CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. రేపు జరిగే నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. 2018 తర్వాత తొలిసారి నీతిఆయోగ్ సమావేశానికి హాజరవుతున్న తెలంగాణ సీఎం.. ఆయనే కావడం విశేషం. కాగా ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి సీఎం పయనమవుతారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరిగే నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొని పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నారు.
తెలంగాణ రైజింగ్ – 2047
భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చే విందులో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా వారితో కలిసి గ్రూప్ ఫొటో సైతం దిగనున్నారు. ఇదిలా ఉంటే ‘వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్’ ఎజెండాగా ఏర్పాటు చేసిన నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో.. ‘తెలంగాణ రైజింగ్ – 2047’ విజన్ ను సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
అభివృద్ధికి సాయం
2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదల్చుకున్న లక్ష్యాలను నీతి అయోగ్ సభ్యులకు సీఎం రేవంత్ తెలియజేయనున్నారు. అలాగే ప్రభుత్వ పాలసీలు.. సుపరిపాలన విధానాలు.. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై రాష్ట్రం తరఫున ప్రత్యేక నివేదికను ఆయన అందించనున్నారు. ‘తెలంగాణ రైజింగ్ – 2047’ కోసం నీతి అయోగ్ సహాయ సహకారాలను ఈ సందర్భంగా రేవంత్ కోరనున్నారు.
ఐటీ, ఫార్మాలో మరింత ప్రగతి
ఇదిలా ఉంటే తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ విజన్ తో ముందుకు సాగుతున్నారు. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడం లక్ష్యంగా పెట్టకున్న సీఎం రేవంత్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఐటీ, ఫార్మా రంగాల్లో ముందున్న తెలంగాణ.. ఆ మరింత ముందుకు పోయేందుకు ప్రజాప్రభుత్వం చేపడుతున్న చర్యలను సైతం నీతి అయోగ్ భేటిలో రేవంత్ వివరించనున్నారు.
Also Read: Hyderabad Development: హైదరాబాద్ డెవలప్ పై సీఎం ప్రత్యేక ఫోకస్.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు!
సంక్షేమ కార్యక్రమాలపై వివరణ
తెలంగాణలో చేపడుతున్న ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీఆర్‌లుగా మౌలిక వసతులు కల్పించడం వంటి వాటిపై రేవంత్ ప్రసంగించనున్నారు. అలాగే సాగు రంగం అభివృద్ధికి చేసిన రుణమాఫీ, వరికి బోనస్, సంక్షేమంలో భాగంగా అందిస్తున్న సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను సైతం వివరించనున్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా, రూ.500కే సిలిండర్ సరఫరాపై మాట్లాడనున్నారు. అలాగే కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలను సైతం నీతి అయోగ్ భేటిలో సీఎం రేవంత్ స్పష్టం చేయనున్నారు.