Saraswati Pushkaralu : సరస్వతి నది అంతరవాహిని అయినటువంటి త్రివేణి సంగమంలో ఘనంగా సరస్వతి పుష్కరాలు ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషమని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా ఉదయం 10 గంటలకు కాళేశ్వరం చేరుకున్న మంత్రి తుమ్మల ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామి రెడ్డి, భూపాలపల్లి, రామగుండం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, మక్కన్ సింగ్ లతో కలిసి త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించి సరస్వతి మాతను దర్శించుకున్నారు.
అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని సరస్వతి పుష్కరాలు సందర్భంగా స్వామి వారిని, అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. భక్తులు సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం. మొట్ట మొదటి పుష్కరాలు నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు.
Also Read: Tummala Nageswara Rao: గిరిజన జిల్లాను అభివృద్ధిలో.. నవ కాంతులతో ముందుకు తీసుకువెళ్తాం!
రానున్న గోదావరి పుష్కరాలను కూడా సరస్వతి పుష్కరాల మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఎలాంటి ఆలస్యం లేకుండా పనులన్నీ ఇప్పటి నుండే చేపట్టి త్వరిత గతిన పూర్తి చేసుకుని గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినట్లు మంత్రి స్పష్టం చేశారు. సరస్వతి పుష్కరాల కోసం శ్రమిస్తున్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగాన్ని మంత్రి నాగేశ్వరరావు అభినందించారు.
స్వామివారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రత్యేకంగా ప్రార్ధించినట్లు మంత్రి తెలిపారు. అనంతరం 11 గంటలకు. మంత్రి తిరుగు ప్రయాణ మయ్యారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో, వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, భూపాలపల్లి ఆర్డీఓ రవి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆర్జెసి రామకృష్ణారావు పాల్గొన్నారు.
Also Read: WE Hub Women Acceleration: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. ఆడ బిడ్డలకు ప్రత్యేక ఐడీ కార్డులు!