Check Dam Blast: నైరుతీ రుతుపవనాల ఆగమనంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సూచనలు చేస్తున్నారు. అదే సమయంలో నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న వాటిపై అధికార యంత్రాగం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలో ఏకంగా ఒక చెక్ డ్యామ్ ను అధికారులు పేల్చివేశారు.
అసలేం జరిగిందంటే?
నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీకి సమీపంలో ఓ చెక్ డ్యామ్ ఉంది. ఎప్పుడు వర్షాలు వచ్చినా అది వరదలకు కారణమవుతూ జీఎన్ఆర్ కాలనీ వాసులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. వర్షాకాలం వచ్చిదంటే తమ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. వరద ముప్పు నుంచి తమను గట్టెక్కించాలని అధికారులను వేడుకున్నారు.
బాంబులతో పేల్చివేత
జీఎన్ఆర్ కాలనీ వాసుల సమస్య.. కలెక్టర్ అభిలాష అభినవ్ దృష్టికి వెళ్లింది. రానున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకోని ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు. చెక్ డ్యామ్ ను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఏకంగా బాంబు పెట్టి చెక్ డ్యామ్ ను లేపేశారు. స్వర్ణవాగుపై నిర్మించిన డ్యామ్ ను బాంబులతో బ్లాస్ట్ చేయించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
చెక్ డ్యామ్‌ను బాంబులతో బ్లాస్ట్ చేసిన అధికారులు
నిర్మల్‌లోని చెక్ డ్యామ్‌ను అధికారులు పేల్చేశారు. వర్షా కాలం నేపథ్యంలో వరద ముప్పు నివారణకు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని జీఎన్అర్ కాలనీకి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు… pic.twitter.com/F6df1xZsak
— ChotaNews App (@ChotaNewsApp) May 29, 2025
కాలనీ వాసులు హ్యాపీ
అయితే ఎంతో కాలంగా తమను వేధిస్తున్న వరద సమస్యకు అధికారులు చెక్ పెట్టడంపై జీఎన్ఆర్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు డ్యామ్ పేల్చివేత గురించి తెలుసుకున్న స్థానిక ప్రజలు.. డ్యామ్ వద్దకు భారీగా తరలివచ్చారు. దూరం నుంచి డ్యామ్ ను పేల్చివేసే దృశ్యాలను తిలకించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి బాంబ్ బ్లాస్టులను అధికారులు చేయడం చాలా అరుదైన విషయమని స్థానికులు చెబుతున్నారు.