Obulapuram Mining case: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన కుంభకోణాల్లో ఓబులాపురం మైనింగ్ కుంభకోణం ఒకటి. 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం దీనిపై నేడు తీర్పు వెలువడబోతోంది. ఈ కేసుకు సంబంధించి గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhan Reddy) ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి 219 మంది సాక్షులు 337 డాక్యుమెంట్లను సీబీఐ పరిగణలోకి తీసుకుంది. ఇవాళ తుది తీర్పు వస్తుండటంతో ఒక్కసారిగా ఓబులాపురం మైనింగ్ కుంభకోణానికి సంబంధించి చర్చ మెుదలైంది. ఈ నేపథ్యంలో ఈ స్కామ్ కు సంబంధించి పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.
ఏంటీ కుంభకోణం?
ఓబులాపురం మైనింగ్ కుంభకోణం (Obulapuram Mining Scam).. కర్ణాటక – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇనుము ఖనిజ తవ్వకాలలో జరిగిన అక్రమాలకు సంబంధించినది. ఈ స్కామ్ ప్రధానంగా ఓబులాపురం మైనింగ్ కంపెనీ (OMC)తో ముడిపడి ఉంది. దీనిని రెడ్డి సోదరులు.. గాలి జనార్థన రెడ్డి, గాలి కరుణాకర రెడ్డి, గాలి సోమశేఖర రెడ్డి నడిపారు. వీరు కర్ణాటక ప్రభుత్వంలో మంత్రులుగా కూడా పనిచేశారు. ఈ కుంభకోణం బళ్లారి (కర్ణాటక), అనంతపురం (ఆంధ్రప్రదేశ్) ప్రాంతాలలో జరిగిన అక్రమ ఖనిజ తవ్వకాల చుట్టూ కేంద్రీకృతమై ఉంది.
అనుమతికి మించి తవ్వకాలు
ఓబులాపురం మైనింగ్ కంపెనీ.. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని అటవీ భూములలో అనుమతి లేకుండా ఇనుము ఖనిజాన్ని తవ్వినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతించిన 68.5 హెక్టార్ల ప్రాంతాన్ని దాటి 29.30 లక్షల టన్నుల ఇనుము ఖనిజాన్ని OMC సంస్థ అక్రమంగా తవ్వినట్లు సీబీఐ ఆరోపించింది.
రూ.42,000 కోట్లు స్కామ్
ఓబులాపురం మైనింగ్ కంపెనీ.. 2007-2010 మధ్య దాదాపు 60 లక్షల టన్నుల ఇనుము ఖనిజం అక్రమంగా తవ్విందని సీబీఐ అభియోగాలు మోపింది. దీని విలువ దాదాపు రూ. 42,000 కోట్లు ఉంటుందని చార్జిషీట్ లో పేర్కోంది.
లోకాయుక్త నివేదిక
కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే 2011లో సమర్పించిన నివేదిక ప్రకారం.. ఖనిజ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, మంత్రులు కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ‘జీరో రిస్క్ సిస్టమ్’ అనే రక్షణ, దోపిడీ వ్యవస్థను సృష్టించి గాలి జనార్థన రెడ్డి ఈ కుంభకోణానికి తెరలేపినట్లు పేర్కొంది.
ప్రధాన ఆరోపణలు
ఓబులాపురం మైనింగ్ కంపెనీకి అనుబంధంగా ఉన్న జీఎల్ఏ ట్రేడింగ్ (GLA Trading), జీజేఆర్ హోల్డింగ్స్ (GJR Holdings) వంటి గాలి జనార్థన్ రెడ్డి సోదరుల సంస్థలు.. అక్రమ తవ్వకాల ద్వారా వచ్చిన సొమ్మును విదేశీ కంపెనీలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ ఎగవేయడంతో పాటు ఆదాయాన్ని దాచిపెట్టి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గాలి జనార్థన్ రెడ్డి సోదరులపై అభిపోయాలు ఉన్నాయి.
సీబీఐ విచారణ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సిఫార్సు మేరకు 2009లో సీబీఐ ఈ కుంభకోణంపై విచారణ ప్రారంభించింది. రెండేళ్ల విచారణ అనంతరం 2011 సెప్టెంబర్ 5న గాలి జనార్థన రెడ్డి, అతని బావ బీ.వీ. శ్రీనివాస రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అలాగే ఈ కుంభకోణంపై భాగస్వామ్యులైన మాజీ ఐఏఎస్ అధికారి వీ.డీ. రాజగోపాల్, ఏపీ ఇండస్ట్రీస్ మాజీ కార్యదర్శి వై. శ్రీలక్ష్మిని కూడా సీబీఐ అరెస్టు చేసింది. రాజగోపాల్ ఓబులాపురం కంపెనీకి ప్రాధాన్యత ఇచ్చి ఇతర దరఖాస్తుదారులకు లైసెన్సులు నిరాకరించినట్లు శ్రీలక్ష్మిపై ఆరోపణలు వచ్చాయి.
2015లో జనార్థన రెడ్డికి బెయిల్
ఓబులాపురం మైనింగ్ కుంభకోణానికి సంబంధించి .. 2015లో జనార్థన రెడ్డి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలంటూ గడువు విధించడంతో గత నెల వాదనలు పూర్తయ్యాయి.విచారణ దశలోనే లింగారెడ్డి మృతి చెందారు. 2022లో హైకోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్ఛార్జి చేసింది. మిగిలిన నిందితులకు సంబంధించి సీబీఐ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.
Also Read: Alekhya – MLC Kavitha: వీరిద్దరూ ఇంత క్లోజ్ ఫ్రెండ్సా.. ఒకరికోసం ఒకరమంటూ ఎమోషనల్ పోస్ట్!
రాజకీయ ప్రభావం
ఇదిలా ఉంటే ఓబులాపురం మైనింగ్ కుంభకోణం కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్. యడియూరప్పపై కూడా లంచం ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన రాజీనామా చేశారు. రెడ్డి సోదరులు బీజేపీ నాయకులుగా ఉన్నప్పటికీ ఈ కుంభకోణం తర్వాత పార్టీ వారితో దూరం పాటించింది.
