GHMC Seats: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలో ప్రస్తుతం కిస్సా కుర్చీగా నడుస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త కమిషనర్ గా ఆర్. వి. కర్ణన్ ను నియమించటం పట్ల అలక చెందిన ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు సెలవులపై వెళ్లారు. వీరిలో ఒకరు కర్ణన్ కన్నా ఐఏఎస్ బ్యాచ్ లో ఓ ఏడాది సీనియర్ కాగా, మరో ఐఏఎస్ ఆఫీసర్ కు కూడా ఎలాంటి కారణాల్లేకుండానే సెలవులపై వెళ్లారు. వీరిద్దరు మళ్లీ వచ్చి విధుల్లో చేరుతారా? అన్న ప్రశ్నకు సమాధానం లేకపోయినా, వీరిలో కమిషనర్ కన్నాఓ ఏడాది సీనియర్ ఆఫీసర్ మాత్రం మళ్లీ జీహెచ్ఎంసీలోకి వచ్చే అవకాశాల్లేనట్టేనని తెలిసింది.
ఆయన రాకుండా ఖాళీ అయ్యే ఎలక్ట్రికల్, లేక్స్, భూ సేకరణ విభాగాలు ఖాళీ కానున్నాయి. రెండున్నర నెలల క్రితం పలు కారణాలతో పరిపాలన విభాగం నుంచి తప్పించిన నాన్ క్యాడర్ ఆఫీసర్ కు కొద్దిరోజుల క్రితం అప్పటి కమిషనర్ ఇలంబర్తి హౌజింగ్ విభాగాన్ని కేటాయించినట్లు సమాచారం. ఇక మిగిలిన వాటిల్లో ఎలక్ట్రికల్స్, లేక్స్, భూ సేకరణ విభాగాలు ప్రస్తుతానికి ఎవరూ పర్యవేక్షించవారు లేకపోవటంతో ఖాళీగానే ఉన్నాయి.
మరో ఐఏఎస్ ఆఫీసర్ సైతం విధులకు హాజరుకాకుండా జీహెచ్ఎంసీలో అతి ముఖ్యమైన కీలకమైన ఐటీ, రెవెన్యూ విభాగాలు సైతం ఖాళీ అయ్యే అవకాశాలుండటంతో ఇపుడు ఇతర విభాగాలకు అదనపు కమిషనర్లుగా వ్యవహారిస్తున్న పలువురు అధికారులు ఖాళీ కానున్న అయిదు విభాగాలకు అదనపు కమిషనర్ పోస్టును దక్కించుకునేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. వీరిలో కొందరు హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి సిఫార్సుల కోసం ప్రయత్నాలు చేస్తుండగా, మరి కొందరు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలిసింది.
Also Read: Ponguleti Srinivas: భూ భారతి కి అనూహ్య స్పందన.. మంత్రి పొంగులేటి!
ఈ క్రమంలో సెలవులపై వెళ్లిన ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు పర్యవేక్షించే విభాగాలకు నేటికీ కూడా కొత్త కమిషనర్ ఇన్ ఛార్జిలను నియమించలేదు. ఉన్నవారిలోనే సమర్ధులను చూసి, ఇన్ ఛార్జిలుగా నియమించాలని కమిషనర్ భావిస్తుండగా, పోస్టింగ్ కోసం ఇతర అధికారులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తూ, మంత్రలు ఆఫీసులు, సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
త్వరలో ఆ ఖాళీ భర్తీ
జీహెచ్ఎంసీలో దోమల నివారణను పర్యవేక్షించే చీఫ్ ఎంటమాలజిస్టు పోస్టు సుమారు ఆరు నెలల నుంచి ఖాళీగానే ఉంది. ఈ పోస్టులో విధులు నిర్వర్తించిన రాంబాబు గత అక్టోబర్ మాసం చివర్లో రిటైర్డు అయిన వెళ్లిపోయిన తర్వాత ఆ సీటుకు ఇన్ ఛార్జిగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ను నియమించినా, ఆమె ఎక్కువ రోజుల పాటు కొనసాగలేదు. ప్రస్తుతం ఈ పొస్టుకు అదనపు కమిషనర్ (హెల్త్) ఇన్ ఛార్జిగా వ్యవహారిస్తున్నట్లు సమాచారం.
ఈ పోస్టుతో పాటు జోనల్ స్థాయిలో దోమల నివారణను పర్యవేక్షించే సీనియర్ ఎంటమాలజిస్టు పోస్టులు కూడా ఖాళీ గా ఉండటంతో కొద్ది రోజుల క్రితం అప్పటి కమిషనర్ ఇలంబర్తి స్టేట్ మలేరియా డిపార్ట్ మెంట్ కు లేఖ రాయటంతో మూడు జోన్లకు ముగ్గురు జోనల్ స్థాయి చీఫ్ ఎంటమాలజిస్టులను ఆ శాఖ నియమించింది. కానీ చీఫ్ ఎంటమాలజిస్టును నియమించకుండా ఇంకా ఈ కుర్చీగా ఖాళీగానే ఉంది.
గతంలో కూకట్ పల్లి జోన్ లో సీనియర్ ఎంటమాలజిస్టుగా విధులు నిర్వహిస్తూ, ఏసీబీకి పట్టుబడ్డ ఓ మహిళా ఆఫీసర్ ఈ పోస్టు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత కమిషనర్ ఆర్. వి. కర్ణన్ తో ఆమెకు పరిచయాలుండటంతో ఆ కుర్చీని దక్కించుకునేందుకు ఆమె తనదైన ప్రయత్నాలను చేస్తున్నట్లు, త్వరలోనే ఈ సీటు భర్తీపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/