Jupally Krishna Rao: మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై విపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను మంత్రి జూపల్లి కృష్ణారావు తిప్పికొట్టారు. ప్రపంచ స్థాయి ఈవెంట్స్ ను తెలంగాణ నిర్వహించగలదని నిరూపించామని అన్నారు. ఒలంపిక్స్ సైతం నిర్వహించగలమని రుజువైందని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీలను సమర్థవంతంగా నిర్వహించినందుకు పొగడాల్సింది పోయి.. విపక్షాలు విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీల నిర్వహణకు రూ.200 కోట్ల ప్రజల డబ్బును ఖర్చు చేశారని తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు అయిన ఖర్చు రూ.31 కోట్లు మాత్రమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. అందులో రూ.21 కోట్లు స్పాన్సర్ల ద్వారా వచ్చాయని.. ఇంకో రూ.10 కోట్లు కూడా స్పాన్సర్ నుంచి రావాల్సి ఉందని తెలిపారు. అది కూడా వస్తే ప్రభుత్వానికి రూపాయి కూడా ఖర్చు కానట్లేనని అన్నారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రపంచాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చామని జూపల్లి పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులకు ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఇచ్చారని.. వారి ఒక్కో మిల్స్ కు రూ. లక్ష ఖర్చు అయ్యిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. విపక్ష నేత హరీష్ రావు (Harish Rao) చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. వాళ్లకు పెట్టిన భోజనం ప్లేట్ మీల్స్ రూ.8 వేలేనని జూపల్లి వివరణ ఇచ్చారు.
Also Read: Watch Video: ప్రపంచంలోనే వింతైన చావు.. చూస్తే షాక్ కావాల్సిందే!
రాష్ట్రం అప్పుల విషయంలోనూ ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా వారే ప్రజల్లో చులకనవుతున్నారని ఎద్దేవా చేశారు. మిస్ వరల్డ్ పోటీదారులు కాళ్లు కడుక్కునే విషయంలో ఒక మహిళ పొరపాటు చేసిందని.. దాన్ని కూడా విపక్షాలు రాద్దాంతం చేశాయని మండిపడ్డారు. అప్పట్లో కేసీఆర్ కాళ్లు కడిగిన ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి అంశాన్ని ఏమనాలని ప్రశ్నించారు. మిస్ వరల్డ్ ఏర్పాట్లకు సంబంధించి ప్రపంచ దేశాల్లో మంచి రెస్పాన్స్ వచ్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.