Kandula Durgesh: టాలీవుడ్ మనుగడకు ప్రభుత్వ సహకారం అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మరోసారి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని హుకుంపేట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. సినీ రంగంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి దుర్గేష్ పలు విషయాలను వెల్లడించారు.
నూతన ఫిల్మ్ పాలసీతో అందరికీ ఆమోదయోగ్యం
సినిమాల విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచమని సినీ రంగం నుండి నిర్మాతలు విడివిడిగా వచ్చి తమను కలుస్తారని, తాము కూడా అందుకు ఓకే చెబుతున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ క్రమంలో ఎవరో ఒకరు కోర్టుల్లో పిల్ వేస్తున్నారని, తద్వారా అధికారులు కోర్టులు చుట్టూ తిరిగే దుస్థితి నెలకొందన్నారు. టికెట్ల ధరల పెంపుపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోందని తెలిపారు. ఈ విధానాలన్నింటికి చెక్ పెట్టి నూతన ఫిల్మ్ పాలసీ ద్వారా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధానాలను తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావించిందని అన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసమే తాము రేట్ల పెంపుకు అనుమతిస్తున్నామని మరోసారి ఆయన స్పష్టం చేశారు.
Also Read- Anaganaga Oka Raju: రాబోయే సంక్రాంతి బరిలో నవీన్ పోలిశెట్టి సినిమా.. పారిపోండిరోయ్!
తమ సమస్యలు తామే పరిష్కరించుకుంటామని కొందరు అహంభావంతో మాట్లాడుతున్నారని, ఇది సరైన విధానం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా రంగం వ్యాపారమని కొందరు మాట్లాడుతున్నారని, సినిమా రంగానికి ప్రభుత్వంతో సంబంధం లేనప్పుడు గత ప్రభుత్వాన్ని సినీ ప్రముఖులు ఎందుకు కలిశారు? అని ఆయన ప్రశ్నించారు. నిర్ణయాలు ఎందుకు చేశారని నిలదీశారు. తహసిల్దార్‌లను థియేటర్ల దగ్గర పెట్టి రేట్లను ఎందుకు నియంత్రించారని మంత్రి దుర్గేష్ ప్రశ్నించారు. ఇక మీదటైనా అందరూ కలిసికట్టుగా, సరైన రీతిలో వ్యవహరించాలని పేర్కొన్నారు. సినిమా థియేటర్ల అంశంపై అల్లు అరవింద్ మాట్లాడింది సహేతుకంగా ఉందన్నారు. సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వ సహకారం ఎప్పుడూ అవసరమేనని ఆయన స్పష్టం చేశారు.
Also Read- Dil Raju: సమస్య మొదలైంది అక్కడే! పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదు
సినీ రంగ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి
సినీ రంగ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఒక సినిమా తీయడం కోసం వేలాది మంది కృషి చేస్తారని, వందలాది మంది దీనిపై ఆధారపడుతున్నారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సినిమా టికెట్ల రేట్ల పెంపుకు సహకరిస్తూనే ఉన్నామన్నారు. అలాగే సినిమా షూటింగ్‌లకు త్వరితగతిన అనుమతులు జారీ చేస్తున్నామని తెలిపారు. సినిమా టికెట్‌పై రూపాయి పెంచితే ప్రభుత్వానికి 25 పైసలు జీఎస్టీ వస్తుంది. ఈ అంశాన్ని ఇటీవల రాజమహేంద్రరంలో జరిగిన గేమ్ ఛేంజర్ మూవీ ఫ్రీరిలీజ్ వేడుకల్లో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలోనే తరచూ ఇలాంటి వివాదాలు సృష్టించడం కరెక్ట్ కాదని ఆయన హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే సినిమాటోగ్రఫీ మంత్రిగా నిర్మాతలందరికీ ఒక లేఖ రాశానని, అంతా కలిసి కూర్చొని సినీరంగ సమస్యలు పరిష్కరించుకుందామని లేఖలో పేర్కొన్నట్లుగా మంత్రి దుర్గేష్ వివరించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం తరపున సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు