TG Private Schools: రా ష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల ఆగడాలు రోజురోజోకూ పెరిగిపోతున్నాయి. ఫీజుల పేరిట అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. దీంతో పేరెంట్స్ కు తలకుమించిన భారంగా మారుతోంది. త్వరలోనే.. నూతన విద్యాసంవత్సరం త్వరలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లు, కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు, బుక్స్ పేరిట యథేచ్ఛగా దోపిడీని మొదలుపెట్టాయి.
దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ అంశంపై పలు ఫిర్యాదులు సర్కార్ దృష్టికి వచ్చాయి. ఈనేపథ్యంలో ఫీజులను నియంత్రించడంపై సర్కార్ ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఫీజు రెగ్యులేషన్ చట్టం అమలు చేయాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి.., ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను అప్పటి సర్కార్ బయటపెట్టకపోగా ఆ అంశాన్ని కూడా గాలికి వదిలేసింది.
Also read: Uttam kumar reddy: హరీష్ రావు అబద్దాలు మానుకో.. మంత్రి సంచలన కామెంట్స్!
కాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఇందుకోసం మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేసింది. దీంతోపాటు తెలంగాణ విద్యా కమిషన్ ను సైతం ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు భేటీ అయింది. అంతేకాకుండా తెలంగాణ విద్యా కమిషన్ సైతం ప్రభుత్వానికి ఫీజుల నియంత్రణకు సంబంధించి పలు నివేదికలను అందజేసింది.
తెలంగాణలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని తాజాగా మంత్రి శ్రీధర్ బాబు నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో తేల్చారు. ఈ భేటీలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై తల్లిదండ్రులు, సంబంధింత యాజమాన్యాల అభిప్రాయాలు సైతం సేకరించినట్లు స్పష్టంచేశారు.
అలాగే విద్యా వ్యవస్థలో మార్పు అవరమని వారు నిర్ణయించారు. అయితే ఇప్పటికే చాలా వరకు పాఠశాలలు అడ్మిషన్లతో పాటు పాఠ్య పుస్తకాల అమ్మకం వంటివి దాదాపుగా పూర్తికానిచ్చేస్తున్నాయి. ఆ తర్వాత ఫీజుల నియంత్రణ చట్టం అమలుచేసినా ప్రయోజనం ఉండదు.
అందుకే దీనిపై వీలైనంత త్వరగా డెసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల వసూళ్లపై ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ లేదు. ఏ స్కూల్లో ఎంత ఫీజు వసూలు చేయాలనే దానిపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేకపోవడంతో ఆయా యాజమాన్యాలు ఇష్టారీతిన ప్రజల నడ్డి విరుస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం స్కూళ్లను బట్టి సరాసరి ఏటా రూ.30 వేల నుంచి రూ.12 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల అంశంపై విద్యాకమిషన్ పలు సిఫారసులు చేసింది. ఫీజుల పెంపు అంశంపై సీఎంవోకు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆరా తీసినట్టు సమాచారం.
Also read: Monsoon 2025: దేశ ప్రజలకు చల్లటి శుభవార్త.. ముందుగానే రుతుపవనాల పలకరింపు
ఫీజుల నియంత్రణకు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. అయితే ఫీజుల కట్టడిపై సర్కార్ నిర్ణయం తీసుకుంటే త్వరగా తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.
నూతన విద్యాసంవత్సరం సమీపిస్తున్న తరుణంలో అడ్మిషన్ల ప్రక్రియ, పాఠ్య పుస్తకాల అమ్మకాలు కూడా పూర్తికావస్తున్న నేపథ్యంలో త్వరగా అమలుచేయాలని కోరుతున్నారు. ఫీజుల నియంత్రణ చట్టంపై గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం అమలుచేసి మాట నిలబెట్టుకుంటుందా? లేక లైట్ తీసుకుంటుందా? అనేది చూడాల్సిందే.