బొకారో స్వేచ్ఛ: Maoist Encounter: వచ్చే ఏడాది మార్చి నాటికల్లా నక్సల్స్ రహిత భారత్‌ను ఆవిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో, మావోయిస్టుల ఏరివేత ప్రక్రియను భద్రతా బలగాలు మరింత ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌లో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా కమాండోలు, జార్ఖండ్‌లోని బొకారో జిల్లా పోలీసులు పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు.
జిల్లాలోని లాల్పానియా ప్రాంతంలోని లుగూ కొండల్లో ఉదయం 5.30 గంటల సమయంలో ఎదురుకాల్పులు మొదలయ్యాయని చెప్పారు. ఘటనా స్థలంలో 2 ఇన్సాస్ రైఫిల్స్, ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్), ఒక పిస్టల్ లభ్యమవ్వగా, వాటిని సీజ్ చేశామని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాల్లో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వివరించారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ సంచారంపై ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఆపరేషన్ మొదలుపెట్టామని పేర్కొన్నారు.
కాగా, నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లు జార్ఖండ్‌లో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 14న పశ్చిమ సింగ్భుమ్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన 11 బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఏడు ఐఈడీలను కూడా నిర్వీర్యం చేసినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ప్రయాగ్ మాఝీ హతం
తాజా ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ హతమయ్యాడు. ఇతడిని కరన్, లెతర, నాగ, ఫుచన పేర్లతోనూ పిలుస్తుంటారు. జాతీయ దర్యాప్తు సంస్థ మాంఝీపై కోటి రూపాయల రివార్డ్‌ను ప్రకటించింది. మృతుల్లో రామ్ మాంఝీ, అరవింద్ అనే కీలక మావోయిస్టులు ఉన్నారు. వారిపై రూ.10 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి. ప్రయాగ్ మాంఝీకి పలు రాష్ట్రాల్లో దాదాపు వందకు పైగా దాడుల్లో ప్రమేయం ఉన్నది.
Also Read: BRS Kavitha: ఖమ్మంపై కవిత ఫోకస్.. పెద్ద ప్లానే అంటూ టాక్?