Ranga Reddy district: మీ కళ్లెదుటే మీ ఆస్తి ఉన్నా, మీకు తెలియకుండానే వేరొకరి చేతుల్లోకి చేరిపోవచ్చు. మరొకరి పేరున మారిపోవచ్చు. ఫేక్ డాక్యుమెంట్లు, (Fake documents) బినామీ ఆసాములతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ధరణి లొసుగులు, అధికారుల సహకారంతో రంగారెడ్డి జిల్లాలో ఈ తరహా దందా ముమ్మరంగా సాగుతున్నది. అధికారులు అప్రమత్తం అయిన చోట దొంగ రిజిస్ట్రేషన్ల బాగోతం బట్టబయలు అవుతుండగా, కొందరు గుడ్డిగా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. సెల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీతో ఈ తతంగం సాగడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. రిజిస్ట్రేషన్లను (Registrations) రద్దు చేసి అక్రమార్కులపై కేసు నమోదు చేసి చేతులు దులుపు కుంటుండగా అధికారుల పై చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అడపాదడపా అక్కడక్కడా ఈ తరహా అక్రమ వ్యవహారాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
పట్టాదారులకు తెలియకుండానే..
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న(Ranga Reddy District) రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ది చెందుతున్నది. భూములకు విపరీతమైన డిమాండ్ రాగా అదే స్థాయిలో మోసాలు సైతం జరుగుతున్నాయి. కొందరు నకిలీ డాక్యుమెంట్ల తయారీలో సిద్దహస్తులైన వ్యక్తులతో చేయి కలిపి (Fake documents) ఫేక్ డాక్యుమెంట్లను సృష్టిస్తున్నారు. పట్టాదారులకు సంబంధించిన సెల్ ఫోన్లకు వచ్చే ఓటీపీలను వారికి తెలియకుండా తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మీ సేవల ద్వారా స్లాట్ బుక్ చేసుకునే సందర్భంలోనే ఈ అక్రమాలకు బీజం పడుతున్నది.
Also Read: KTR on Congress: రేవంత్ రెడ్డిని కాపాడడం కుమ్మక్కు రాజకీయమే.. కేటీఆర్
మీ సేవల నిర్వాహకులు సైతం అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఓటీపీతో నకిలీ జీపీఏ డాక్యుమెంట్లను తయారు చేసి పట్టాదారులకు తెలియకుండానే భూ మార్పిడి చేయిస్తున్నారు. బినామీ ఆసాములను సైతం సృష్టించి, బోగస్ సాక్ష్యాధారాలతో భూములను కొట్టేస్తున్నారు. అన్ని డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించకపోవడం వల్లనే ఈ తరహా మోసాలు జిల్లాలో కోకొల్లలుగా జరుగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్లు, దస్తావేజు, రెవిన్యూ అధికారులు, మీ సేవ నిర్వాహకులు ఇలా అందరూ దొంగ రిజిస్ట్రేషన్లకు సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం భూ భారతి చట్టం అమలులో భాగంగా ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో బాధితులు ఫిర్యాదు చేయడంతో జిల్లాలో అక్కడక్కడా భూ మోసాలు వెలుగుజూశాయి. అయితే, వెలుగులోకి రాని మోసాలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్నట్లు సమాచారం.
ఓటీపీతో మోసం
షాద్ నగర్ (Shad Nagar) నియోజకవర్గంలోని చిల్కమరికి చెందిన ఓ వ్యక్తికి చెందిన రూ.7 కోట్ల విలువ జేసే భూమికి కొందరు ఎసరుపెట్టారు. చిల్కమరి గ్రామానికి చెందిన కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డి చనిపోవడంతో ఆయన పేరున ఉన్న 2.8 ఎకరాల భూమిని 2022లో అతని భార్య వినోద పేరిట విరాసత్ చేశారు. ఆ భూమిపై కన్నేసిన వినోద మామ సుభాన్ రెడ్డి, బావ మధు సూదన్ రెడ్డిలు మీ సేవ నిర్వాహకుడితో కుమ్మక్కయ్యారు. వినోదకు తెలియకుండా ఆమె ఫోన్‌కు వచ్చిన ఓటీపీని సంపాదించి నకిలీ జీపీఏ డాక్యుమెంట్‌ను సృష్టించారు. జీపీఏ ద్వారా వేరొకరికి రెవెన్యూ అధికారులు గుడ్డిగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇదే గ్రామానికి చెందిన కొత్తపల్లి నర్సింహారెడ్డికి చెందిన 1.29 ఎకరాల భూమిని సైతం కొట్టేశారు. నర్సింహారెడ్డి, నవనీతలు భార్యాభర్తలు కాగా కొన్ని కారణాల వల్ల వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. భర్త ఫోన్ నవనీత దగ్గరే ఉండడంతో ఇదే అవకాశంగా అక్రమార్కులు నకిలీ జీపీఏ డాక్యుమెంట్ ద్వారా వేరొకరికి సేల్ డీడ్ చేశారు.
ఈ రెండు ఘటనల్లోనూ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నది. అయితే, ఈ రెండు అక్రమ రిజిస్ట్రేషన్లపై ఉన్నతాధికారులు విచారణ జరిపి రద్దు చేసినట్లు తెలిసింది. అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని మజీద్ పూర్ గ్రామంలోని ఓ ప్లాట్‌ను కాజేసేందుకు ఆర్టీసీ కండక్టర్‌తో పాటు మరికొందరు కుట్ర పన్నారు. నకిలీ ఆధార్ కార్డులు, ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. అయితే, ఆధార్ లింక్‌కు వచ్చిన ఓటీపీ సరిగ్గా చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన సబ్ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేవెళ్ల మండలం నవులయ్యపల్లి గ్రామంలోని 5 ఎకరాల భూమిని ఓ వ్యక్తి కొనుగోలు చేశాక విదేశాలకు వెళ్లాడు. ఇదే అదనుగా ఫోర్జరీ డాక్యుమెంట్లతో సదరు భూమిని వేరొకరు కాజేశారు. భూములను అప్పనంగా కొట్టేస్తున్న వారితో పాటు అధికారుల పాత్రపైనా ఉన్నతాధికారులు విచారణ జరిపితే ఈ తరహా మోసాలకు చెక్ పడే అవకాశం ఉంటుంది.
Also Read: Jubilee hills Constituency: జూబ్లీహిల్స్ టికెట్ కోసం కాంగ్రేస్ లీడర్ల ప్రయత్నాలు