Maheshwar Reddy On BRS: తెలంగాణ బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ త్వరలో చీలబోతోందంటూ వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసీఆర్ అంతపురంలో ప్రస్తుతం అలజడి నెలకొందన్న మహేశ్వర్ రెడ్డి.. ఆ పార్టీలో నాలుగు స్తంభాలట జరుగుతున్నట్లు ఆరోపించారు. హరీష్ రావు సహకారంతో బీఆర్ఎస్ఎల్పీలో (BRSLP) చీలిక ఉంటుందని ఆరోపించారు. హరీష్, కవితలకు మద్దతుగా సీఎం రేవంత్ సహకారం ఉన్నట్లు పేర్కొన్నారు.
డమ్మీలుగా కవిత, హరీష్!
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో హరీష్, కవితలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి అన్నారు. వారిద్దరు డమ్మీగా మిగిలిపోయారని ఆరోపించారు. ప్రస్తుతం కేటీఆర్ సూపీరియర్ గా వ్యవహరిస్తున్నారని.. ఇందుకు కేసీఆర్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని పేర్కొన్నారు. తాజా పరిణామాలతో బీఆర్ఎస్ లో కవిత ఒంటరి అయిపోయారని వ్యాఖ్యానించారు. మహిళా సాధికారతలో నాటి బీఆర్ఎస్ సర్కార్ విఫలమని కవిత మాట్లాడటం వ్యూహాత్మకమని అన్నారు.
త్వరలో కవిత లేఖాస్త్రం
పదవులు, ఆస్తులు అన్ని కేటీఆర్ కేనా అంటూ త్వరలో కేసీఆర్ పై కవిత లేఖాస్త్రంతో తిరుగుబాటు చేయబోతున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. త్వరలో లేఖను కవిత బయట పెట్టే అవకాశముందని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా కవితను అణచివేసేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ లో ఒకే పవర్ సెంటర్ ఉండాలని.. అది తానే అవ్వాలని కేటీఆర్ అభిమతంగా కనిపిస్తోందని చెప్పారు. కేసీఆర్ ఒత్తిడితోనే హరీష్ రావు తాజాగా ప్రెస్ మీట్ పెట్టారని వ్యాఖ్యానించారు.
కవిత, హరీష్ కు రేవంత్ హామీ
అయితే కేటీఆర్ పార్టీ అధ్యక్షుడు అయితే.. BRSLP తనకే ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేసినట్లు మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పది మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తే ఎల్పీ పదవి ఇస్తానని రేవంత్ హామీ ఇచ్చినట్లు ఆరోపించారు. ఇదంతా తెలిసి వెంటనే హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్లారని అన్నారు. ఈ సందర్భంగా ఎల్పీ పదవి హరీష్ అడగ్గా.. అధ్యక్ష పదవితోపాటు అది కూడా తన వద్దే ఉంటుందని కేటీఆర్ తెగేసి చెప్పారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. అయితే BRSLP లీడర్ గా హరీష్, కౌన్సిల్ లీడర్ గా కవితను చేయడానికి సీఎం రేవంత్ హామీ ఇచ్చారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
Also Read: Miss World 2025 Beauties: తారక్ పాటకు దుమ్మురేపిన అందాల భామలు.. మీరూ చూసేయండి!
మే 26 తర్వాత పార్టీలో చీలికలు
హరీష్ రావును అడ్డం పెట్టకొని బీఆర్ఎస్ ను చీల్చాలని సీఎం రేవంత్ భావిస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ప్యారిస్ టూర్ వెళ్ళగానే బీఆర్ఎస్ఎల్పీ చీల్చుతారని స్పష్టం చేశారు. మే 26 నుంచి కేటీఆర్ ఫారిన్ టూర్ కి వెళ్తున్నారని.. అప్పుడే BRSLP చీలిక జరుగుతుందని జోస్యం చెప్పారు.