉన్నారన్నారు. అయితే, ఎక్కడా దొరకకుండా ఉండటానికి ఫలానా నెంబర్లు ట్యాప్​ చేయమని లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సిట్​ విచారణలో ప్రభాకర్​ రావు పెదవి విప్పితేనే సూత్రధారుల గుట్టు బయట పడుతుందని చెబుతున్నారు. కాగా, తన ఫోన్ ట్యాప్​ చేసిన విషయాన్ని వదిలి పెట్టేది లేదని నందకుమార్ చెబుతున్నారు. తాను సింహయాజి స్వామి, మాజీ ఎమ్మెల్యే పైలట్​ రోహిత్ రెడ్డితో మాట్లాడిన ఆడియో టేపులను స్వయంగా కేసీఆర్ మీడియా సమావేశంలో వినిపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆడియో టేపులు తన వద్దకు ఎలా వచ్చాయన్నది కేసీఆర్​ స్పష్టం చేయాలన్నారు. ఈ క్రమంలోనే మరోసారి తన ఫోన్​ ట్యాపింగ్​ పై ఫిర్యాదు ఇవ్వనున్నట్టు చెప్పారు.

Also Read: GHMC R V Karnan: వివాదాస్పదం కానున్న.. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?