Maoists: మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) తలపెట్టిన ఆపరేషన్ కగార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తావిస్తోంది. తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల వద్ద జరుగుతున్న ఈ ఆపరేషన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతను కొందరు సమర్థిస్తుంటే మరికొందరు దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. దీనిని ఎంతైనా మానవీయ కోణంలో చూడాల్సిన అవసరముందని స్పష్టం చేస్తున్నారు. అటు తెలంగాణ సర్కార్ సైతం హింసను విడనాడి మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని కోరుకుంటోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి కీలక లేఖ రాసింది.
కేంద్రానికి కేకే లేఖ
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు (K. Kesava Rao).. ములుగు జిల్లా గుట్టల్లో జరుగుతున్న ఆపరేష్ కగార్ పై కేంద్రానికి లేఖ రాశారు. ఈ ఆపరేషన్ ను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య దేశంలో హింసకు చోటు లేదన్న కేకే.. మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఆ చర్చల ద్వారా శాంతి వాతావరణం తీసుకొచ్చినట్లు లేఖలో గుర్తు చేశారు. తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల నుంచి బలగాలను వెనక్కి రప్పించాలని విజ్ఞప్తి చేశారు.
2004 ఏం జరిగింది?
2004కి ముందు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండేది. అయితే ఎన్నికల ప్రచార సమయంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పుతామని అప్పట్లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. 2004 మేలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మూడు నెలల కాలానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా మావోయిస్టులపై 1992లో విధించిన నిషేధాన్ని సైతం ప్రభుత్వం ఎత్తివేసింది. తద్వారా మావోయిస్టులతో చర్చలకు కావాల్సిన మంచి వాతావరణాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది.
2004 అక్టోబర్ లో చర్చలు
హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో 2004 అక్టోబర్ 15–18 తేదీల మధ్య హోంమంత్రి జానా రెడ్డి నేతృత్వంలో నలుగురు మంత్రుల కమిటీ నక్సల్స్‌తో చర్చలు జరిపింది. గిరిజన భూముల రక్షణ, ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణ, దళితులకు సామాజిక న్యాయం, స్త్రీలకు సమాన హక్కులు, మైనారిటీల రక్షణ తదితర అంశాలే ఎజెండాగా చర్చలు జరిగాయి. సీపీఐ (మావోయిస్ట్) నాయకులైన రామకృష్ణ (ఆర్.కె), గణపతి వంటి వారు చర్చల్లో పాల్గొన్నారు. వారు భూసంస్కరణలు, గిరిజన హక్కులు వంటి డిమాండ్లను ముందుకు తెచ్చారు.
ఆ కారణాల చేత విఫలం
అయితే ప్రభుత్వం సూచించిన విధంగా ఆయుధాలు విడనాడేందుకు మాత్రం మావోయిస్టులు అంగీకరించలేదు. మరోవైపు చర్చలు జరుగుతున్న సమయంలోనే కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులపై పోలీసుల ఎన్‌కౌంటర్లు జరిగాయి, ఇది చర్చల వాతావరణాన్ని దెబ్బతీసింది. మావోయిస్టులకు ప్రభుత్వంపై, ప్రభుత్వానికి మావోయిస్టులపై విశ్వాసం దెబ్బతింది. కవి వరవర రావు, గద్దర్ వంటి ప్రముఖులు చర్చలను సులభతరం చేయడానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ రెండు పక్షాల మధ్య సమన్వయం కుదరలేదు. విభేదాలును తగ్గకపోవడంతో కొన్ని నెలల్లోనే చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మావోయిస్టులపై కఠిన వైఖరి అవలంభించారు.
ఇప్పుడు ఏం చేయాలి?
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో మావోయిస్ట్ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చేపట్టిన ఆపరేషన్ కగార్ (Operation Kagar) పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం తిరిగి నక్సల్స్‌తో చర్చలు జరుపుతుందా? అన్న ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. అటు మావోయిస్టులు సైతం కర్రెగుట్టల్లో బలగాల కూంబింగ్ ఆపాలని లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఒకవేళ చర్చలు జరిగితే ఎలాంటి అంశాలు కీలకమవుతాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
Also Read: CM Revanth Reddy: నన్ను నమ్మండి.. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు.. సీఎం రేవంత్
ముఖ్యమైన అంశాలు
1. సామాజిక ఆర్థిక సంస్కరణలు: గిరిజన హక్కులు, భూసంస్కరణలు, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మావోయిస్టులు చర్చలకు ముందుకు రావచ్చు.
2. మధ్యవర్తుల పాత్ర: నిష్పాక్షికమైన మధ్యవర్తులు, సమాజ సేవకులు లేదా మానవ హక్కుల కార్యకర్తలు చర్చలను సమన్వయం చేయవచ్చు.
3. ఆయుధాల సమస్య: గతంలో మాదిరిగానే, ఆయుధాల విషయంలో రాజీ ఒక పెద్ద సవాలుగా ఉండవచ్చు.
4. రాజకీయ సంకల్పం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు పూర్తి మద్దతు ఇస్తే అవి విజయవంతమయ్యే అవకాశం ఉంది.
చర్చలు సక్సెస్ కావాలంటే!
2004లో చర్చల వైఫల్యంపై నక్సల్స్‌తో పాటు ప్రభుత్వాలు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. 2004లో మావోయిస్టులతో చర్చలు.. విశ్వాస లేమి, ఆయుధాల సమస్య, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా విఫలమయ్యాయి. ఈసారి ఆ తప్పిదాలు జరగకుండా ఇరు పక్షాలు జాగ్రత్త వహించాల్సిన అవసరముంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం, మావోయిస్టులు ఓపికతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.