Miss World 2025: మిస్ వరల్డ్ 72వగ్రాండ్ ఫైనల్ హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా ముగిసింది. మిస్ వరల్డ్ ఈసారి థాయిలాండ్ కైవసం చేసుకున్నది. సుందరీమణి ఒపల్ సుచాత చువాంగ్ శ్రీ (Opal Suchata) మిస్‌వరల్డ్‌గా నిలిచారు. థాయిలాండ్ సుందరికి 72వ మిస్ వరల్డ్ కిరీటాన్ని సీఎం రేవంత్ రెడ్డి, జూలియా మోర్లీ, క్రిస్టినా పిజ్కోవా అలంకరించారు. కాగా, ఒకటవ రన్నర్ అప్‌గా ఇథియోపియా, రెండవ రన్నర్ అప్‌గా మిస్ పోలెండ్, మూడవ రన్నర్ అప్‌గా మిస్ మార్టినిక్ నిలిచారు. విజేతకు రూ.8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటంను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. దీంతో పాటు ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్రకు అవకాశం ఉన్నది. కాగా, ప్రపంచవ్యాప్తంగా 108 మంది వివిధ దేశాల పోటీదారులు అందం, ఉద్దేశం, ఐక్యతను జరుపుకునే ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడ్డారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వీరంతా పాల్గొని తమ ప్రతిభను చాటటంతో పాటు, తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. ‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. కాగా, మిస్‌వరల్డ్ టాప్ 40లో మరో నలుగురు భామలకు చోటు దక్కింది. వరల్డ్ వైడ్‌గా 120 దేశాల్లో ప్రత్యేక్ష ప్రసారం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. టాప్ 40లో ఒక్కో ఖండంనుంచి పది మంది ఉండేలా ఎంపిక జరిగింది. టాప్ 8 అంటే ఒక్కో ఖండం నుంచి ఇద్దరేసి ఎంపిక చేశారు. అయితే చివరికి మిస్ వరల్డ్ టైటిల్ రేసులో నలుగురు మాత్రమే మిగిలారు.
Read Also- AICC: కమిటీల్లో ఆ మంత్రులకు.. చోటేది?
అయ్యో.. నందినీ.. ఫైనల్ రౌండ్ ఇలా..!
మిస్ వరల్డ్‌లో ఫైనల్ రౌండ్‌లో జడ్జ్‌లు అడిగే ప్రశ్నలకు కంటెస్టెంట్‌లు సమాధానాలు ఇచ్చారు. వాటికి మార్కుల ఆధారంగా విజేతను నిర్ణయించారు నిర్వాహకులు. ఏషియా, ఓషీనియా గ్రూప్ నుంచి భారత్‌కు నందిని గుప్తా ప్రాతినిథ్యం వహించగా, భారత్ గెలిస్తే అత్యధిక టైటిళ్ల విజేతగా రికార్డు నెలకొల్పినట్లు అయ్యేది. కానీ, మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా నిష్క్రమించింది. ఖండాల వారీగా టాప్ 5 నుంచి ఇద్దరిని నిర్వాహకులు షార్ట్ లిస్ట్ చేయగా, ఆసియా నుంచి టాప్ 2లోకి థాయ్‌లాండ్ చేరింది. ఇదిలా ఉంటే.. ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని నిర్వాహకులు షార్ట్ లిస్ట్ చేశారు. ‘ నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావు?’ అని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి అవకాశం దక్కింది. అభ్యర్థుల సమాధానాలకు జడ్జ్‌లు మార్కులు వేశారు. ఖండాల వారీగా.. అమెరికా ఖండం నుంచి మార్టినిక్, ఆఫ్రికా నుంచి ఇథియోపియా, యూరోప్ నుంచి పోలెండ్, ఆసియా నుంచి థాయిలాండ్ బ్యూటీలు నిలిచారు. కాగా, తెలంగాణ ఆతిధ్యం అద్భుతం అని పోలండ్ కాంటెస్టెంట్ కొనియాడారు.

వదల బొమ్మాళీ.. వదల!
మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ (మానవతావాది) అవార్డును నటుడు సోనూసూద్ అందుకున్నారు. కరోనా సమయంలో ఆయన చేసిన మానవతాచర్యలకు గుర్తింపుగా ఈ అవార్డును మిస్ వరల్డ్ నిర్వాహకులు అందించారు. టాలీవుడ్ టాప్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా జ్ఞాపికను సోనూ అందుకున్నారు. ఈ సందర్భంగా స్టేజ్ పైన ‘వదల బొమ్మాళీ.. వదల’ అంటూ డైలాగ్ పేల్చి ప్రేక్షకులను ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సోనూసూద్ కృతజ్ఞతలు చెప్పారు. కాగా, బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్‌లో స్టేజ్ పైన లైవ్ ప్రదర్శనలు ఇచ్చారు. డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో బాలీవుడ్ స్టార్ ఇషాన్ కట్టర్ ఉర్రూతలూగించారు. నాటు నాటు పాటకు స్టెప్పులు ఇరగదీశారు.