TG on Temple Lands: ఆలయ భూములపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. నిత్యం ఏదో ఒక చోట దేవాలయ భూములు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో వాటిని కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఆలయ భూములకు జీడీపీఎస్(డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నది. ఏ జిల్లాలో అయితే భూమి ఆక్రమణకు గురైందో వాటిని కాపాడాలని ఆ జిల్లాల నుంచి వచ్చిన రిక్వెస్టులను బట్టి ఆ జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సర్వే చేయాలని భావిస్తున్నది. తొలుత నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్-సికింద్రాబాద్ జిల్లాల్లో సర్వే చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే ఏసీ(అసిస్టెంట్ కమిషనర్లుకు సమావేశం సైతం నిర్వహించి సూచనలు చేశారు. ప్రైవేట్ ఏజెన్సీతో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే సక్సెస్ అయితే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో జీడీపీఎస్ సర్వే చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 87235.39ఎకరాల భూమి
ఆలయాల్లో దూపదీపం నైవేద్యంకోసం ప్రభుత్వ భూములను కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో 87235.39ఎకరాలను ఆలయాలకు కేటాయించినట్లు రికార్డులు పేర్కొంటున్నాయి. ఆ భూములను లీజు ఇవ్వడంతో వచ్చే ఆదాయంతో ఆలయాల్లో నిత్యం పూజలు చేపడుతున్నారు. అయితే, ఆలయాల సంరక్షణ, భూముల పరిరక్షణ కోసం దేవాదాయశాఖను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. నిత్యం ఆలయాలు, భూములపై పర్యవేక్షణ చేయాల్సి ఉంది. అయితే, మండలంలో పనిచేసే ఈవోలకు ఒకరికి రెండు లేక మూడు మండలాలకు బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ పర్యవేక్షణ కొరవడంతో భూములు ఆక్రమణకు గురయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి.
దీనికి తోడు గత ప్రభుత్వాలు ఆలయ భూముల సంరక్షణకు చర్యలు చేపట్టకపోవడంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 20124.03 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. అయితే, ప్రస్తుతం భూముల ధరలు పెరుగుతుండటంతో ఆక్రమణలు కొనసాగుతునే ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఆ భూములను కాపాడేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే జీడీపీఎస్ సర్వే చేయాలని భావిస్తున్నది. త్వరలోనే సర్వే చేపట్టి భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాలు
జీడీపీఎస్ సర్వేకు మూడు జిల్లాలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డితో పాటు హైదరాబాద్-సికింద్రాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లో ఎక్కువగా ఆలయ భూములు ఆక్రమణకు గురయ్యాయని, ఆ భూములపై సర్వే చేయాలని జిల్లాలో దేవాదాయశాఖ ఏసీ(అసిస్టెంట్ కమిషనర్)లు సైతం ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. ఆలయ భూములను కాపాడకపోతే భవిష్యత్‌లో ఆలయాల మనుగడ సైతం ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉన్నది. 20124.03 ఎకరాలు ఆక్రమణకు గురి కాగా, విత్ అవుట్ లిటిగేషన్‌తో మరో 5569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు పేర్కొంటున్నప్పటికీ అధికారికంగా మాత్రం చూపడం లేదు. ఇందులో రాష్ట్రంలో అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలోనే భూములు ఎక్కువగా ఆక్రమణకు గురికాగా ఆ జిల్లాలో 5522.22 ఎకరాలు ఉండగా అందులో 3018.01 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు.
Also Read: Telangana Jagruti: యువతకు కవిత పిలుపు.. జూన్ 2న పోటీలు.. మ్యాటర్ ఏంటంటే!
రెండోస్థానంలో మేడ్చల్ జిల్లా ఉంది. ఈ జిల్లాలో 4125.03 ఎకరాల్లో 2888.18 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. మూడోస్థానంలో హైదరాబాద్ జిల్లా ఉంది. 5718.01 ఎకరాలు, 6 కిస్తాన్ ఉండగా 2374.25 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. సికింద్రాబాద్‌లో 279.25 ఎకరాలు ఉండగా 7.12 ఎకరాలు ఆక్రమణకు గురైంది. రంగారెడ్డి జిల్లాలో 9360.01 ఎకరాలు ఉండగా 1148.15 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 2294.26 ఎకరాలు ఉండగా 444.16 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 5429.03 ఎకరాలు ఉండగా 688.34 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 6963.32 ఎకరాలు ఉండగా 1374.35 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 2377.09 ఎకరాలు ఉండగా 645.38 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఆ జిల్లాల్లో భూముల ధరలు సైతం ఎక్కువగా ఉన్నాయి. భూములకు రక్షణ చర్యలు చేపట్టేకపోతే కష్టమవుతుందని భావించిన ప్రభుత్వం అందుకు జీడీపీఎస్ సర్వే చేసి ఆక్రమణకు గురికాకుండా అడ్డుకట్టవేయాలని భావిస్తున్నది.
ప్రైవేట్ ఏజెన్సీలతో భూ సర్వే
ప్రైవేట్ ఏజెన్సీలతో ఆలయ భూముల సర్వే చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక దఫా ఏజెన్సీలతో సర్వేపై చర్చించినట్లు తెలిసింది. అందులో భాగంగానే దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. త్వరలోనే మరోసమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఆలయ పరిధిలోని భూ సర్వే చేసిన వెంటనే ఆన్ లైన్‌లో భూ వివరాలు నక్ష హద్దులు ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరైనా ఆ భూమిని ఆక్రమించిన ఆన్‌లైన్ వివరాలతో తిరిగి స్వాధీనం చేసుకునేలా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధిత మంత్రి కొండా సురేఖ సైతం జీడీపీఎస్ సర్వేకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎప్పటినుంచి ఈ సర్వేను ప్రారంభించేది త్వరలోనే తేదీని ప్రకటిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో సర్వే చేపట్టనున్నట్లు తెలిసింది.
Also Read: Minister Seethaka: బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం.. వాస్తవాలు మాట్లాడే దమ్ము లేదా!