Hit 3 Review Poster
ఎంటర్‌టైన్మెంట్

Hit 3 Review: బాబోయ్ ఇదేం ఊచకోత.. ‘హిట్ 3’ ఎలా ఉందంటే..

Hit 3 Review: నేచురల్ స్టార్ అనే బిరుదు నానికి వచ్చిందే.. క్లాస్ సినిమాలు చేస్తూ, పక్కింటి అబ్బాయిలా ఉంటాడని, ప్రతి ఇంటిలో ఒక పర్సన్‌గా ఊహించుకునేంతగా కలిసిపోతాడని. కానీ నాని అదే ఇమేజ్‌లో ఉంటే, చాలా కష్టం అని భావించాడో, లేదంటే కొత్తగా ఏదైనా ప్రేక్షకులకు ఇవ్వాలని తలంచాడో తెలియదు కానీ, ఈ మధ్య నాని (Natural Star Nani) చేస్తున్నవన్నీ రా అండ్ రస్టిక్ చిత్రాలే. ‘దసరా’ (Dasara) మొదలుకుని ఆయన చేస్తున్న సినిమాలలో నానిలో రెండో యాంగిల్ కనిపిస్తుంది. అలా అని, ఆయనేం ఫ్యాన్స్‌ని నిరాశ పరచడం లేదు. ఏ పాత్రనైనా చేయగలనని నిరూపించుకుంటూ, అసలైన నేచురల్ స్టార్‌కి అర్థం ఇదని చాటుతున్నాడు. ఇప్పుడు నిర్మాతగానూ మారి, సక్సెస్‌ఫుల్ చిత్రాలతో దూసుకెళుతున్నాడు. ఆయన నిర్మాణంలో వచ్చిన ‘హిట్’ ఫ్రాంచైజీ (Hit Franchise) చిత్రాలు ఎలాంటి సక్సెస్‌లు అందుకున్నాయో తెలియంది కాదు. ఇప్పుడా ఫ్రాంచైజీ నుంచి మూడో పార్ట్ ‘హిట్: ది థర్డ్ కేస్’ (Hit: The 3rd Case) చిత్రం మే డే ని పురస్కరించుకుని ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, నాని ఇంటర్వ్యూలు అన్నీ కూడా సినిమాపై ఎక్కడా లేని క్రేజ్‌కు కారణమయ్యాయి. కెజియఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. హిట్ 1, 2 పార్ట్‌లను మించి ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా విడుదలకు ప్లాన్ చేశారు. ప్రమోషన్స్ పరంగానూ, సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లడంతో మేకర్స్ ఎక్కడా తగ్గలేదు. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు పిల్లలను, పెద్ద వయసు వారిని దూరంగా ఉంచమని నాని కోరడంతో.. సినిమాలో ఏదో విషయం ఉందనేలా అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మాత్రం అందుకుందో, అసలీ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

Also Read- Single Controversy: ‘కన్నప్ప’కు సారీ చెప్పారా? చెప్పించారా? కాంట్రవర్సీ‌కి ఫుల్ ‌స్టాప్ పడినట్టేనా!

‘హిట్-3’ కథ (Hit3 Movie Story) ఇదే:
ఒకేలా రెండు హత్యలు వేరు వేరు ప్రదేశాలలో వేరు వేరు వ్యక్తులు చేస్తారు. వైజాగ్ హిట్ టీమ్‌లోని ఎస్.పి అర్జున్ సర్కార్ (నాని) ఈ హత్యలలో ఉన్న సారూప్యతని గమనిస్తూ, ఓ ఆలోచనలోకి వెళ్లిపోతాడు. అసలు ఎలా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఇలా సంబంధంలేని వ్యక్తులను హత్య చేస్తున్నారనే సందేహంతో ఇంటరాగేషన్ మొదలుపెడతాడు. అప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 13 హత్యలు ఒకే ప్యాట్రన్‌లో జరిగినట్లుగా తెలుసుకున్న అర్జున్ సర్కార్.. అసలెందుకు ఇంత క్రూరంగా మనుషులను చంపుతున్నారు. వాళ్ల మోటో ఏమిటి? అనేది తెలుసుకునేందుకు తన టీమ్‌తో కలిసి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ ఆపరేషన్‌లో కొన్ని కళ్లు చెదిరే విషయాలను గమనిస్తాడు. ఈ హత్యల వెనుక ఒక సైకో గ్యాంగ్ ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. అర్జున్ సర్కార్ గమనించిన విషయాలు ఏంటి? దీని వెనుక సైకో గ్యాంగ్ ఉన్నట్లుగా ఎలా తెలుసుకుంటాడు? తను ఎందుకు సైకోగా మారతాడు? సైకో గ్యాంగ్ ఆటను అర్జున్ ఎలా ముగించాడు? ఈ క్రమంలో అతని జీవితంలోకి వచ్చిన మృదుల (శ్రీనిధి శెట్టి) ఎవరు? అర్జున్ సర్కార్ ఆపరేషన్‌కు ఆమె ఎలా హెల్ప్ అయింది? వంటి విషయాలకు సమాధానమే.. ‘ఊచకోత’తో నిండిన ‘హిట్ 3’ సినిమా.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
‘హిట్’ ఫ్రాంచైజీలకు సంబంధించి మొదటి రెండు పార్ట్‌‌లను విశ్వక్, అడవి శేష్‌లతో నిర్మించిన నాని, ఈ పార్ట్ 3 కోసం తనే ఎందుకు రంగంలోకి దిగాడో.. ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. నాని పాత్రకు ఈ సినిమాలో అంత డెప్త్ ఉంది. దేశం కోసం, సామాన్య పౌరుల రక్షణ కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడే పాత్రలో నాని అద్భుతంగా చేశాడు. అలాగే యాక్షన్ పార్ట్ విషయానికి వస్తే.. అంతా ఆశ్చర్యపోయేలా నాని తన నటనతో రక్తికట్టించాడు. ఇంకా చెప్పాలంటే సీటులో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు నాని వైపే ఉంటారంటే అస్సలు అతిశయోక్తి కాదనే చెప్పుకోవాలి. అస్సలు తగ్గేదే లే అన్నట్లుగా నాని విశ్వరూపం ప్రదర్శించాడు. శ్రీనిధి శెట్టి రెండు వైవిధ్యమైన పాత్రలలో కనిపించింది. లవర్ పాత్రలో చాలా చక్కగా ఉంది. అందరూ నాని, శ్రీనిధి జంటకు ఫిదా అవుతారు. అలా ఉంటుంది వారి కెమిస్ట్రీ. ఇంకా కోమలి ప్రసాద్, చైతు జొన్నలగడ్డలకు మంచి పాత్రలు పడ్డాయి. ఇతర పాత్రలలో చేసిన అమిత్ శర్మ, రావు రమేష్, సముద్రఖని, బ్రహ్మాజీ వంటి వారంతా ఓకే. క్లైమాక్స్‌లో అడవి శేష్ ఎంట్రీతో పాటు.. హిట్-4కి ఇచ్చిన హింట్‌లో కార్తీ కనిపించి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు.

