India on Pakistan: పాకిస్థాన్ లోని ముష్కర మూకలపై భారత్ జరిపిన వైమానిక దాడులు యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరుతో భారత్ ఈ దాడులు చేసింది. భారత్ పైకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ కు తనదైన శైలిలో భారత్ బుద్ది చెప్పింది. అయితే భారత్ ఈ తరహా ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి కాదు. 1971 తర్వాత నుంచి ఇప్పటి వరకూ ఎన్నోసార్లు సైనిక చర్యలు నిర్వహించి పాక్ కు గుణపాఠం చెప్పింది. ఆ స్ట్రైక్స్ కు సంబంధించిన వివరాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఆపరేషన్ ట్రైడెంట్ (1971)
1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్ తో భారత్ యుద్ధం చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్థాన్ చేసిన చర్యలకు వ్యతిరేకంగా భారత నౌకాదళం ఈ ‘ఆపరేషన్ ట్రైడెంట్’ (Operation Trident) చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ నౌకాదళ ప్రధాన కేంద్రమైన కరాచీ రేవుపై దాడి చేసింది. ఈ ఆపరేషన్‌లో నౌకా విధ్వంసక క్షిపణులను మొదటిసారి భారత్ ఉపయోగించింది. భారత్ కు చెందిన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నిర్ఘాత్, ఐఎన్ఎస్ వీర్, ఐఎన్ఎస్ నిపాత్ జరిపిన దాడిలో పాక్ కు చెందిన PNS ఖైబర్, మైన్‌స్వీపర్ PNS ముహాఫిజ్, ఒక కార్గో నౌక దెబ్బతిని సముద్రంలో మునిగిపోయాయి.
ఆపరేషన్ పైథాన్ (1971)
ఆపరేషన్ ట్రైడెంట్‌లో అసంపూర్తిగా మిగిలిన లక్ష్యాలను సాధించడానికి భారత నౌకాదళం ఈ ఆపరేషన్ పైథాన్ (Operation Python)ను డిసెంబర్ 8-9, 1971న చేపట్టింది. ఒక క్షిపణి పడవ, రెండు ఫ్రిగేట్‌లతో కూడిన భారత నౌకా దళ బృందం కరాచీ తీరంలోని నౌకలపై దాడి చేసింది. పాకిస్థాన్ ఫ్లీట్ ట్యాంకర్ PNS డక్కాను ధ్వంసం చేశాయి. అలాగే కెమారి ఇంధన నిల్వ స్థావరాన్ని పూర్తిగా నాశనం చేశాయి. ఈ చర్యతో పాక్ నౌకాదళం మరింత బలహీనపడింది. కరాచీ రేవు ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి.
ఆపరేషన్ పరాక్రమ్ (2001-2002)
2001 డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత ఆర్మీ ‘ఆపరేషన్ పరాక్రమ్’ను చేపట్టింది. నియంత్రణ రేఖ (LoC) వెంబడి దాదాపు 5 లక్షల మంది సైనికులను మోహరించింది. పాకిస్తాన్ కూడా 3 లక్షల మంది సైనికులను సమీకరించి స్పందించింది. ఈ క్రమంలో సరిహద్దుల్లో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ దళాలపై భారత దళాలు కాల్పులతో విరుచుకుపడ్డాయి. దీంతో పాక్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఉద్రిక్తలు తగ్గాయి.
సర్జికల్ స్ట్రైక్స్ (2016)
జమ్ము కాశ్మీర్‌లోని ఊరి ప్రాంతంలో ఉగ్రవాదులు భారత సైనికులపై చేసిన ఉగ్రదాడిలో 19 మంది జవాన్లు వీరమరణం పొందారు. దీనికి ప్రతీకారం మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. సర్జికల్ స్ట్రైక్స్ (Surgical Strikes) జరిపింది. 2016 సెప్టెంబర్ 29న భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని ఉగ్రవాద శిబిరాలపై రాత్రి సమయంలో సర్జికల్ దాడులు చేశాయి. పలు ఉగ్ర శిబిరాలను నాశనం చేసి, అనేక ఉగ్రవాదులను హతమార్చారు.
బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ (2019)
2019 ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో CRPF బృందంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత జవాన్లు మరణించారు. ఈ దాడికి పాకిస్థాన్ ఆధారిత జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. ఈ ఘటనపై ప్రతీకారంగా భారత్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ (Balakot Air Strike) జరిపింది. ఫిబ్రవరి 26, 2019న భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడులు చేసింది. మిరాజ్-2000 యుద్ధ విమానాలు లేజర్-గైడెడ్ బాంబులను ఉపయోగించి శిబిరాన్ని ధ్వంసం చేశాయి. ఈ దాడిలో వందలాది మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు అప్పట్లో భారత ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: Prabhas Marriage: వాళ్లని సీక్రెట్ గా కలిసిన ప్రభాస్.. పెళ్లి కోసమేనా.. గుడ్ న్యూస్ పక్కానా?
ఆపరేషన్ సింధూర్ (2025)
2025 ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ దాడి వెనక పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉన్నట్లు భారత్ నిర్ధారించింది. దీంతో భారత సాయుధ బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. త్రివిధ దళాలు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం.