Gadwal Congress Conflict: గద్వాల అధికార పార్టీలో ఆదిపత్య ధోరణి తారస్థాయికి చేరుతోంది. జిల్లా కాంగ్రెస్ పార్టీకి కేంద్ర బిందువైన గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరిత వర్గాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. సొంత పార్టీలోనే ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ రోడ్డెక్కుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చేపట్టే ప్రతి అధికారిక కార్యక్రమంలో ఈ తరహా సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సరి పోటీ చేశారు. అయితే అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వల్ల తమ నాయకురాలికి ప్రాధాన్యత ఉండటం లేదన్న భావనలో ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఇలాంటి పరిణామాలు ఇబ్బందికరంగా మారనున్నాయనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
జిల్లాలో రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మెజార్టీ స్థానాలు సాధించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ సమయంలో పార్టీలోని నేతల మధ్య అభిప్రాయ బేధాలు రావడం శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. సుమారు పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ 2023 చివరలో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.
ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకంగా 11 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. కేవలం గద్వాల, అలంపూర్ అసెంబ్లీ స్థానాల్లో ఓటమి పాలు కాగా బీఆర్ఎస్ గెలిచింది. పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచిపోయింది. జిల్లా స్థాయిలో ఇంకా పదవుల పంపకం జరగలేదు. సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలు అందించిన సీనియర్లు ఇంకా పదవులకు దూరంగానే ఉన్నారు. పథకాల అమలుకు ఆలస్యం అవుతున్నా ప్రజలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా పదవులు పొందే అవకాశం పార్టీ కేడర్ కు ఉంది. ఈ కారణంగానే తమలో అంతర్గతంగా ఎంత అసంతృప్తి ఉన్నా అంటి పెట్టుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేతో పాటు అనుచర నాయకులతో పొసగని వారు అక్కడక్కడ తమ వ్యతిరేకతను ప్రకటిస్తూనే ఉన్నారు.
గద్వాల నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గద్వాల ఎమ్మెల్యేగా కృష్ణమోహన్ రెడ్డి, జడ్పి చైర్ పర్సన్ గా సరిత కొనసాగారు. గద్వాలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే తలంపుతో సరిత ప్రత్యేక క్యాడర్ ను కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఏర్పడ్డ ఆధిపత్యపోరు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం కొనసాగుతోంది. గద్వాలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉద్దేశంతో జడ్పీ చైర్ పర్సన్ పార్టీ టికెట్ కోసం శత విధాల ప్రయత్నించారు. బీఆర్ఎస్ సీటు ఆశించగా సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికే గద్వాల సీటు దక్కడంతో విధిలేక కాంగ్రెస్ పార్టీ నుంచి సరిత పోటీ చేయాల్సి వచ్చింది.
గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో సానుకూలత ఉండడంతో సరిత గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కుల, పోల్ మేనేజ్మెంట్ లో విఫలం కావడంతో కృష్ణమోహన్ రెడ్డికి స్వల్ప తేడాతో ఆమెపై గెలిచారు. అనంతరం ఓడిన అభ్యర్థులు ఆ నియోజకవర్గాలలో ఇన్చార్జిల్లుగా కొనసాగుతారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో గద్వాలలో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల తాకిడితో ఆమె కార్యాలయం సందడిగా మారింది. తనకు కావాల్సిన వారికి పోలీస్ శాఖలో పోస్టింగ్లు ఇవ్వడంతో ఆమెకు కావాల్సిన పని జరిగేది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా గెలిచినా తను నమ్ముకున్న క్యాడర్ కు పనులు కాకపోవడంతో కృష్ణమోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారు. మంత్రి జూపల్లితో ఉన్న సత్సంబంధాల ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి సరిత ప్రాబల్యం తగ్గుతూ వస్తోంది. అధికారిక కార్యక్రమాలలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొనగా ప్రోటోకాల్ కారణంగా ఆమెను స్టేజి మీదకి పిలవకపోవడంతో ఆమె అనుచరులు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారు. ఇటీవల ధరూర్ లో భూభారతి కార్యక్రమంలో సరిత తీర్పదే వర్గీయులు ఎమ్మెల్యే పై కండువా రాజకీయాలు చేయడంతో రాజకీయ రచ్చ ఏర్పడింది. దీంతో సరిత వర్గాన్ని సమయమానం పాటించాలని పోలీసులు ఎంపీ సూచించినా వినకపోవడంతో లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది.
గత మార్చి నెలలో బీచుపల్లి లో జరిగిన కార్యక్రమంలో తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మా దారి మేము చూసుకుంటామని సరిత వర్గం మాజీ ఎమ్మెల్యే సంపత్ ముందు బహాటంగానే అల్టిమేటం జారీ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతిసారి రాజకీయ రాద్ధాంతం చేయడం తగదని,రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, అభివృద్ధి శాశ్వతమని అందుకు సహకరించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సభ సాక్షిగా కోరారు. ఈ సందర్భంగా సరిత వర్గం రెచ్చిపోవడానికి ఎంపీ మల్లురవి ప్రోత్సాహమే కారణమని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎంపీ తో వాదించగా తనకు ఎన్నికల్లో సపోర్ట్ చేశారని నేను సపోర్ట్ చేస్తున్నానని పేర్కొంటూ ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా గెలుస్తావో చూస్తానంటూ ఎమ్మెల్యే హెచ్చరించారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Also Read: Modi Praises Chandrababu: ఆ విషయంలో చంద్రబాబే స్ఫూర్తి.. సీక్రెట్ రివీల్ చేసిన ప్రధాని మోదీ
మరోవైపు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సైతం రాష్ట్ర నాయకులతో సఖ్యతగా ఉంటూ జిల్లా రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మెుత్తంగా జిల్లాలో ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత నెలకొంటోంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజా ప్రతినిధుల మధ్య సఖ్యత కుదిర్చి పదవుల భర్తీ చేపట్టడం ద్వారా పార్టీ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నాయి.