Heavy Rains: అకాల వర్షం, ఈదురు గాలులు అన్నదాతల (Farmers) కు అపార నష్టం కలిగించాయి. ఆరుగాలం కష్టపడి పంచించిన పంట వర్షార్పణం కావడంతో రైతుల కండ్లలో కన్నీరే మిగిలింది. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాల్లో కురిసిన అకాల వర్షం (Rain) తో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి వరి నేల వాలింది. మహముత్తారం మండలంలో వడగళ్ల వాన కురిసింది. దీంతో వరి ధాన్యం నేల పాలయ్యింది. కొర్లకుంట దగ్గర రాహదారిపై చెట్టు విరిగిపడింది. దీంతో కాటారం – మేడారం ప్రధాన రహదారిపై సుమారు 7 గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు గ్రామాలకు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మహముత్తారం – వజినెపల్లి, కొత్తపల్లి రహదారిలో ఈదురుగాలులకు పదిచోట్ల వరకు రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వరి, మిర్చి వర్షానికి తడిసి ముద్దయింది. మల్హర్ మండలం సహా పలు మండలాల్లో మామిడికాయలు నేల రాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ అకాల వర్షం తమను నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యం వంకలు పెట్టకుండా కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు.
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం: జిల్లా కలెక్టర్
మహదేవ్ పూర్ మండల కేంద్రంలోని ఎర్ర చెరువు సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో కలిసి పరిశీలించారు. తడిసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కువ మొత్తంలో హమాలీలను ఏర్పాటు చేసి తడిసిన ధాన్యం మొలకెత్తక ముందే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యవసాయ శాఖ, సహకార శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతుల పంటల వివరాలను నమోదు నివేదిక అందించాలని పేర్కొన్నారు. తడిసిన ధాన్యం, పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి అందించి నష్టపరిహారం అందేae చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
కూలిన చెట్లు.. విరిగిన విద్యుత్ స్తంభాలు
మరోవైపు, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో అకాల వర్షంతో ప్రజల జనజీవనం ఆగమాగం అయింది. అతివేగంగా వీచిన ఈదురు గాలులతో ఎక్కడికక్కడ రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు సైతం నేలకొరిగాయి. దీంతో రహదారులపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించిపోయింది. ఖమ్మం జిల్లాలో గాలి వాన పెద్ద బీభత్సాన్ని సృష్టించింది. మహబూబాబాద్ నుండి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో మన్నెగూడెం వద్ద భారీ చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. నేలకొండపల్లి రహదారులపై పెద్ద పెద్ద చెట్లు నేలకొరగడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మహబూబాబాద్ నుండి భద్రాచలం వైపు వెళ్లే రహదారి పైన చెట్లు విరిగిపడడంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. మహబూబాబాద్ పట్టణ శివారు గాంధీ పురంలో వల్లాల మల్లేష్ ఇంటి రేకులు పూర్తిగా గాలికి లేచిపోయి ఇల్లంతా ధ్వంసం అయింది. గోడలపై ఉన్న సిమెంట్, ఇటుక పెళ్లలు గొర్రెలపై పడి అవి మృతి చెందాయి. గార్ల మండలం రంగాపురం గ్రామంలో ముత్యాలమ్మ ఆలయంలో ఉన్న 130 ఏళ్ల నాటి మహావృక్షం కూలింది. ఆ సమయంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురుగాలులతో చెట్లు స్తంభాలు పడిపోయాయి. బొప్పాయి, మామిడి తోటల్లో పంట నష్టం వాటిల్లింది. మన్నెగూడెం, సిరోలు గ్రామాల్లో భారీ చెట్లు రోడ్డుపై విరిగిపడిపోవడంతో ఖమ్మం, మహబూబాబాద్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో అకాల వర్షానికి మార్కెట్‌లో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. పంటను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ సీతారాములు తడిసిపోయిన ప్రతి రైతు పంటను ప్రభుత్వమే ఉంటుందని తెలిపారు. మిల్లులు ఖాళీగా లేకపోవడంతోనే ధాన్యం కొనుగోలు నిలిచిందని, స్థానిక మంత్రితో మాట్లాడి వేగవంతం చేస్తామన్నారు. గూడూరు మండలంలో గాలి దుమారంతో కూడిన వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అధికారులు సూచించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని చేగుమ్మ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం వర్షం నీటికి తడిసి ముద్దయింది.
Read Also- Gadwal Congress Conflict: గద్వాల కాంగ్రెస్ లో రాజుకుంటున్న చిచ్చు.. రోడ్డెక్కుతున్న నేతలు!