Etela Rajender on TG CM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ముఖ్యనేత ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైడ్రాను ఉపయోగించుకొని ముఖ్యమంత్రి దారుణంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తన 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి అసమర్థ ప్రభుత్వాన్ని చూడలేదని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు అయోమయంలో ఉన్నారని ఈటెల అన్నారు. హైడ్రా వల్ల ఏం సాధించాలని అనుకుంటున్నారని సీఎంను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ నియంత్రణ లేదన్న బీజేపీ నేత.. హైడ్రా వల్ల ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అన్నారు.
ప్రభుత్వంలో సమన్వయం లేదు
సీఎం రేవంత్ రెడ్డి ఎవరు చెప్పినా విననని అంటున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. రేవంత్ ను ఒక సీఎంగా చూస్తున్నామని.. శాడిస్ట్ గా కాదని అన్నారు. జనాలను ఏడిపించి సంతోష పడితే దాన్ని శాడిస్ట్ అంటారా? ఏమంటారో? ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతలకు తెలియాలని అన్నారు. రేవంత్ ప్రభుత్వంలో సమన్వయం లేదన్న ఈటెల కోపానికి అర్థం ఏంటో కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని అన్నారు. హైదరాబాద్ లో 70 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకుని నివసిస్తున్న కాలనీలను ఇప్పుడు ప్రభుత్వ స్థలాలంటూ కూల్చడం సరైన విధానమా? అంటూ నిలదీశారు.
ప్రభుత్వం ఎటు పోతోంది?
ఇండ్లకే కాకుండా దేవాలయాలకు సైతం నోటీసులు ఇస్తారా? ప్రభుత్వం ఎటు పోతుంది? అంటూ ఈటెల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను రేవంత్ ను టార్గెట్ చేయడం లేదని ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఎందుకు ఉంది? అని నిలదీశారు. రాష్ట్ర ఆర్థిక శాఖను, ఆర్థికశాఖ కార్యదర్శులను బ్యాంకులు దొంగలు లెక్క చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డి భాష యావత్ తెలంగాణ సమాజాన్ని కుంగదీస్తోందని అన్నారు.
Also Read: PoK Terror Camps: పాక్‌కు బుద్ధి చెప్పాం.. ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. త్రివిద దళాలు
హామీలు ఎందుకు అమలు చేయట్లేదు?
రాష్ట్రానికి అప్పులు కొత్త కాదన్న ఈటెల.. ఇప్పుడే అప్పుల్లో కూరుకుపోయినట్టు హడావుడి చేయడం సరికాదని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన ఫండ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు ఉందో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుబంధు, రుణమాఫీ, ఫీజు రియంబర్స్ మెంట్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మరోవైపు తనపై జగ్గారెడ్డి చేస్తున్న విమర్శలను సైతం ఈటెల తీవ్రస్థాయిలో ఖండించారు. ఆయన చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కాకముందు రేవంత్ ను సైతం జగ్గారెడ్డి విమర్శించారని అన్నారు.