Srinivas on Chennamaneni Ramesh: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు గతంలో హైకోర్టు భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పౌరసత్వాన్ని సవాలు చేస్తూ దాఖలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పరిహారం చెల్లించాలంటూ తీర్పు సైతం ఇచ్చింది. అయితే తాజాగా ఆ నగదు చెల్లింపును చెన్నమనేని రమేష్ చేసినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈరోజు చెన్నమనేని రమేష్.. రూ. 25 లక్షలు తన న్యాయవాది ద్వారా DD అందించినట్లు చెప్పారు. లీగల్ సెల్ కు సైతం మరో రూ.5 లక్షలు చెల్లించినట్లు తెలిపారు.
క్రిమినల్ కేసు పెట్టాలి..
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై 15 ఏళ్లుగా చేస్తూ వచ్చిన సుదీర్ఘ పోరాటంలో న్యాయమే గెలిచిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తప్పుడు ధ్రువ పత్రాలతో న్యాయస్థానాలను, ప్రభుత్వాలను చెన్నమనేని రమేష్ మోసం చేసినట్లు చెప్పారు. ఈ దేశ పౌరసత్వం లేకుండా 4 సార్లు మోసం చేసి గెలిచిన చెన్నమనేని రమేష్ పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని అన్నారు. 2009 నుండి 2023 వరకు అతను ఎమ్మెల్యే కాదని గెజిట్ నోట్ విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ ఎమ్మెల్యే కూడా కాకుండా అతనికి ప్రభుత్వం నుండి ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా చూడాలని అన్నారు.
చెన్నమనేని తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేయకుంటే పదేళ్ల క్రితమే నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని: ఆది శ్రీనివాస్
నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన చెన్నమనేని క్షమాపణలు చెప్పాలి.
చెన్నమనేని భారత పౌరుడు కాదని నేను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నా.
15 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో… pic.twitter.com/LCkjtZoM7h— ChotaNews App (@ChotaNewsApp) April 21, 2025
హైకోర్టు తీర్పు ఇదే
చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని సవాలు చేస్తూ ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ గతేడాది డిసెంబర్ లో హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయన జర్మనీ పౌరుడేనని తేల్చింది. విచారణలో తప్పుదోవ పట్టించిన రమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినందుకు రూ.30లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో క్లెయింట్ గా ఉన్న ఆది శ్రీనివాస్ కు రూ.25 లక్షలు, లీగల్ సర్వీస్ అథారిటీకి రూ. 5 లక్షలు చెల్లించాలని తెలిపింది. తాజాగా వాటిని చెన్నమనేని చెల్లించడం గమనార్హం.