Bandi Sanjay on TG CM: తెలంగాణ దివాలా తీసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో.. దేశంలో మన రాష్ట్ర పరువు పోయిందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రం దివాలా తీసిందని తానేం చేయలేనని సీఎం అనడంతో ఆ పార్టీ శాసన సభ్యులు ఆలోచనలో పడ్డారని బండి తెలిపారు. తమ భవిష్యత్ ఏంటోనని వారు ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు.
హామీల పరిస్థితేంటి?
ఢిల్లీకి పోయినా కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని సీఎం రేవంత్ చెప్పడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాము ప్రభుత్వాన్ని నడిపలేని స్థితిలో ఉన్నామని సీఎం చెప్పకనే చెప్తున్నారని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయలేమని అంటున్నారని మండిపడ్డారు. ఏడాది లోపల అప్పులు తీరుస్తామని.. ఆరు గ్యారంటీ లు అమలు చేస్తామని ఏ విధంగా చెప్పారో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు, మంత్రులు తెలియజేయాలని బండి డిమాండ్ చేశారు.
రాహుల్, సోనియా సమాధానం చెప్పాలి
రూ. 12 లక్షల కోట్లు .. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిందని బండి సంజయ్ తెలిపారు. గత పదేళ్ళలో 5,000 కి.మీ కు పైగా రోడ్లు వేశామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వం.. నిన్నటి రేవంత్ మీటింగ్ తో బయటపడిందని బండి ఆరోపించారు. రాష్ట్రం దివాల తీసిందన్న సీఎం వ్యాఖ్యలకు.. రాహుల్, సోనియాలు ప్రజలకు సమాధానం చెప్పాలని బండి నిలదీశారు.
నక్సల్స్ కి పిలుపు
మరోవైపు కేంద్ర బలగాలు కర్రెగుట్టలో చేపట్టిన ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలన్న కాంగ్రెస్ సూచనలపైనా బండి స్పందించారు. నక్సల్స్ లో చేతిలో తుపాకులు మీకు కనిపించడం లేదా? అని నిలదీశారు. గుట్టల్లో పెద్ద ఎత్తున మైన్స్ దొరుకుతున్నాయన్న బండి.. అది నక్సల్స్ గాక ఆదివాసీలు పెట్టారా? అంటూ ప్రశ్నించారు. చేతిలోని తుపాకులు వదిలి.. జన జీవన స్రవంతిలో మావోయిస్టులు కలిసిపోవాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.
Also Read: Obulapuram Mining case: ఓబులాపురం మైనింగ్ కేసు.. ఎంత పెద్ద కుంభకోణమో తెలుసా?
పహల్గాంపై రివేంజ్ షురూ!
వరవరరావు (Varavara Rao) లాంటి వారు ఎన్నో శవాలను మోశారన్న బండి సంజయ్.. ఇన్నేళ్లలో ఏం సాధించారని నిలదీశారు. మావోయిస్టుల పై నిషేధం విధించే దమ్ము రాష్ట్రానికి ఉందా? అని కేంద్ర మంత్రి నిలదీశారు. మరోవైపు పహల్గాం దాడి గురించి మాట్లాడిన బండి.. ఉగ్రవాదానికి, తీవ్రవాదానికి బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు.
మరోసారి భారతీయ అమాయకులపై ఇలాంటి దురాగతాలు జరగకుండా ఉండేలా కేంద్రం చర్యలు ఉంటాయని బండి స్పష్టం చేశారు.