సాంకేతికంగా ఈ సినిమా చాలా రిచ్‌గా ఉంది. ముఖ్యంగా అందరూ డౌట్ పడింది మ్యూజిక్ విషయంలోనే. క్లాస్ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరున్న మిక్కీ ఈ సినిమాకు ఎలా మ్యూజిక్ ఇస్తాడో అని నాని ఫ్యాన్స్ కూడా కంగారు పడ్డారు కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అరిపించేశాడు. సినిమాటోగ్రఫీ‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణులందరి పనితనం చెప్పుకోదగిన రీతిలో ఉంది. ముఖ్యంగా వీటన్నింటినీ నాని డామినేట్ చేశాడనే చెప్పుకోవాలి. ఇక శైలేష్ కొలను ‘సైంధవ్’ రిజల్ట్ నుంచి ఎంత త్వరగా బయటపడాలా? అని ఎప్పటి నుంచో కసి మీద ఉన్నాడు. ఆ కసి మొత్తం ఈ సినిమాలో కనిపించింది. ఈ డైరెక్టర్‌ ఇంత హింసాత్మకంగా ఉన్నాడేంట్రా బాబూ అని అనిపిస్తాడు.

Also Read- Manchu Family: శివయ్యా.. ఎంత పని చేశావయ్యా! ‘సింగిల్’ ట్రైలర్‌తో మంచు ఫ్యామిలీ హర్ట్!

విశ్లేషణ: (Hit3 Movie Review)
విశ్లేషకులు ఎక్కువగా మాట్లాడకుండా నాని ప్రతి ఈవెంట్‌లో ఈ సినిమా గురించి చెబుతూనే ఉన్నాడు. మొదటి రెండు పార్ట్‌లు ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలని, ఇది మాత్రం క్రైమ్‌తో నిండిన యాక్షన్ చిత్రమని, మోస్ట్ వయొలెంట్‌గా ఉంటుందని ప్రతి ప్రమోషనల్ ఈవెంట్‌లో చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే ఈ సినిమా ఉంది. అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు ఈ సినిమా చూడొద్దని కూడా చెప్పాడు. అది కూడా కరెక్టే అనిపించింది. ఒకానొక దశలో ఇంత హింస ఏంటిరా బాబూ? అని అనిపిస్తుంది కానీ, అసలు మోటో తెలిశాక, ఎంత త్వరగా నాని వాళ్లని చంపేస్తాడా? అని ప్రేక్షకులే ఎదురు చూసేంతగా శైలేష్ స్క్రీన్‌ప్లే ఉందంటే.. ఎంత ప్లానింగ్‌గా ఈ సినిమాను మలిచారో అర్థం చేసుకోవచ్చు. ‘యానిమల్’, ‘మార్కో’, ‘కిల్’ ఛాయలు కనిపిస్తున్నట్లే ఉంటాయి కానీ, ఇలాంటి సైకోలు దేశానికి చాలా ప్రమాదం అని చెప్పిన తర్వాత ప్రేక్షకులు కూడా అర్జున్ స్టాండ్‌‌నే తీసుకుంటారు. మొదటి పార్ట్ అంతా కొన్ని ఇన్విస్టిగేషన్ సీన్లతో, మృదులతో ప్రేమ వ్యవహారాలతో నడిపిన శైలేష్.. సెకండాఫ్ మాత్రం నానితో ఊచకోత కోయించాడు. చివరిలో ఓ 20 నుంచి 25 నిమిషాల పాటు సాగిన ఎపిసోడ్‌ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే తీరుపైనే ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఆ ఎపిసోడే ఈ సినిమాకు బలం కూడా. ఓవరాల్‌గా అయితే, ఇలాంటి జోనర్ చిత్రాలను ఇష్టపడే వారికి మాత్రం ఫుల్ మీల్స్‌లా ఈ సినిమా ఉంటుంది. సాధారణ ప్రేక్షకులు కూడా అర్జున్ సర్కార్‌ ఆలోచనని ఆహ్వానిస్తే మాత్రం ‘హిట్3’కి ఇక ఎదురేలేదు. నాని అకౌంట్‌లో పాన్ ఇండియా సక్సెస్ పక్కా అని చెప్పుకోవచ్చు.

ట్యాగ్‌లైన్: నానీని ఎవడ్రా ఆపేది.. పోతారు, మొత్తం పోతారు!
రేటింగ్: 3/5

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్