Minister Sridhar Babu: శిక్ష పూర్తయ్యేలోపు ఖైదీల్లో మార్పు తీసుకొచ్చి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చర్లపల్లి సెంట్రల్ జైల్లో నిర్వహించిన “ఖైదీల వార్షిక క్రీడలు, సాంస్కృతిక పోటీలు – 2025” ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ జైళ్ల శాఖలో అమలు చేస్తున్న సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు.
తెలిసో తెలియకో చేసిన తప్పులకు శిక్షను అనుభవిస్తున్న ఖైదీల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు అనేక చేతి వృత్తులు, ఇతర పనుల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. ఖైదీలు మానసిక ఒత్తిడికి గురి కాకుండా నిపుణులతో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామన్నారు. ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, ఆ దిశగా వారిని మరింత ప్రోత్సహిస్తామన్నారు. జైలుకు కావాలని ఎవరూ రారని, బయటకు వెళ్లిన తర్వాత మరోసారి అలాంటి తప్పు చేయకుండా గౌరవంగా జీవించాలని ఖైదీలకు సూచించారు.
Also Read: India Pak War: పాక్ ఇంత నీచమైందా.. 1949 నుంచి తప్పు మీద తప్పు.. భారీ మూల్యం తప్పదా!!
శిక్ష అనుభవించే సమయంలో ఆందోళనకు గురి కావొద్దని చెప్పారు. సమయాన్ని వృథా చేయకుండా ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ పొందాలని సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే నిబంధనల ప్రకారం జైళ్ల శాఖ తరఫున సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా, సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.