Best Management Award: జల మండలికి మరో అరుదైన అవార్డు దక్కింది. తమ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకుంటున్న చర్యలు, మంచి పారిశ్రామిక సంబంధాలకు గానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ యాజమాన్య పురస్కారాన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. ఈ అవార్డును జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు. ప్రభుత్వ విభాగాల్లో జలమండలికి మాత్రమే ఈ అవార్డు దక్కడం విశేషం.
ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ బోర్డు పరిధిలో పనిచేసే కార్మికుల భద్రతకు జలమండలి పెద్దపీట వేస్తోందన్నారు. పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టిందన్నారు. విధులు నిర్వర్తించేటప్పడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు అన్ని డివిజన్లలో భద్రతా వారోత్సవాలు ఏటా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
పారిశుద్ధ్య పనుల్లో ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) గైడ్ లైన్స్ అమలుపై, భద్రతా పరికరాల పనితీరు, వాటిని ఉపయోగించే విధానం, మురుగు నీటి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం సంభవించినపుడు చేసే ప్రథమ చికిత్స వంటి అంశాలపై కార్మికులు, సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్మికుల ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులను సైతం జారీ చేసి, ప్రతి ఆరు నెలలకోసారి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
చలివేంద్రాల ఏర్పాటు:
వేసవి దృష్ట్యా పాదచారులు, ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు జలమండలి చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. బసవతారకం కాన్సర్ ఆసుపత్రి దగ్గర ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డైరెక్టర్ ఆపరేషన్స్-1 అమరేందర్ రెడ్డి ప్రారంభించారు. వివిధ అవసరాల కోసం బయటకి వచ్చే సామాన్య ప్రజలు, ప్రయాణికులు, పాదచారుల దాహార్తిని తీర్చేందుకు నగరంలో ప్రధాన ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైతు బజార్లు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లు తదితర ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 42 కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. వీటిలో ఇప్పటికే కొన్ని కేంద్రాలు ప్రారంభమై అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో సీజీఎం ప్రభు, జీఎంలు హరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Maoists: నక్సల్స్‌తో శాంతి చర్చలు.. 2004లో ఏం జరిగింది? ఈసారి ఏం చేయాలి?