Raj Bhavan Theft: హైదరాబాద్ రాజ్ భవన్ లో జరిగిన చోరీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజ్ భవన్ మెుదటి అంతస్టులోని సుధర్మ భవన్ లో డిస్క్ లు మాయం కావడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. సీసీ కెమెరాలను రాజ్ భవన్ అధికారులు పరిశీలించగా.. చోరీ జరిగినట్లు గుర్తించారు. మే 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసును హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
మహిళపై వేధింపులు
రాజ్ భవన్ లో చోరికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్ ను ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు (Panjagutta Police Station) ఓ కేసులో అరెస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తోటి మహిళా ఉద్యోగి ఫోటోలు మార్ఫింగ్ చేసి.. భయభ్రాంతులకు గురిచేసిన ఆరోపణలపై అతడ్ని కొద్ది రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. తాజాగా హార్డ్ డిస్క్ ను ఎత్తుకెళ్లిన కేసులో వారం వ్యవధిలో రెండోసారి అరెస్ట్ చేయడం గమనార్హం. మహిళను వేధించిన కేసులో నిందితుడు శ్రీనివాస్ ను ఇప్పటికే రాజ్ భవన్ అధికారులు సస్పెండ్ చేశారు.
రిమాండ్.. ఆపై బెయిల్
తొలి కేసు విషయానికి వస్తే.. తోటి ఉద్యోగినికి శ్రీనివాస్ అసభ్యకర మార్ఫింగ్ ఫొటోలు చూపించాడు. ఎవరో తనకు ఈ ఫోటోలు పంపిస్తున్నాడు జాగ్రత్త? అని ఆమెను హెచ్చరించాడు. ఇంకా చాలా ఫోటోలు పంపిస్తానని అతడు వార్నింగ్ ఇచ్చాడని మహిళకు చెప్పాడు. దీంతో కలవరానికి గురైన మహిళా ఉద్యోగిని.. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసింది శ్రీనివాస్ అని గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి వారం కింద రిమాండ్ కు పంపారు. దీంతో జైలుకు వెళ్లిన శ్రీనివాస్.. రెండు రోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు.
దొంగతనం ఎందుకు చేశాడంటే!
జైలు నుండి వచ్చిన శ్రీనివాస్ రాత్రి సమయంలో సెక్యూరిటీ ని మభ్యపెట్టి రాజ్ భవన్ లోపలికి వెళ్ళాడు. తన కంప్యూటర్ లో ఉన్న హార్డ్ డిస్క్ ను చోరీ చేసుకుని వెళ్ళిపోయాడు. ఈ సంఘటనపై రాజభవన్ అధికారులు.. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసారు. దర్యాప్తు చేసిన అధికారులు సీసీ కెమెరాల ద్వారా శ్రీనివాస్ చోరీని గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్ లో మహిళ కు సంబంధించిన ఫోటోలు ఉండడంతో ఆ సాక్ష్యాలను డిలీట్ చేసే ప్రయత్నంలో నిందితుడు శ్రీనివాస్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో శ్రీనివాస్ రెండో సారి జైలుకు పంపారు.