BJP Fires on CM Revanth: కాంగ్రెస్ పోరాటంతోనే కులగణకు బీజేపీ అధినాయకత్వం తలొగ్గిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలను.. తెలంగాణ బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు. సీఎం రేవంత్ తాజా ప్రెస్ మీట్ అనంతరం స్పందించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar).. కాంగ్రెస్ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు. స్వాతంత్రం తర్వాత 48 ఏళ్లు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్.. ఏనాడూ బీసీల జనగణన చేపట్టలేదని విమర్శించారు. అణగారిన వర్గాలను ఛాంపియన్ అని చెప్పి.. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు కొల్లగొట్టినట్లు ఆరోపించారు.
ఆ ఘనత మాదే
కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీసీల జనగణన చేయకుండా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మెుసలి కన్నీరు కారుస్తోందని ఈటల రాజేందర్ మండిపడ్డారు. 2014లో ఓబీసీని ప్రధాని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఈటల అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలను, 12 మంది ఎస్సీలను, 8 మంది ఎస్టీలను, 5 మంది మైనారిటీలకు స్థానం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. వెనకబడిన వర్గాలకు చెందిన 60 శాతం మందికి మంత్రి వర్గంలో స్థానం కల్పించి గౌరవించినట్లు చెప్పారు.
కాంగ్రెస్ కు చెంపపెట్టు
2014లో ఒక దళిత బిడ్డను.. 2021లో ఆదివాసి అడవి బిడ్డను రాష్ట్రపతులను చేసిన ఘనత కూడా బీజేపీకే దక్కుతుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మెుసలి కన్నీరు కార్చే కాంగ్రెస్ కి చెంపపెట్టు లాగా కేంద్రం ప్రభుత్వం.. దేశంలో కులగణన చేపట్టనున్నట్లు చాలా హర్షణీయమని ఈటల రాజేందర్ అన్నారు. కేంద్రం నిర్ణయంతో ఓబీసీలకు గుర్తింపు లభిస్తుందన్న ఈటల.. రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగాల పరంగా ఓబీసీలకు అవకాశాలు మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.
కులగణన తప్పుల తడక
మరోవైపు బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ (K. Laxman) సైతం సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ కుల గణన తప్పుల తడక అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. బీసీలపై మండలి కమిషన్ సిఫార్సులు చెత్త బుట్టలో వేసిన చరిత్ర.. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలదని లక్ష్మణ్ ఆరోపించారు. నాటి నుంచి బీసీలకు కాంగ్రెస్ విరోధిగానే ఉందని ఆరోపించారు. మరోవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు కొత్త అని చెప్పిన లక్ష్మణ్.. ఆయనలో కాంగ్రెస్ డీఎన్ఏ లేదని పేర్కొన్నారు.