Minister Seethakka: ప్రతిష్టాత్మకమైన IIM కోల్‌కతా ద్వారా సెర్ప్ సిబ్బందికి మూడు రోజులపాటు జరిగే శిక్షణ తరగతులకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అదనపు డిఆర్‌డివో లు, ప్రాజెక్ట్ మేనేజర్లు మొత్తం 70 మంది ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. మొదటి రోజు శిక్షణ కార్యక్రమంలో ఎంతో నేర్చుకున్నామని, సెర్ప్ సిబ్బంది తెలిపారు. మహిళలకు వ్యాపార మెళుకువలు నేర్పే విశాల ప్రపంచాన్ని తమకు పరిచయం చేసిన ఐఐఎం ప్రొఫెసర్లకు, లక్షలు ఖర్చు చేసి తమకు నేర్చుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏర్పాటై 25 సంవత్సరాలయింది. బ్యాంకుల ద్వారా వేలాది కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు ఇప్పిస్తూ, ముఖ్యంగా అవకాశాలకు దూరంగా ఉన్న వర్గాలను గుర్తించి వారికి చేయుతనిస్తోంది. పేదరిక నిర్మూలన దిశలో భాగంగా మహిళా సాధికారత కోసం సంస్థ కృషి చేస్తుందని అన్నారు.
Also read: Rangreddy distict: చెట్టే ఆఫీసు కొమ్మలే అధికారులు.. రైతు వినూత్న నిరసన!
స్వయం ఉపాధి నుంచి మహిళా సంఘాలను సంపద సృష్టికర్తలుగా తీర్చిదిద్ది కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.అందుకే మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు, సిబ్బందికి ఐఐఎం కోల్‌కతా ద్వారా శిక్షణ ఇప్పించడం ద్వారా ప్రజా ప్రభుత్వంలో సెర్ప్ తన లక్ష్యాలను చేరుకుంటుందని, ఎంపిక చేసిన 70 అధికారులకి మూడు రోజులపాటు శిక్షణ తరగతులు జరుగనున్నాయని తెలిపారు. ఐఐఎం ప్రొఫెసర్ల నుంచి ఎంతో నేర్చుకుంటున్నారని ఒకరోజు శిక్షణతో వారిలో నూతన ఉత్సాహం కనిపిస్తోందన్నారు.
ఇదే ఉత్సాహం క్షేత్రస్థాయి సిబ్బంది వరకు తీసుకెళ్లేందుకు ఇది చక్కటి అవకాశమని.. అందరూ నేర్చుకుని, ఈ వ్యాపార మెలకువలను, కొత్త ఆలోచనలను ఇతరులతో పంచుకోవాలని ఆదేశించారు. డిమాండ్ ఉన్న వ్యాపారాలను గుర్తించి మహిళా సంఘాలను ప్రోత్సహించాలని గొప్ప పథకాలు ఉన్నా, సంక్షేమంపై ప్రభుత్వం వేలకోట్లు వెచ్చిస్తున్నా, అధికారులు మనసుపెట్టి పని చేయకపోతే నిష్ప్రయోజనం అని అన్నారు.
జనాభాలో సగభాగం ఉన్న మహిళల అభివృద్ధే అసలైన అభివృద్ధి అంటూ మహిళల ఆర్థిక సమస్యలు తీరితేనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆకాంక్షించారు. మహిళా సంఘాలు ఒంటరి మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని మహిళా సంఘాల ద్వారా సామాజిక భద్రత లభిస్తోందని తెలిపారు.