Telangana Govt: రోడ్లులేని మారుమూల పల్లెల (Villages) ప్రజలకు ప్రభుత్వం (Govt) శుభవార్త చెప్పింది. ఆ గ్రామాలకు రోడ్డు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. రాష్ట్రంలో 17 వేల కిలో మీటర్లు పంచాయతీరాజ్ శాఖ రోడ్లు (Roads) వేయబోతుంది. హైబ్రీడ్ యాన్యుటీ మోడ్ (హామ్) విధానంలో పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాల్లో 4 వేల కిలోమీటర్లు సర్వే పూర్తి చేసింది. అందుకు హామ్ పనుల పర్యవేక్షణ కోసం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫీస్‌లో ప్రత్యేక అధికారిని నియమించారు. రాష్ట్రంలో గ్రామీణ రోడ్లు బాగుంటేనే పల్లెలు ఆర్థికాభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు రోడ్లు వేసేందుకు సంకల్పించింది. గ్రామీణ రోడ్ల నిర్మాణం, ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైబ్రీడ్ యాన్యూటీ మోడ్ (హెచ్‌ఏఎం) విధానానికి శ్రీకారం చుట్టింది. జాతీయ, ఆర్‌అండ్‌బీ రోడ్లు వేస్తున్నట్లుగానే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రామం నుంచి మండల, జిల్లా కేంద్రాలకు కలిపే రోడ్లుకు వీటిని అనుసంధానించనున్నారు. ఈ మేరకు హామ్ విధానంలో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
తొలి విడుతలో 7,835 కి.మీ.
రాష్ట్రంలో 17,300 కి.మీ పంచాయతీ రాజ్ రోడ్లు, 12,000 కిలోమీటర్లు ఆర్‌అండ్‌బీ రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడుతలో 7,835 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్ల నిర్మించనున్నది. ఆర్ అండ్ బీ రోడ్లను 5190 కిలో మీటర్లు నిర్వహించనున్నారు. కాగా, ఉమ్మడి 9 జిల్లాల్లో ఇప్పటికే పంచాయతీరోడ్లకు నాలుగు వేల కిలోమీటర్ల మేర సర్వే పూర్తి చేసింది. ఆర్‌అండ్‌బీ రోడ్లకు 3,188 కిలో మీటర్లు సర్వే పూర్తి చేసింది. మొదటి విడుతలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో పంచాయతీరాజ్ రోడ్లు 1011.89 కిలో మీటర్లు, ఆర్‌అండ్‌బీ 577.74 కిలో మీటర్లు, కరీంనగర్‌లో 696.38 పంచాయతీరాజ్, 576.94 కిలో మీటర్లు ఆర్అండ్‌బీ, మహబూబ్ నగర్ జిల్లాలో 1002.72 కిలో మీటర్లు పంచాయతీరాజ్, 629.72 కిలో మీటర్లు ఆర్‌అండ్‌బీ, ఖమ్మంలో 575.19 కిలో మీటర్లు పంచాయతీరాజ్, 646.36 కిలో మీటర్లు ఆర్‌అండ్‌బీ, మెదక్ జిల్లాలో 1084.10 కిలో మీటర్లు పంచాయతీరాజ్, 523.58 కిలో మీటర్లు ఆర్‌అండ్‌బీ, నల్లగొండ జిల్లాలో 1106.43 కిలో మీటర్లు పంచాయతీరాజ్, 696.68 కిలో మీటర్లు ఆర్‌అండ్‌బీ, నిజామాబాద్ జిల్లాలో 528.30 కిలో మీటర్లు పంచాయతీరాజ్, 362.46 కిలో మీటర్లు ఆర్‌అండ్‌బీ, రంగారెడ్డి జిల్లాలో 801.37 కిలో మీటర్లు పంచాయతీరాజ్, 465.74 కిలో మీటర్లు ఆర్‌అండ్‌బీ, వరంగల్ జిల్లాలో 1028.46 కిలో మీటర్లు పంచాయతీరాజ్, 711.13 కిలో మీటర్లు ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
విధివిధానాలపై కేబినెట్‌లో చర్చ
హామ్ ప్రాజెక్టు సంబంధించిన ప్రణాళికా పరమైన, సాంకేతిక, ఆర్థిక,న్యాయపరమైన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు, ప్రభుత్వానికి సలహాలు, సూచనల కోసం కన్సల్టెంట్లుగా ఆర్వే అసోసియేట్, లీ అసోసియేట్ సంయుక్త సంస్థను ప్రభుత్వం టెండర్ ప్రక్రియలో ఎంపిక చేసింది. హామ్ ప్రాజెక్టు డీపీఆర్‌లను కన్సల్టెంట్లు సిద్ధం చేయనున్నారు. దీనిపై కేబినెట్‌లో చర్చించిన తర్వాత హామ్ ప్రాజెక్టు విధివిధానాల ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత, పీఆర్‌శాఖ టెండర్ ప్రక్రియను మొదలుపెట్టనున్నది. హామ్ ప్రాజెక్టులో భాగంగా రోడ్డు నిర్మాణానికి సంబంధించి కొంత వాటాను ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన వాటాను టెండర్ దక్కించుకునే కంపెనీలే భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి గ్యారెంటీ ఉండదు. 15 ఏళ్ల పాటు సదరు కంపెనీ నిర్వహణ బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో హామ్ విధానం అమలవుతోంది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా త్వరితగతిన గ్రామీణ రహదారుల నిర్మాణం పూర్తి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా నిర్దేశించుకున్న గడువులోగా పనులు చేపట్టి పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
ప్రజాప్రతినిధుల ఆమోదం
రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో గల ప్రజా ప్రతినిధుల నుంచి ఆమోదం పొందిన తరువాత పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు రహదారుల ప్రతిపాదనలు ఖరారు చేసినట్లు సమాచారం. సమయం వృథా కాకుండా సమాంతరంగా సర్వే కొనసాగనుంది. రహదారుల నిర్మాణ పనులు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హామ్ పనుల పర్యవేక్షణ కోసం పీఆర్ఇంజినీరింగ్ హెడ్ ఆఫీస్‌లో ప్రత్యేక అధికారి నియమించారు. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాన్ని నోడల్ విభాగంగా నియమిస్తూ, కన్వీనర్‌గా ఈఎన్‌సీ పంచాయతీ రాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు సైతం సిద్ధమవుతున్నాయి. కన్సల్టెంట్ కంపెనీలు ఇచ్చే డీపీఆర్‌కు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించి కేబినెట్ ఆమోదం తీసుకుంటారు.
మూడు దశల్లో పనులు
ఈ ప్రాజెక్టును 3 దశల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశ పనులను 2026 జనవరిలో, రెండోదశ పనులను 2026 మార్చిలో, మూడో దశ పనులను 2026 జూన్‌లో ప్రారంభించనున్నారు. కన్సల్టెంట్‌లు, అధికారులు అంచనాలను తయారు చేసి టెండర్లు, అగ్రిమెంట్లు వివిధ పనులను చేపట్టనున్నారు.
Read Also: Farmers: ఆర్గనైజర్ల బరితెగింపు.. రైతుల పరిహారం దోచుకునే యత్నం?