Dharmapuri Arvind On KCR: బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నిప్పులు చెరిగారు. హడావిడిగా రెండేళ్లలోనే కాళేశ్వరం పూర్తి చేయాల్సిన అవసరం ఏమెుచ్చిందని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. కాళేశ్వరం ఒక తుప్పస్ ప్రాజెక్ట్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2019 లో ప్రాజెక్ట్ కు మరమత్తులు చేసి ఉంటే మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ కూలేది కాదని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు.
‘ఏ ముఖంతో సభ పెట్టారు’
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్రకార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ఆయన.. డీపీఆర్ అప్రూవల్ రాకుండానే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. అంత తొందర ఏంటి? డబ్బుల అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకొని రేపు రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ ఒరిజినల్ లొకేషన్ ను ఎందుకు మార్చారంటూ నిలదీశారు.
‘టెర్రరిస్టుల కంటే డేంజర్’
కేసీఆర్ కుటుంబం టెర్రరిస్ట్ ల కంటే ప్రమాదకరమని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అప్పటి సీఎం మెుదలుకొని.. సివిల్ ఇంజనీర్స్, కాంట్రాక్టర్ వరకు అందరూ కలిసే అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కల్వకుంట కుటుంబం ప్రాజెక్ట్ ను.. కనీసం ఇళ్లు కట్టే విధంగా కూడా నిర్మించలేదని మండిపడ్డారు. అన్నారం , సుందిల్ల ప్రాజెక్టు కూడా కృంగిపోయే ప్రమాదం ఉందని నివేదికలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ సొమ్ము దోచుకొని సభ పెడుతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Heavy Rains In AP: ఎండలు బాబోయ్ అనుకుంటున్నారా? ఇక 3 రోజులు దంచుడే దంచుడు..
సీబీఐ దర్యాప్తు అవసరం
కాళేశ్వరంలో జరిగిన అవినీతి బయటపడాలంటే సీబీఐ దర్యాప్తు జరగాలని ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. పూర్తి విచారణ జరిగితే కేసీఆర్ ఫ్యామిలీ (KCR Family) మొత్తం జైలు కు పోవడం ఖాయమని పేర్కొన్నారు. మరోవైపు రజతోత్సవ సభ నిర్వహణకు రూ.100 కోట్ల డబ్బు ఎక్కడ నుంచి వచ్చాయని కేటీఆర్ ను బీజేపీ ఎంపీ ప్రశ్నించారు. ఆయన ఉద్యోగం చేసి సంపాదించారా అంటూ నిలదీశారు.