State Civil corporation services: ప్రజాపంపిణీ వ్యవస్థలో మెరుగైన సేవలు అందిస్తున్నందుకు రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు సేవలు అందించడంలో ఆ శాఖా ముఖ్య కార్యదర్శి డి.ఎస్.చవాన్ తీసుకున్న నిర్ణయాలను గుర్తించిన హెచ్.వై.యం అంతర్జాతీయ సంస్థ రాష్ట్ర పౌర సరఫరాల శాఖను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గుర్తించి ఐ. ఎస్.ఓ సర్టిఫికేట్ ను అంద జేసింది.
యావత్ భారతదేశంలో ముందెన్నడూ లేని లేని రీతిలో విప్లవాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్దిదారులకు అందజేయడంతో పాటు కార్పొరేషన్ తీసుకొచ్చిన పలు సంస్కరణలను అధ్యయనం చేసిన ఈ సంస్థ నాణ్యత ప్రమాణాలు పాటించడంలో గుర్తించి ఐదు నక్షత్రాల రేటింగ్ తో కూడిన ఐ. ఎస్.ఓ 9001 సర్టిఫికెట్ ను రాష్ట్ర కార్పొరేషన్ కు ఆ సంస్థ అందజేసింది.
ఈ మేరకు ఈ రోజు మద్యాహ్నం ఎర్రమంజిల్ కాలనీలోని పౌర సరఫరాల కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆ శాఖా ముఖ్య కార్యదర్శి డి.ఎస్.చౌహన్ ఈ సర్టిఫికేట్ ను అందుకున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో యావత్ భారతదేశంలోనే రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఈ అరుదైన సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.
Also read: Minister Sridhar Babu: టూరిజం హబ్‌గా కాళేశ్వరం!
యావత్ ప్రపంచంలో ఎక్కడికీ పోయిన చెల్లుబాటు అయ్యే తీరులో రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ను తీర్చిదిద్దిన చౌహన్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు. ఇది పౌర సరఫరాల శాఖా సిబ్బంది సమిష్టి కృషికి వచ్చిన గుర్తింపు గా ఆయన పేర్కొన్నారు. ఐ. ఎస్.ఓ (9001:2015) సర్టిఫికెట్ తో పాటు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఐదు నక్షత్రాల రేటింగ్ సాధించడం శాఖా పని తీరు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబింప చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా ముఖ్య కార్యదర్శి డి.ఎస్.చౌహన్ వ్యాఖ్యానించారు.
ప్రజాపంపిణీ వ్యవస్థలో అద్భుతమైన సేవలు అందిస్తున్న పౌర సరఫరాల కార్పొరేషన్ సాధించిన ఈ ఘనత తెలంగాణా పౌర సరఫరాల శాఖకు ఓ మైలు రాయిగా చరిత్రలో నిలిచి పోతుందని చౌహన్ పేర్కొన్నారు. పౌర సరఫరాల కార్పొరేషన్ నిబద్ధతతో అమలు చేస్తున్న విధానాలే ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఆయన చెప్పారు.