MM Keeravani: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) చారిత్రాత్మక యోధుడిగా కనిపించబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu). నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడినా, చిత్ర ప్రమోషన్ నిమిత్తం విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు గీతాలు ప్రేక్షకులకు, అభిమానులకు ట్రీట్ ఇస్తూ వచ్చాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతం ‘అసుర హననం’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ అభిమానులు, ప్రేక్షకుల కోసం తెలుగు, తమిళ, హిందీ వ్యాఖ్యాతలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.
Also Read- Allu Aravind: అల్లు అరవింద్‌కు ముగ్గురు కాదు.. నలుగురు కుమారులని తెలుసా?
ముందుగా ఈ పాట విషయానికి వస్తే.. ‘అసుర హననం’ పాటపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ పాట వింటుంటే, నిజంగానే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అసురులపై పోరాడుతున్న యోధుడి వీరత్వాన్ని చాటిచెప్పేలా సంగీతం, సాహిత్యం ఈ పాటకు కుదిరాయి. ప్రతి ఒక్కరిలో పోరాట స్ఫూర్తిని రగిల్చేలా కీరవాణి ఈ పాటను కంపోజ్ చేశారు. ఆ సంగీతానికి తగ్గట్టుగా గీత రచయిత రాంబాబు గోశాల పదునైన సాహిత్యంతో కట్టిపడేశారు. ‘భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం’ వంటి వాక్యాలతో తన కలం బలం ప్రదర్శించారు. ఐరా ఉడుపి, కాల భైరవ, సాయిచరణ్ భాస్కరుని, లోకేశ్వర్ ఈదర, హైమత్ మహమ్మద్ తమ గాత్రంతో ఈ పాటను మరోస్థాయికి తీసుకెళ్ళారు.
ప్రస్తుతం ఈ సాంగ్ విడుదలైన కాసేపట్లోనే టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read- Vishal Marriage: రజనీకాంత్ కుమార్తెతో హీరో విశాల్ పెళ్లి? అది దా సర్‌ప్రైజ్!
ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ.. ఈ సినిమాతో నా ప్రయాణం ఐదేళ్ల క్రితం రాధాకృష్ణ(క్రిష్ జాగర్లమూడి)తో మొదలైంది, ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. నేను చాలా మంది దర్శకులను చూశాను. కానీ, తక్కువమందిలో ఉండే అరుదైన క్వాలిటీ జ్యోతికృష్ణలో ఉంది. ఏదైనా సరే.. వేగంగా నిర్ణయం తీసుకుంటాడు, అలా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. ఎడిటింగ్, గ్రాఫిక్స్, మ్యూజిక్ అన్ని పనులు ఒక్కడే చూసుకుంటూ నిద్రాహారాలు మానేసి ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఇండస్ట్రీలో వివాద రహితుడిగా ఎ.ఎం. రత్నానికి పేరుంది. లిరిక్ రైటర్‌గా ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఈ సినిమా రూపంలో ఆయనకు మరో భారీ విజయం సొంతం అవుతుందని ఎంతగానో నమ్ముతున్నాను. అలాగే నిర్మాత దయాకర్ అంటే నాకెంతో గౌరవం. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంతో ఉంది. రాంబాబు వంటి మంచి గీత రచయితను నాకు జ్యోతికృష్ణ పరిచయం చేశారు. నిధి అగర్వాల్ తన పాత్రకు చక్కగా న్యాయం చేసింది. పవన్ కళ్యాణ్‌ని అందరూ పవర్ స్టార్ అంటారు. నేను మూర్తీభవించిన ధర్మాగ్రహం అంటాను. అలా ఎందుకు అంటానంటే, ఆగ్రహం మనందరికీ వస్తుంది. కానీ సమాజం కోసం వచ్చేది ధర్మాగ్రహం. ఆయనకు మాత్రమే సరిపోయేలా ఈ ‘హరి హర వీరమల్లు’ను తీర్చిదిద్దారు. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోయే కార్చిచ్చు పవన్ కళ్యాణ్. ఆ కార్చిచ్చు మీద ఎంత వాన పడినా అది ఆగదు. ఆయనతో మొదటిసారి చేస్తున్న సినిమా కాబట్టి ఎంతో శ్రద్ధతో ఈ సినిమా చేశాను. జూన్ 12న రిలీజవుతున్న ఈ సినిమాని మీ అందరికీ కన్నుల పండుగగా ఉంటుందని, బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని విశ్వసిస్తున్నాను’’ అని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు