Kishan Reddy: కులగణన అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై తెలంగాణ బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం చేసింది కుల గణన కాదని.. కేవలం క్యాస్ట్ సర్వే మాత్రమే అని విమర్శించారు. తూతూ మంత్రంగా కులగణన చేపట్టారని ఆరోపించారు. కులగణనను వ్యతిరేకించారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను సైతం కిషన్ రెడ్డి ఖండించారు. కుల గణనకు తాము వ్యతిరేకం కాదన్న కేంద్ర మంత్రి.. బీసీలలో ముస్లింలను చేర్చొద్దని మాత్రమే చెప్పినట్లు స్పష్టం చేశారు.
అందుకు పూర్తి వ్యతిరేకం
కులగణన ద్వారా బీసీలలో ముస్లింలను కలపడం రాజ్యాంగ విరుద్ధంమని గతంలో సుప్రీం కోర్ట్ సైతం చెప్పినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీసీలలో ముస్లింలను చేర్చడానికి తమ పార్టీ పూర్తి వ్యతిరేకమని మరోమారు స్పష్టం చేశారు. మరోవైపు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో తొలిసారి కులగణన జరగబోతోందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఘనత ప్రధాని మోదీదేనని స్ఫష్టం చేశారు. అసలు సరైన పద్దతిలో కులగణనను నిర్వహించకుండా దేశానికే రోల్ మోడల్ ఎలా అవుతారని ప్రశ్నించారు. మోడీ సారథ్యంలో సమగ్రమైన బీసీ కుల గణన చేపట్టబోతున్నట్లు కిషన్ రెడ్డి అన్నారు.
చర్చకు సిద్ధమా..
తెలంగాణలో కుల గణన జరిగితే దానిపై చర్చకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి సవాలు విసిరారు. తెలంగాణలో సెన్సెస్ చేపట్టకుండానే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు జబ్బలు జరుచుకుంటున్నారని విమర్శించారు. మరోవైపు 2014 తర్వాత మౌలిక వసతుల కల్పనతో దేశంలో నూతన శకం మొదలైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 90 శాతం జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనకు మోడీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తుచేశారు. దేశంలో మౌలిక వసతుల అంశంలో వేగంగా ముందుకు అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.
రహదారులకు మహర్దశ
దేశంలో జాతీయ రోడ్ల అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ 33 జిల్లాలకు గాను 32 జిల్లాల్లో రోడ్ల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. 2014 తెలంగాణలో 2500 కిలో మీటర్ల జాతీయ రహాదారులుంటే ఇవాళ 5200 కిలోమీటర్లకు జాతీయ రహదారులు పెరిగాయని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 1 లక్ష 20 కోట్ల నిధులను కేవలం రోడ్ల నిర్మాణంపైనే ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ సారథ్యంలో వేగవంతంగా రోడ్ల నిర్మాణం, కనెక్టివిటీ జరుగుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
భూసేకరణ జరగక ఆలస్యం
మరోవైపు దేశ అభివృద్ధిలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ కు అన్ని వైపుల అత్యాధునికంగా, అన్ని సౌకర్యాలతో జాతీయ రహదారులు రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ – శ్రీశైలం మధ్య ఫోర్ లైన్ ఎలివేటెడ్ హైవే ప్రతిపాదనలో ఉన్నట్లు పేర్కొన్నారు. కొన్ని చోట్ల భూసేకరణ కాకపోవడం వల్ల రహదారుల నిర్మాణం నత్తనడకన జరుగుతున్నాయని జాతీయ రహదారులకు కావలసిన ల్యాండ్ అక్విజేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా పనులు పూర్తవుతాయని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read: Miss World Contestants: మెడికల్ టూరిజం హబ్ గా తెలంగాణ.. సీఎం మాస్టర్ ప్లాన్ ఇదే!
రాష్ట్రాని నితిన్ గడ్కరీ
తెలంగాణలో రూ.6వేల కోట్ల నిధులతో గ్రీన్ ఫీల్డ్ క్యారిడార్ రోడ్ల నిర్మాణం జరుగుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 5 క్యారిడర్లకు లక్ష కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి రాబోతున్నారన్న కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో రూ.5,416 కోట్ల రోడ్ల అభివృద్ధి పనులను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్, హైదరాబాద్ రెండు చోట్ల వివిధ జాతీయ రహదారులకు భూమి పూజ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ లో 5 ప్రాజెక్ట్ లు, హైదరాబాద్ లో అంబర్ పేట్ ఫ్లై ఓవర్ తో పాటు పలు నూతన రోడ్ల అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నట్లు చెప్పారు.