Kavitha on KTR: బీఆర్ఎస్ ముఖ్య నేత కవిత (Kalvakuntla Kavitha) వ్యవహారం గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కేసీఆర్ కు కవిత లేఖ రాయడం రాజకీయ దుమారం రేపింది. ఆపై స్పందిస్తూ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ చేసిన కామెంట్స్ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ క్రమంలో కేటీఆర్ పరోక్షంగా కవితకు చురకలు సైతం అంటించారు. నేపథ్యంలో తాజాగా స్పందించిన కవిత.. కేటీఆర్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
పార్టీ నుంచి పంపే సీన్ లేదు
బీఆర్ఎస్ ముఖ్య నేత కల్వకుంట్ల కవిత.. తాజాగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సోదరుడు కేటీఆర్ (KTR)పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను అసలే మంచిదాన్ని కాదన్న కవిత.. నోరు తెరిస్తే బాగోదని వ్యాఖ్యానించారు. మా నాన్నకి నేను లేఖ రాస్తే మీకు ఏంటి నొప్పి? అంటూ కవిత ప్రశ్నించారు. కేసీఆర్ ఒక్కడే తనకు బాస్ అని.. నా మీద పడి ఏడిస్తే ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. తనను పార్టీ నుంచి బయటకు పంపేంత సీన్ ఎవరికీ లేదని కవిత స్పష్టం చేశారు. ఇంకో 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని పేర్కొన్నారు.
గ్రీకు వీరుల్లా ఫోజులు!
తను రాసిన లేఖను.. పార్టీలోని కోవర్టులే బయటపెట్టారని ఇటీవల కవిత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ కు పరోక్షంగా చురకలు అంటించారు. పార్టీలో లీక్ వీరులను బయటపెట్టమంటే గ్రీకు వీరుల్లా ఫోజులు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు నోటీసులు వస్తే ఎవరూ స్పందించలేదని.. వేరే నాయకుడికి వస్తే ఎమ్మెల్యేలు అంతా వెళ్లారని అన్నారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ యూట్యూబ్ ఛానళ్లతో ఇంటి ఆడపడుచుపై కుట్ర చేస్తున్నారు ఘాటు విమర్శలు చేశారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం!
తనకు నీతులు చెప్పేవారికి పార్టీని నడిపే సత్తా లేదని కేటీఆర్ ను ఉద్దేశిస్తూ కవిత అన్నారు. అంతేకాదు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. తాను జైలులో ఉన్నప్పుడే కుట్ర మెుదలైందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా తనను టార్గెట్ చేస్తోందని.. నా లేఖను లీక్ చేసిందెవరో చెప్పాల్సిందేనని కవిత పట్టుబట్టారు. తనకు, కేసీఆర్ కు మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోదని.. తనను దూరం చేస్తే ఎవరికీ లాభమో అందరికీ తెలుసని అన్నారు. తనను కావాలనే ఎంపీ ఎన్నికల్లో ఓటించారని కవిత ఆరోపించారు.
Also Read: Gaddar film Awards: గద్దర్ అవార్డులు.. బెస్ట్ యాక్టర్‌గా బన్నీ.. మిగతా విజేతలు వీరే!
కవితకు షోకాజు నోటీసులు
ఇదిలా ఉంటే మరికొద్దిసేపట్లో కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పార్టీకి నష్టం కలిగించే విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు గాను మరికాసేపట్లో ఆమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీలో ఎవరైనా కార్యకర్తలతో సమానమని అన్నారు. బహిరంగ వ్యాఖ్యలు చేయడం తప్పని పరోక్షంగా చురకలు అంటించారు. తాజాగా మళ్లీ కవిత సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా పెను సంచలనం కలిగిస్తోంది.