BRS Silver jubilee celebrations: రజతోత్సవ సభను భారీగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సిద్ధమవుతోంది. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించ తలపెట్టిన ఈ సభకోసం ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓటమి ఇచ్చిన నిరాశ, నిస్పుృహ నుంచి కార్యకర్తలను బయటకు తీసుకొచ్చి ఈ సభ ద్వారా గట్టి సందేశం రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని ఆ పార్టీ యోచిస్తోంది. సభా ప్రాంగణం, పార్కింగ్ ఏరియాలు కలుపుకొని దాదాపు 1,213 ఎకరాల్లో సభ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి . ఈ నేపథ్యంలో రజతోత్సవ ఏర్పాట్లపై వర్ధన్నపేట ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాగుల పూడ్చివేత
రజతోత్సవ సభ కోసం వ్యవసాయ సాగు కాల్వలు, వాగులను బీఆర్ఎస్ పార్టీ ధ్వంసం చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఆరోపించారు. పార్కింగ్ కోసం వేయి ఎకరాలకు పైగా పొలాలు, చెలకలను చదును చేసినట్లు పేర్కొన్నారు. వెహికల్ రూట్ మ్యాప్ కోసం ఏకంగా ఎల్కతుర్తి పెద్దవాగును పూడ్చేసినట్లు చెప్పారు. దేవాదుల కాలువ సైతం పలుచోట్ల పూడ్చివేసినట్లు చెప్పారు. దేవాదుల 1ఆర్ 2ఆర్ డీ-6 కాల్వ మీదుగా దారులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాలువ పరిశీలన
రజతోత్సవ సభకు వెళ్లే దారికోసం పూడ్చిన దేవాదుల డీ-3 కాలువను తాజాగా వర్ధన్నపేట ఎమ్మెల్యే పరిశీలించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం వాగులను చేరిపేసి బాటలు వేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కళ్లు మూసుకొని పని చేస్తున్నారా? అంటూ నిలదీశారు. రజతోత్సవ సభకు వేలాది ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నా పట్టించుకోలేదెందుకు? అంటూ ప్రశ్నించారు. అధికారులకు తెలిసే అంతా జరుగుతున్నట్లు అనిపిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. పూడ్చి వేసిన పెద్ద వాగు, దేవాదుల కెనాళ్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Gold Rate Today : బంగారం ప్రియులకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ ధరలు?
సభ అందుకోసమేనా!
2001 ఏప్రిల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కాగా.. ఈ ఏడాదిలో 25వ వసంతంలోకి ఆ పార్టీ అడుగుపెట్టబోతోంది. దీంతో ఏడాది పొడవున వేడుకలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించి దానికి శంకుస్థాపన చేయాలని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎన్నికల ఓటమితో నిరాశలో ఉన్న కేడర్, లీడర్లలో ఈ సభ ద్వారా కొత్త ఉత్సాహం తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగి జిల్లా అధికారులతో వరుస సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు.